కొడుకు అంత్యక్రియలు.. గద్గద స్వరంతో తల్లి పాట..!

రాయ్‌పూర్: నవమాసాలు మోసి.. కనిపెంచిన తల్లి బిడ్డ క్షేమమే తన క్షేమమని తలుస్తుంది. పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకుంటుంది. వారికి కావాల్సింది సమకూర్చి ఆనందిస్తుంది. అదేసమయంలో చివరి ఘడియల్లో కన్నవారు తనకిష్టమైన పని చేయాలని కోరుకుంటుంది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన ఓ తల్లి కూడా ఇలాగే అనుకుంది. కానీ, ఆమె ఆశలు అడియాశలయ్యాయి. చేతికి అందివచ్చిన కుమారుడి అకాల మరణంతో ఆమె శోకసంద్రంలో మునిగిపోయింది. అంతటి దుఃఖ సమయంలో కూడా తనయుడికి ఇష్టమైన పాటపాడి మాతృ హృదయాన్ని చాటింది.
చోలా మాటి కే రామ్..
సూరజ్ తివారి ఓ జానపద గాయకుడు. అతని తల్లి పూనర్ విరాట్ కూడా గాయకురాలు కావడం విశేషం. అయితే గత కొంతకాలంగా సూరజ్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. చికిత్స అనంతరం కాస్త కోలుకున్న అతను నాలుగు రోజుల క్రితం ఓ కార్యక్రమంలో పాటపాడుతూ గుండెపోటుకు గురయ్యాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచాడు. ఇక సూరజ్ అంత్యక్రియల సమయంలో పూనర్ తన కుమారుడికి ఇష్టమైన ‘చోలా మాటి కే రామ్.. ఏకర్ కా భరోసా’ పాటపాడి కడసారి వీడ్కోలు పలికారు. సూరజ్ స్నేహితులు డప్పులు వాయించారు. గద్గగ స్వరంతో పూనర్ పాడిన పాటపై సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురుస్తోంది. చోలా మాటి కే రామ్.. ఛత్తీస్‌గఢ్‌లో చాలా పాపులర్ పాట.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి