
బామ్మ కోరిక తీరకుండా చేసిన దొంగ
ఓ దొంగ తన కారును ఎత్తుకుపోయి బామ్మ చివరి కోరిక తీరకుండా చేశాడు. ఆమె అస్తికలు గంగా నదిలో కలపకుండా చేసి ఓ మనుమడిని విషాదంలో మునిగేలా చేశాడు.
నోయిడా: ఓ దొంగ తన కారును ఎత్తుకుపోయి బామ్మ చివరి కోరిక తీరకుండా చేశాడు. ఆమె అస్తికలు గంగా నదిలో కలపకుండా చేసి ఓ మనుమడిని విషాదంలో మునిగేలా చేశాడు. ఎందుకంటే ఆ దొంగ ఎత్తుకుపోయిన ఆ కారులోనే బామ్మ అస్తికలతో కూడిన కలశం ఉంది కనుక. వివరాల్లోకి వెళితే.. నోయిడాలోని సెక్టార్ 27కు చెందిన సుమిత్ అనే 25 ఏళ్ల వ్యక్తికి ఓ బామ్మ ఉంది. ఆమె తీవ్ర అనారోగ్యంతో చనిపోయింది. దీంతో ఆమె అంత్యక్రియలు నిర్వహించి చితా భస్మాన్ని ఓ కలశంలో ఉంచి తన కారులో పెట్టాడు.
ఇంటికొచ్చాక కారును ఇంటిముందు పార్క్ చేసి పని పూర్తి చేసుకొని గంగానదిలో కలిపేందుకు వెళదామని బయటకెళ్లి చూడగా ఆ కారును ఎవరో ఎత్తుకెళ్లారు. ఆ కారును ఎత్తుకెళ్లడం చూశామని చుట్టుపక్కలవారు చెప్పడంతో ఆ వైపుగా పరుగెత్తినప్పటికీ లాభం లేకుండాపోయింది. ఆ దొంగ కారుతో పారిపోయాడు. ఇప్పటికీ ఐదు రోజులైనా కారు జాడ తెలియలేదు. ఆ దొంగ ఇప్పటికే ఈ కలశాన్ని పారేసి ఉండొచ్చని, కారు బెంగకంటే తన బామ్మ చివరి కోరికను తీర్చలేకపోయానే అన్న బాధ తనకు ఎక్కువగా ఉందని అతడు వాపోతున్నాడు.