
మోదీని ఇరుకున పెట్టిన బీజేపీ ఎంపీ
బీజేపీ ఎంపీ భోలా సింగ్ బుధవారం లోక్ సభలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ భోలా సింగ్ బుధవారం లోక్ సభలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ భారత దేశానికి బుద్ధి లేదని ఆయన కామెంట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎందుకు ప్రవేశపెట్టిన 'స్మార్ట్ సిటీస్' పథకంపై మాట్లాడుతూ ఆయన ఈ మాటలు అన్నారు. 'స్మార్ట్ సిటీస్' పథకం అభివృద్ధి చెందిన నగరాలకే ఉపయోగపడుతుందని, ప్రాంతీయ అసమానతలు తలెత్తే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ సభలో ఉండగానే సొంత పార్టీని ఏకీపారేశారు.
'ఈశాన్య భారత్ లో అభివృద్ధి లేదు. ఎందుకంటే అక్కడ వివేకం ఉంది. పశ్చిమ భారత్ లో అభివృద్ధి ఉంది కానీ వివేకం లేద'ని ఆయన వ్యాఖ్యానించారు. ఈశాన్య రాష్ట్రాల్లో 'బ్రెయిన్స్' ఉన్నాయి కానీ అభివృద్ధి లేదని ప్రధాని మోదీ గతంలో అన్న మాటలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. సింగ్ వ్యాఖ్యలతో మోదీ ఇరుకున పడ్డారు.
అయితే మోదీ అటువంటి వ్యాఖ్యలు చేయలేదని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. అన్ని ప్రాంతాల్లోనూ వివేకవంతులు ఉన్నారని చెప్పారు. భోలా సింగ్ వ్యాఖ్యలతో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు ఏకీభవించడం విశేషం. బిహార్ లోని బెగుసరాయ్ నియోజకవర్గానికి భోలా సింగ్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు.