
విదేశీ ప్రతిభావంతుల కోసం కొత్తగా కే–వీసా
అక్టోబర్ నుంచి జారీ
బీజింగ్: హెచ్–1బీ వీసా వార్షిక రుసుమును పెంచేసి అమెరికా విదేశీ ప్రతిభావంతులను దూరం చేసుకుంటుంటే ఇదే అదనుగా వాళ్లకు చైనా స్వాగతం పలుకుతోంది. కీలకమైన సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మెడిసిన్(స్టెమ్) కోర్సుల్లో పట్టభద్రులైన విదేశీ నిపుణులు సులభంగా తమ కొత్త కే–వీసా పొంది తమ దేశంలో హాయిగా ఉద్యోగాలు చేసుకోవచ్చని చైనా ప్రభుత్వం ప్రకటించింది.
ఈ మేరకు అక్టోబర్ నుంచి కొత్త కేటగిరీ అయిన కే–వీసాల జారీ ప్రక్రియను ప్రారంభించబోతున్నట్లు ఆదివారం పేర్కొంది. కొత్త కేటగిరీ వీసాల జారీకి వీలుగా విదేశీయుల రాకపోకల అడ్మినిస్ట్రేషన్ నిబంధనల్లో మార్పులు తీసుకొచ్చారు. అమెరికా సహా పలు సంపన్న దేశాలు స్థానికుల ఉద్యోగకల్పనకు ప్రాధాన్యతనిస్తూ వర్క్ వీసా నిబంధనలను కఠినతరం చేస్తుండటంతో విదేశీ ప్రతిభావంతులను ముఖ్యంగా దక్షిణాసియా యువ ప్రతిభను ఒడిసిపట్టేందుకు చైనా ఇలా కొత్త కేటగిరీ వీసాను తెస్తోంది.
చైనా లేదా విదేశీ ప్రముఖ విశ్వవిద్యాలయాలు, ఇన్‌స్టిట్యూట్‌లలో స్టెమ్ కోర్సుల్లో బ్యాచిలర్ డిగ్రీ లేదా ఆపై ఉత్తీర్ణత సాధించిన యువ శాస్త్ర, సాంకేతిక నిపుణులకు కే–వీసాను ఇవ్వనున్నారు. బోధన, పరిశోధనారంగంలో ఉన్న వాళ్లూ కే–వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎక్కువ రోజుల కాలపరిమితి, ఎక్కువ సార్లు స్వదేశాలకు రాకపోకలు సాగించే వెసులుబాటు, రెన్యూవల్ సదుపాయం వంటి మరిన్ని ఫీచర్లను కే–వీసాకు జోడించారు.
హెచ్–1బీ వీసా రావాలంటే అమెరికాలోని కంపెనీయే స్వయంగా వీసా దరఖాస్తుదారుడిని సిఫార్సు చేయాల్సి ఉంటుంది. చైనా కే–వీసాకు అలాంటి కఠిన షరతులు లేవని తెలుస్తోంది. విదేశీయులు చైనాలో విద్య, సాంస్కృతిక, శాస్త్ర, సాంకేతికత, అంకుర వ్యాపార, వాణిజ్య కార్యకలాపాల్లో పాల్గొనేందుకు కే–వీసా అనుమతిస్తుంది. ఇన్నాళ్లూ అమెరికాకు పొలోమంటూ వెళ్లిన సృజనాత్మక, ప్రతిభావంత యువతను తమ వైపునకు తిప్పుకోవాలని చైనా అభిలషిస్తోంది.