
సాక్షి, హైదరాబాద్ : పన్ను మినహాయింపులల్లో వేతన జీవులకు ఊరటనివ్వని అరుణ్ జైట్లీ.. దేశాధినేతలు, రాష్ట్రసారథులను మాత్రం సముచితంగా గౌరవించారు. రాష్ట్రపతి వేతనాన్ని రూ.5 లక్షలకు, ఉపరాష్ట్రపతి వేతనాన్ని రూ.4లక్షలకు, గవర్నర్ల వేతనాలను రూ.3.5 లక్షలకు పెంచుతున్నట్లు జైట్లీ ప్రకటించారు. ఇటు పార్లమెంట్ సభ్యుల జీతభత్యాలపైనా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ప్రతి ఐదేళ్లకు ఒకసారి పెరుగుతాయని చెప్పారు.జైట్లీ ఈ మాట చెప్పినప్పుడు లోక్‌సభ చప్పట్లతో మారుమోగింది.
‘‘రాష్ట్రపతి వేతనాన్ని రూ.1.50 లక్షల నుంచి రూ.5లక్షలకు, ఉపరాష్ట్రపతి వేతనాన్ని రూ.1.30 లక్షల నుంచి రూ.4 లక్షలకు, గవర్నర్ల వేతనాన్ని రూ.1.10లక్షల నుంచి రూ.3.5 లక్షలకు పెంచుతున్నాం. ఈ పెంపు 2018 జనవరి నుంచే వర్తిస్తుంది. ఇక ఎంపీల జీతభత్యాల పెంపునకు విధానాన్ని రూపొందించాం. ద్రవ్యోల్బణాన్ని అనుసరించి ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఎంపీల జీతాలు ఆటోమెటిక్‌గా పెరుగుతాయి’’ అని జైట్లీ చెప్పారు.