చిటికెలో మురుగునీరు శుద్ధి!

Clean sewage in too fast - Sakshi

వినూత్న యంత్రాన్ని తయారు చేసిన బెంగళూరు శాస్త్రవేత్త 

రేడియో తరంగాలతో వ్యర్థాలకు చెక్‌.. రసాయనాల వాడకం నిల్‌ 

పారిశ్రామిక అవసరాల కోసం వాడే నీరు కలుషితమై చెరువులు, నదుల వంటి జలవనరుల్లో కలిసిపోతుంటాయి. ఈ మురుగు నీటి శుద్ధికి టెక్నాలజీలన్నీ మళ్లీ రసాయనాలపైనే ఆధారపడుతాయి. రసాయనాల ప్రమేయం లేకుండా మురుగు నీటి శుద్ధి చేసేందుకు బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న స్కాలీన్‌ టెక్నాలజీస్‌ కంపెనీ వినూత్న ఆవిష్కరణ చేసింది. దాని పేరే ఎఫ్‌పీస్టార్‌! ఇదో యంత్రం. రేడియో తరంగాలను సృష్టిస్తుంది. తగిన స్థాయిలో వీటిని వాడినప్పుడు మురుగునీటిలోని చెత్త ఓ చోట పేరుకుపోతుంది. దాన్ని తొలగించాక మిగిలిన నీటిని సాధారణ పద్ధతుల్లో దశల వారీగా ఫిల్టర్‌ చేస్తే చాలు.. స్వచ్ఛమైన నీరు అందుబాటులోకి వస్తుంది.

ఎనిమిదేళ్ల శ్రమ.. 
ఎఫ్‌పీ స్టార్‌ ఆలోచన వెనుక బెంగళూరుకు చెందిన శాస్త్రవేత్త రాజా విజయ్‌కుమార్‌ ఎనిమిదేళ్ల శ్రమ దాగి ఉంది. స్కాలీన్‌ టెక్నాలజీస్‌ కంపెనీ ఈయనదే. ఎఫ్‌పీ స్టార్‌ యంత్రం తయారీలో ఆయనకు స్ఫూర్తినిచ్చిన విషయం ఏమిటో తెలుసా... రక్తం గడ్డ కట్టే లక్షణం. రక్తంలోని ఫైబ్రినిన్‌లు గుంపులుగా ఒక దగ్గరకు చేరి.. చివరకు రక్తస్రావాన్ని ఆపేస్తాయి. ఎఫ్‌పీ స్టార్‌ పనిచేసేదీ అచ్చు ఇలాగే. ఇందులో మురుగు నీటిలోకి 30 వేల నుంచి 1.2 లక్షల వోల్టుల తీవ్రతతో కూడిన రేడియో తరంగాలను ప్రసరింపజేస్తారు. దీంతో సేంద్రియ వ్యర్థాలను చిన్న ముక్కలుగా విడగొట్టడంతో పాటు గుంపులుగా ఒకదగ్గరకు చేరేలా చేస్తారు. వీటిని సులువుగా వడపోస్తే సరిపోతుంది. ‘ఏ పదార్థానికైనా ఒక సహజ పౌనఃపున్యం ఉంటుంది. ఆ స్థాయికి తగ్గ రేడియో తరం గాలను ప్రయోగించినప్పుడు అవి అన్నీ ఒకదగ్గరకు చేరతాయి.’’అని స్కాలీన్‌ టెక్నాలజీస్‌ టెక్నికల్‌ ఎగ్జిక్యూటివ్‌ ఒమెన్‌ థామస్‌ తెలిపారు. మురుగునీటి శుద్ధి కేంద్రాల్లో శుద్ధి కాని రసాయనాలు కూడా ఇందులో సులువుగా వేరవుతాయి. మొత్తం ప్రక్రియను ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ ద్వారా కంప్యూటర్‌ నుంచి నియంత్రించొచ్చు. రేడియో తరంగాలతో మురుగును ఢీకొట్టించే బూమ్‌ ట్యూబ్‌లు సైజును బట్టి ఒకొక్కటి రోజుకు 75 వేల లీటర్ల మురుగును శుద్ధి చేయగలగదని ఒమెన్‌ ‘సాక్షి’కి తెలిపారు.

ఈరోడ్, కొడగుల్లో ఏర్పాటు..
తమిళనాడులోని ఈరోడ్‌లో రెండు ఎఫ్‌పీ స్టార్‌ యూనిట్లు ఇప్పటికే పనిచేస్తున్నాయి. పారిశ్రామికవాడల నుంచి కావేరీ నదిలోకి కలుస్తున్న కలుషిత జలాలను శుద్ధి చేసేం దుకు ప్రభుత్వం వీటిని ఏర్పాటు చేసింది. 2 యూనిట్ల ద్వారా రోజుకు దాదాపు 2.4 లక్షల నీరు శుద్ధి అవుతోంది. కర్ణాటకలోని కొడగు ప్రాంతంలోని కాఫీ తయారీ కంపెనీలోనూ దీన్ని వాడుతున్నారు. కాఫీ గింజల తయారీలో ఏర్పడే కలుషిత నీటిలో దాదాపు 2.5 లక్షల లీటర్లను రోజూ శుద్ధి చేస్తున్నారు. విజయ్‌కుమార్‌ నేతృత్వంలోని స్కాలీన్‌ టెక్నాలజీస్‌ ఇళ్లల్లో వాడుకునే ఇంకో యంత్రాన్ని కూడా తయారు చేసింది. అక్వారియా అని పిలిచే ఈ యంత్రం గాలిని శుద్ధి చేసి.. అందులోని తేమను తాగునీటిగా మార్చి అందజేస్తుంది. అక్వారియాతో తయారయ్యే నీరు స్వచ్ఛంగా ఉంటుందని చెబుతున్నారు. రోజుకు దాదాపు 30 లీటర్ల నీటిని తయారు చేయగల ఈ యంత్రం ఖరీదు దాదాపు రూ.80 వేలు.    
– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌ 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top