
సాక్షి, న్యూఢిల్లీ : మసూద్ అజర్ విషయంలో చైనా అధికార దుర్వినియోగానికి పాల్పడిందని భారత రక్షణ శాఖ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. పఠాన్‌కోట్ దాడికి సూత్రధారి అయిన మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని భారత్ ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించిన విషయం తెలిసిందే. భద్రతామండలిలోని 1267 నిషేధాల కమిటీ ముందు అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లు మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించే తీర్మానాన్ని ప్రవేశపెట్టగా చైనా దానిని వరుసగా నాలుగోసారి అడ్డుకుంది.
సమితిలో చైనా ప్రవర్తించిన విధానం వల్ల.. భారత్‌తో బంధాలు ప్రమాదకరస్థాయిలోకి వెళ్లే అవకాశముందని రక్షణ శాఖ నిపుణులు పీకే సింగ్ తెలిపారు. చైనా సమితిలో తనకు ఉన్న వీటో అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. భారత్‌తో బంధాన్ని చైనా కాదనుకుంటోంది అని చెప్పడానికి ఇదే నిదర్శనమని ఆయన అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదం విషయంలో చైనా అసుసరిస్తున్న ద్వంద్వ ప్రమాణాలకు ఇదొక తార్కాణమని మరో రక్షణశాఖ నిపుణుడు రాహుల్ జలాల్ అన్నారు.
మసూద్ అజర్ విషయంపై చైనా విదేశాంగ శాఖ కార్యదర్ధి హు చునియాంగ్ మాట్లాడుతూ.. మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించే విషయంలో కొన్ని అభిప్రాయబేధాలున్నాయని చెప్పారు. మసూద్ అజర్‌పై భారత్ చాలా అంశాలకు వివరణ ఇవ్వలేదని ఆరోపించారు.