‘మావో అర్బన్‌’ విచ్ఛిన్నమే లక్ష్యంగా

Attack on Mao forces - Sakshi

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకే ఇటీవలి అరెస్టులు?

సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: మావోయిస్టు సానుభూతి పరులు, పౌర హక్కుల నేతల అరెస్టులు తీవ్ర వివాదమవడం తెల్సిందే. అయితే జనావాసాల్లో చురుగ్గా పనిచేస్తున్న మావోయిస్టు వ్యూహకర్తలు, వారి మద్దతుదారుల్ని గుర్తించి అరెస్టులు చేయాలని కేంద్ర హోం శాఖ నుంచి రాష్ట్రాల భద్రతా దళాలకు స్పష్టమైన ఆదేశాలు అందాయని సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. అజ్ఞాతంలో ఉన్న మావో దళాలపై దాడులతో సమాంతరంగా మావోయిస్టుల అర్బన్‌ నెట్‌వర్క్‌ను విచ్ఛిన్నం చేయడమే తాజా దాడుల లక్ష్యంగా భావిస్తున్నారు.

తాజాగా ఐబీ (ఇంటెలిజెన్స్‌ బ్యూరో) తన నివేదికలో.. నాన్‌ గవర్నమెంట్‌ గ్రూపులుగా పైకి కనిపించే మావోయిస్టు ఫ్రంట్‌ సంస్థలు పట్టణ ప్రాంతాల్లో చురుగ్గా పనిచేస్తున్నాయని, అజ్ఞాతంలోని తిరుగుబాటుదారులకు మద్దతుతో పాటు నాయకత్వం వహిస్తున్నాయని తెలిపింది. వారి వ్యూహాలకు అనుగుణంగా.. మావోయిస్టులు భద్రతా దళాలపై దాడులకు ప్రణాళికతో పాటు వ్యూహరచన చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో దాదాపు 300 మంది పట్టణ మావోయిస్టుల్ని అరెస్టు చేసినట్లు హోం శాఖ వర్గాల సమాచారం. అందువల్ల మావో వ్యూహకర్తలు, వారి మద్దతుదారులపై అన్ని వైపుల నుంచి దాడి చేయాలని భద్రతా బలగాలకు ఆదేశాలు అందాయి.

రాష్ట్ర బలగాలతో సన్నిహితంగా పనిచేయడంతో పాటు, అప్రమత్తంగా ఉండాలని సీఆర్‌పీఎఫ్‌ను కేంద్రం ఆదేశించింది. గ్రేహౌండ్స్‌తో సమాంతరంగా ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక చేస్తోందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసే ఈ దళం ఛత్తీస్‌గఢ్, బిహార్, జార్ఖండ్, ఒడిశాతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో మావోయిస్టుల్ని ఎదుర్కోనుంది. ఐబీ నివేదిక ప్రకారం పట్టణ మావోయిస్టులు ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చండీగఢ్, రాంచీ, హైదరాబాద్, నాగ్‌పూర్, మదురై, ఇతర ప్రాంతాల్లో విస్తరించినట్లు సమాచారం.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top