పార్టీ టికెట్‌ కావాలంటే ఇది తప్పనిసరి..

Congress Clarifies Social Media Account Must For Contest In Mp Assembly Polls - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టికెట్లను ఆశించే ఆశావహులకు కాంగ్రెస్‌ పార్టీ షాక్‌ ఇచ్చింది. సోషల్‌ మీడియాలో భారీగా ఫాలోవర్లు ఉన్నవారికే టికెట్లు ఇస్తామని కాంగ్రెస్‌ స్పష్టం చేసింది. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే నేతలు తప్పనిసరిగా ట్విటర్‌, ఫేస్‌బుక్‌లో ఖాతాలు కలిగిఉండాలని వెల్లడించింది. సోషల్‌ మీడియాలో చురుకుగా ఉండటమే కాకుండా నేతలకు ఫేస్‌బుక్‌లో కనీసం 15,000 లైకులు, ట్విటర్‌లో 5000 మంది ఫాలోవర్లను కలిగిఉండాలని, పెద్ద సంఖ్యలో వాట్సాప్‌ గ్రూపుల్లో ఉండాలని పేర్కొంది.

వారంతా మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ పోస్టులను రీట్వీట్‌ చేయాలని, లైక్‌ కొట్టాలని కోరింది. పార్టీ అధికారిక పేజీల్లో పోస్టులను తమ పేజీల్లో షేర్‌ చేయాలని సూచించింది. మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించే నేతలంతా ఈనెల 15లోగా వారి సోషల్‌ మీడియా ఖాతాల వివరాలను పార్టీకి అందచేయాలని కోరింది. మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో నెటిజన్లను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్‌, బీజేపీ శక్తివంచన లేకుండా శ్రమిస్తున్నాయి.

యువ ఓటర్లను ఆకట్టుకునేందుకు బీజేపీ సైబర్‌ సైనికులు, కాంగ్రెస్‌కు చెందిన రాజీవ్‌ సిపాయిలు నిమగ్నమయ్యారు. బీజేపీ ఇప్పటికే 65000 మంది సైబర్‌ సైనికులను రంగంలోకి దించగా, కాంగ్రెస్‌ పార్టీ తరపున 4000 మంది రాజీవ్‌ సిపాయిలు పనిచేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రత్యర్థి పార్టీలు తమపై బురద చల్లితే సోషల్‌ మీడియా వేదికగా తాము తిప్పికొడుతున్నామని బీజేపీ, కాంగ్రెస్‌ ఐటీ విభాగం చెబుతున్నాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top