మహానగర పాలక సంస్థ (బీఎంసీ) స్థాయీ సమితిలో జరిగే....
సాక్షి, ముంబై: మహానగర పాలక సంస్థ (బీఎంసీ) స్థాయీ సమితిలో జరిగే వివిధ అంశాలపై జరిగే చర్చల్లో కార్పొరేటర్ల వ్యాఖ్యలను రికార్డు చేయాలని పరిపాలన విభాగం నిర్ణయించింది. దీంతో అందుకు అవసరమైన ఆధునిక విద్యుత్ యంత్ర సామగ్రి, సిబ్బందిని సమకూర్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని బీఎంసీ కమిషనర్ సీతారాం కుంటే ఆదేశించారు. పార్లమెంట్‌లో జరుగుతున్న కార్యకలాపాలను రికార్డు చేస్తున్నారు. అదేవిధంగా లోక్‌సభ న్యూస్ చానెల్ ద్వారా బయట ప్రపంచానికి ప్రసారం చేస్తున్నారు.
ఇలా చేయడంవల్ల తమ ప్రాంత ప్రతినిధి లోక్‌సభలో ఏం మాట్లాడుతున్నారు..? ఏ సమస్యలపై చర్చిస్తున్నారు...? అనేది ఇంట్లో కూర్చున్న సామాన్య ప్రజలకు సైతం తెలుస్తోంది. ఇదే తరహాలో విధానసభ, విధాన పరిషత్‌లో జరిగే కార్యకలాపాలను కూడా చిత్రీకరిస్తున్నారు. ఇదే తరహాలో బీఎంసీకి చెందిన స్థాయీ సమితీతిలో కార్పొరేటర్లు అనేక డిమాండ్లపై, అభివృద్ధి పనులపై, బిల్లుల మంజూరుపై జరుపుతారు. అందులో ఏ కార్పొరేటర్... ఏ అంశాలపై మాట్లాడుతున్నారు..? బయటకు తెలియదు.
తమ పరిధిలోని కార్పొరేటర్ అభివృద్థి పనులపై ఎలాంటి చర్చలు జరిపారనేది ఆయా డివిజన్ల ప్రజలకు తెలియాలంటే వారి మాటలు రికార్డు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆరేళ్ల కిందటే అప్పటి ప్రతిపక్ష నాయకుడు రాజ్‌హంస్ సింగ్ సభాగృహంలో ప్రతిపాదించారు. అప్పటినుంచి ఆ డిమాండ్‌పై చర్చ జరుగుతూనే ఉంది. ఎట్టకేలకు బీఎంసీ పరిపాలనా విభాగం కార్యకలాపాల రికార్డింగ్‌కు మంజూరునిచ్చింది. అయితే ఈ ప్రక్రియ నిమిత్తం సభాగృహంలో అనేక మార్పులు చేపట్టాల్సి ఉంటుంది. అలాగే ఆధునిక సాంకేతిక పరికరాలను కొనుగోలు చేయాలి. కార్పొరేటర్ల మాటలను రికార్డు చేయడానికి, వాటిని భద్రపర్చడానికి ప్రత్యేకంగా ఒక లైబ్రరీ కావాలి. అందుకు అవసరమైన నిధులు బీఎంసీ ఆర్థిక బడ్జెట్‌లో మంజూరు చేయాల్సి ఉంటుందని కమిషనర్ కుంటే వివరించారు.