ఇంజనీరింగ్‌లో వేదాంతం

Bhagavad Gita In Engineering Syllabus In Anna University - Sakshi

నిర్బంధ పాఠ్యాంశాలుగా సంస్కృతం, భగవద్గీత 

అన్నావర్సిటీ నిర్ణయం

ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాల ఖండన

సాక్షి, చెన్నై: వర్సిటీ పరిధిలోని అన్ని ఇంజనీరింగ్‌ కాలేజీల్లో భగవద్గీత పాఠాలను బోధించాలని తమిళనాడులోని అన్నా యూనివర్సిటీ నిర్ణయం తీసుకుంది. ఇంజనీరింగ్‌ సిలబస్‌లో భగవద్గీతను చేరుస్తూ అకస్మాత్తుగా నిర్ణయం తీసుకుంది. అయితే వర్సిటీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని పలు రాజకీయపార్టీలు, విద్యార్థి సంఘాలు తప్పుపడుతున్నాయి. ఇంజనీరింగ్‌ విద్యకు సంబంధించిన పాఠ్యాంశాల పథకంలో ఆలిండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ (ఏఐసీటీఈ) ఉన్నతస్థాయి కమిటీ మార్పులు, చేర్పులు, మరింత మెరుగులు దిద్దడం వంటివి చేపడుతుంటుంది. ఏఐసీటీఈ రూపొందించిన పాఠ్యాంశాల పథకాన్ని ఇంజినీరింగ్‌ కాలేజీలు అమలుచేస్తుంటాయి. అయితే అన్నావర్సిటీకి అనుబంధంగా ఉన్న ఇంజినీరింగ్‌ కాలేజీ పాఠ్యాంశాల పథకాన్ని మాత్రం వర్సిటీనే తయారుచేసుకుంటుంది.

ఇదిలాఉండగా ఈ ఏడాది జూన్‌లో ఏఐసీటీఈ విడుదల చేసిన మార్గనిర్దేశం ప్రకారం ఇంజనీరింగ్‌ విద్యలోని 32 పాఠ్యాంశాల్లో మూడింటిని ఆప్షన్‌ సబ్జెక్టులుగా ఎన్నుకుని 3,4,5వ సెమిస్టర్‌లో చదవాలని చెప్పింది. సమాజంలో వృత్తివిద్య, విలువలు, నాణ్యత, ధర్మం, మెరుగైన జీవనవిధానం, ఫొటోగ్రఫీ, వీడియోతీసి సమకూర్చుకోవడం 32 పాఠ్యాంశాలు అందులో పొందుపరిచి ఉన్నాయి. అన్నావర్సిటీ పరిధిలోని కాలేజీ ఆఫ్‌ ఇంజినీరింగ్, స్కూల్‌ ఆఫ్‌ ఆర్కిటెక్టింగ్‌ అండ్‌ ప్లానింగ్, అళగప్ప కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్, క్రోంపేటలోని మద్రాసు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఈ నాలుగు కాలేజీల్లో ఫస్ట్‌ ఇయర్‌లోని విద్యార్థులు పాఠ్యాంశాలను ఆప్షన్‌గా ఎంపిక చేసుకున్నారు. ఇందులో వేదాంత పాఠ్యాంశంలో సంస్కృతం, భగవద్గీతకు సంబం ధించిన పాఠాలు చోటుచేసుకున్నాయి. వీటిని విద్యార్థులు తప్పనిసరిగా చదవాలని వర్సిటీ సూచించింది. ఈ రెండింటినీ ఇంజనీరింగ్‌ విద్యలో చేర్చడం చర్చనీయాంశమైంది. దీంతో వర్సిటీ కొన్ని సవరణలు చేసేందుకు సిద్ధమైంది. వేదాంత విభాగంలోని సంస్కృతం, భగవద్గీత పాఠ్యాంశాలపై నిర్బంధాన్ని సడలించి ఆప్షన్‌ విధానాన్ని ప్రవేశపెట్టాలని ఆలోచిస్తున్నట్లు వర్సిటీ వీసీ సూరప్ప తెలిపారు.

స్టాలిన్‌ ఖండన..
అన్నాయూనివర్సిటీ పాఠ్యాంశాల్లో సంస్కృతం, భగవద్గీతలను చేర్చి విద్యార్థులపై బలవంతంగా రద్దుతున్నారని డీఎంకే అధ్యక్షులు స్టాలిన్‌ ఆరోపించారు. అన్నావర్సిటీ సీఈజీ క్యాంపస్‌లో 2019 సంవత్సర పాఠ్యపుస్తకాల్లో వేదాంతపాఠాలను నిర్బంధంగా చేర్చడం పైగా దానికి ‘భారత్‌లో విదేశీస్థాయి ఆధ్యాత్మిక చదువులు’ అని పేరుపెట్టడాన్ని తన ట్విట్టర్‌ ద్వారా ఆయన ఖండించారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top