భుజంపై కూతురి శవంతో 4 కి.మీ!

Bihar shame: Man walks 2 km with daughter's body who died at AIIMS

పట్నా: బిహార్‌లో మరో దారుణం. పట్నాలోని ఎయిమ్స్‌ ఆస్పత్రిలో ఓపీ కార్డు కావాలంటే క్యూలైన్‌లోనే రావాలని అధికారులు చెప్పడంతో ఆ కార్డు తెచ్చేలోగా ఓ చిన్నారి(9) ప్రాణాలు కోల్పోయింది. చివరికి ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత మృతదేహాన్ని తీసుకెళ్లేందుకూ అంబులెన్స్‌ ఇవ్వడానికి కూడా ఆస్పత్రి సిబ్బందికి మనసొప్పలేదు. దీంతో వేరే గతిలేక ఆ తండ్రి తన కుమార్తె శవాన్ని 4 కిలోమీటర్ల పాటు భుజాన మోసుకుంటూ వెళ్లాడు.

బిహార్‌లోని లక్షిసరై జిల్లా కజ్రా గ్రామానికి చెందిన రామ్‌ బాలక్‌ దంపతుల కుమార్తె రౌషణ్‌ కుమారి ఆరు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతుండటంతో మంగళవారం ఎయిమ్స్‌ ఆస్పత్రికి తెచ్చారు. అక్కడి సిబ్బంది తొలుత ఔట్‌ పేషంట్‌(ఓపీ)కార్డు తేవాలని చెప్పారు. నిరుపేద కూలి అయిన రామ్‌ బాలక్‌ ఓపీ కార్డు కోసం యత్నిస్తుండగా.. కుమార్తె పరిస్థితి తీవ్రంగా ఉందని అతని భార్య తెలిపింది. దీంతో వెంటనే తనకు ఓపీ కార్డు మంజూరు చేయాలనీ, తన చిన్నారి పరిస్థితి తీవ్రంగా ఉందని కౌంటర్‌లో ఉన్న అధికారిని అభ్యర్థించారు. తనను ముందుకు వెళ్లనివ్వాలని లైన్లో ఉన్నవారిని వేడుకున్నారు.

అయితే ఓపీ కార్డులిచ్చే ఆయన ససేమిరా అన్నారు.చివరికి ఓపీ కార్డు తీసుకుని వచ్చేసరికి రోషణ్‌ కుమారి ప్రాణాలు కోల్పోయింది. దీనికి తోడు చనిపోయిన కుమార్తె శవాన్ని ఇంటికి తీసుకెళ్లడానికి కనీసం అంబులెన్స్‌ ఏర్పాటు చేయాలని కోరిన రామ్‌బాలక్‌ విన్నపాన్నీ ఎయిమ్స్‌ అధికారులు తిరస్కరించారు. ప్రైవేటు వాహనం ఏర్పాటు చేసుకునే స్తోమత లేకపోవడంతో, రామ్‌ బాలక్‌ కూతురి శవాన్ని భుజాన వేసుకుని 4 కి.మీ. నడిచివెళ్లారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top