
సుప్రీంకు అయోధ్య మధ్యవర్తిత్వ కమిటీ నివేదిక
సాక్షి, న్యూఢిల్లీ : అయోధ్య కేసుకు సంబంధించి సర్వోన్నత న్యాయస్ధానం ఏర్పాటు చేసిన మధ్యవర్తిత్వ కమిటీ గురువారం సుప్రీం కోర్టుకు తన నివేదిక సమర్పించింది. ఈనెల 31 వరకూ మధ్యవర్తిత్వ ప్ర్రక్రియ కొనసాగనుండగా, ఆగస్ట్ 2 నుంచి అయోధ్య భూ వివాదంపై సుప్రీం కోర్టులో రోజువారీ విచారణ కొనసాగనుంది.
మధ్యవర్తుల కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాతే అయోధ్య రామ జన్మభూమి వివాదం విషయంలో విచారణ చేపడతామని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి గతంలో స్పష్టం చేశారు. ఈ వివాదంలో సమస్య పరిష్కారం కోసం నియమించిన మధ్యవర్తుల కమిటీ నివేదిక సమర్పించడానికి ఆగస్టు18 వరకు సమయం ఇచ్చారు. మధ్యవర్తుల కమిటీ జరిపిన చర్చల సారాంశాన్ని ఈ నెల 18నాటికి సుప్రీంకోర్టుకు సమర్పించాలని ఆదేశించారు. తదుపరి విచారణను ఈనెల 25కు వాయిదా వేస్తూ ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం అంతకుముందు ఉత్తర్వులు జారీ చేసింది.
మరోవైపు అయోధ్య వివాద పరిష్కారం మధ్యవర్తిత్వంతోనూ పరిష్కారమయ్యే సూచనలు కనిపించడం లేదని, వెంటనే ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని పరిష్కారం చూపాలంటూ దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. రామ జన్మభూమి– బాబ్రీ మసీదు వివాదంలో వాస్తవ కక్షిదారుల్లో ఒకరైన గోపాల్ సింగ్ విశారద్ ఈ మేరకు వేసిన పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ అనిరుద్ధ బోస్‌లతో కూడిన ధర్మాసనం స్వీకరించింది.