ఫీజులుంపై బిట్స్‌ పిలానీ విద్యార్థుల ఆగ్రహం

BITS Students Protest Over Fee Hike In All Campuses - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : బిట్స్‌ పిలానీ విద్యార్థులు ఫీజుల పెంపునకు నిరసనగా హైదరాబాద్‌, గోవా, పిలానీ క్యాంపస్‌ల్లో మూకుమ్మడి నిరసనలకు దిగారు. 2018-19 సంవత్సరానికి పెంచిన ఫీజులను తక్షణమే ఉపసంహరించాలని విద్యార్థులు డిమాండ్‌ చేశారు. 2011 నుంచి బిట్స్‌ పిలానీ మూడు క్యాంపస్‌ల్లో ఫీజులను రెట్టింపు చేశారని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. 2011లో ఫీజును ఏకంగా 56 శాతం పెంచిన విద్యాసంస్థ అధికారులు ఆ తర్వాత మరింతగా పెంచారని చెప్పారు. 2011లో రూ 62.400గా ఉన్న ఫీజులు 2017 నాటికి ఏకంగా రూ 1,30,000కు పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత, రాబోయే బ్యాచ్‌లకు బిట్స్‌లో విద్య ఖరీదైన వ్యవహారంగా మారిందని విద్యార్ధులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తొలుత బిట్స్‌ పిలానీలో 3000 మంది విద్యార్ధులు ఆదివారం శాంతియుత నిరసనలకు దిగగా, వెనువెంటనే గోవా, హైదరాబాద్‌ క్యాంపస్‌ విద్యార్ధులు సైతం వారికి జతకలిశారు. మరోవైపు ‘రోల్‌బ్యాక్‌బిట్స్‌పిలానీఫీహైక్‌’  హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్‌ మీడియాలోనూ విద్యార్ధులు ఆందోళన ఉధృతం చేశారు.

ఈ క్యాంపెయిన్‌ ప్రస్తుతం ట్విటర్‌లో వైరల్‌ అవుతోంది. ఇక ఫీజులు భరించలేకపోతే డ్రాప్‌ అవుట్‌ అవండి అంటూ బిట్స్‌ పిలానీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ అశోక్‌ సర్కార్‌ ప్రకటన చేశారనే వార్తలపై పలువురు విద్యార్ధులు భగ్గుమంటున్నారు. భారీగా ఫీజులు పెంచడంపై మండిపడుతున్న విద్యార్ధులు ఆన్‌లైన్‌ పిటిషన్‌ను కూడా నెట్‌లో పొందుపరిచారు. బిట్స్‌ పిలానీ అధికారులు మాత్రం ఇంతజరుగుతున్నా ఇప్పటివరకూ నోరుమెదపలేదు.

సంబంధిత వార్తలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top