తిండికలిగితే.. కండగలదోయ్‌

Central Govt Announced September month as the Nutrition  - Sakshi

సెప్టెంబర్‌ను పోషకాహార మాసంగా ప్రకటించిన కేంద్రం

పోషకాహారం ప్రజలందరికీ చేరకపోవడం అతిపెద్ద సమస్య. ప్రపంచ దేశాలన్నీ వివిధ వేదికలపై దీని గురించి మాట్లాడుతూ ఉన్నాయి. పోషకాహార లోపం వల్ల ఆర్థిక వ్యవస్థకు, మానవాభివృద్ధికి వాటిల్లుతున్న నష్టాన్ని జాతీయ, అంతర్జాతీయ సర్వేలు ఎప్పటికప్పుడు ఎత్తిచూపుతున్నాయి. ఐక్యరాజ్యసమతి ఈ అంశాన్ని సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాల్లో (ఎండీజీ) భాగం చేసింది. అయినా ప్రపంచ దేశాలు ముఖ్యంగా భారత్‌ వంటి దేశాలు పోషకాహార లేమిపై మొక్కుబడిగా వ్యవహరిస్తున్నట్లు గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌ నివేదికలు, జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేల గణాంకాలు రుజువు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో జాతీయ పోషకాహార మిషన్‌ (ఎన్‌ఎన్‌ఎం)ను ఓ ఉద్యమంలా ముందుకు తీసుకుపోవాలని కేంద్రం భావిస్తోంది. ఇందులో భాగంగా సెప్టెం బర్‌ను జాతీయ పోషకాహార మాసంగా ప్రకటించింది. దేశవ్యాప్తంగా 11 కోట్ల మందికి పోషకాహార సందేశాన్ని చేరవేయాలనుకుంటోంది. 

రక్తహీనతపై  అవగాహన.. 
గర్భిణుల ఆరోగ్య సంరక్షణ, రక్తహీనత నివారణ, పిల్లల పెరుగుదలపై పర్యవేక్షణ, పరిశుభ్రత వంటి అంశాలపై ఈ సందర్భంగా ప్రజల్లో అవగాహన కల్పించాలని కేంద్రం భావిస్తోంది. బాలికలకు విద్య, పోషకాహారం అందచేయాల్సిన అవసరం, తగిన వయసులోనే పెళ్లి చేయడం వంటి అంశాల్ని కూడా ప్రచారంలో పెట్టనుంది. పిల్లలకు తల్లిపాలు, అనుబంధ ఆహారాన్ని తగిన మేరకు అందచేయాల్సిన ఆవశ్యకతను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది. మేళాలు, పోషణ్‌ వాక్స్, వంటకాల ప్రదర్శనల వంటి ప్రజల దృష్టిని ఆకర్షించే కార్యక్రమాలు చేపట్టనుంది. నీతి ఆయోగ్‌ సహా పలు కేంద్ర ప్రభుత్వ శాఖలు ఇందులో పాత్ర పోషించనున్నాయి. 42 కమ్యూనిటీ రేడియోలు, పంచాయతీరాజ్‌ ప్రతినిధులు, టీచర్లు, స్వయం సహాయక గ్రూపులు, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లు తదితరులు ప్రచార కార్యక్రమాల్లో భాగం కానున్నారు. 

మెరుగైన ఫలితాల కోసం.. 
గర్భిణులు, పాలిచ్చే తల్లులు, పిల్లల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు ఉద్దేశించిన సమీకృత శిశు అభివృద్ధి పథకం (ఐసీడీఎస్‌) 1975 నుంచి అమలవుతోంది. గత యూపీఏ ప్రభుత్వం ఇందులోని కొన్ని లక్ష్యాలను 2005లో తీసుకొచ్చిన ‘నేషనల్‌ హెల్త్‌ మిషన్‌’లో భాగం చేసింది. 2022 నాటికి దేశంలో పోషకాహార సమస్యను పారదోలుతామంటున్న ఎన్డీయే ప్రభుత్వం.. ఈ దిశగా అమలు చేయదగ్గ కార్యాచరణ ప్రణాళిక తయారు చేసింది. ఇందులో భాగంగా రూ.9,046.17 కోట్లతో నేషనల్‌ న్యూట్రిషన్‌ మిషన్‌ను అమల్లోకి తెచ్చింది. 

దేశంలో ఐదేళ్లలోపు పిల్లల్లో ఎదుగుదల లోపించిన వారు 38.4 శాతం మంది ఉన్నారు. 2022 నాటికి దాన్ని 25 శాతానికి తగ్గించాలనేది ఈ పథకం ఉద్దేశాల్లో ఒకటి. ఏటా స్త్రీలలో పోషకాహార లోపాన్ని 2 శాతం మేరకు, కిశోర బాలికల్లో రక్తహీనతను 3 శాతం మేర, బరువు తక్కువ జననాలను 2 శాతం మేర తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సాంకేతికత సాయంతో పర్యవేక్షించడం, నిర్దేశిత లక్ష్యాలు సాధించిన రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు.. ఐటీ ఆధారిత పరికరాలు ఉపయోగించే అంగన్‌వాడీ వర్కర్లకు.. ప్రోత్సాహకాలివ్వడం, సామాజిక తనిఖీలు చేయడం, పోషకాహార వనరుల కేంద్రాలు ఏర్పాటు చేయడం, ‘పోషణ’తో సంబంధమున్న పలు శాఖల్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగడం వంటి కార్యకలాపాల ద్వారా ముందెన్నడూ లేని రీతిలో మెరుగైన ఫలితాలు సాధించాలని ప్రభుత్వం భావిస్తోంది. 2017–18, 2019–20 మధ్య 10 కోట్ల మందికి పైగా ప్రజలకు ఈ పథకం ఫలాలు అందించాలని సంకల్పించింది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top