రుణం చెల్లించనందుకు బస్సు ‘హైజాక్‌’!

Bus hijacked in Karnataka to recover loan money - Sakshi

బెంగళూరులో ఫైనాన్స్‌ సిబ్బంది నిర్వాకం  

సాక్షి, బెంగళూరు: తీసుకున్న రుణం చెల్లించనందుకు ఓ సంస్థకు చెందిన బస్సును ప్రయాణికులు ఉండగానే ఫైనాన్స్‌ సిబ్బంది హైజాక్‌ చేసిన ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. బెంగళూరు నుంచి కేరళకు 42 మంది ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సును ఆర్‌.ఆర్‌.నగర్‌లో శుక్రవారం రాత్రి రెండు బైక్‌లపై వచ్చిన దుండగులు అడ్డుకున్నారు. తాము పోలీసులమనీ, తనిఖీలు చేయాలంటూ ప్రయాణికులతో సహా బస్సును సమీపంలోని గోడౌన్‌కు  తరలించారు. అనంతరం అక్కడకు మరో ఏడుగురు చేరుకున్నారు. గోడౌన్‌కు తాళం వేసి బస్సును కదలకుండా చేశారు.

దీంతో భయపడ్డ ప్రయాణికులు కొందరు ఫోన్‌ ద్వారా పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులను చూసిన దుండగులు అక్కడ్నుంచి పరారయ్యేందుకు యత్నించారు. దీంతో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగతా నిందితులు ఘటనాస్థలం నుంచి పరారయ్యారు. బస్సు కొనుగోలు సమయంలో ఇచ్చిన అప్పును యజమాని తిరిగిచెల్లించకపోవడంతో సదరు ఫైనాన్సింగ్‌ సంస్థ ఈ నిర్వాకానికి ఒడిగట్టిందని పోలీసులు తెలిపారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top