సీఎం చూస్తుండగానే వెక్కివెక్కి ఏడ్చిన నేత.. | As Akhilesh Yadav Watched, Candidate Was A Crying Mess | Sakshi
Sakshi News home page

సీఎం చూస్తుండగానే వెక్కివెక్కి ఏడ్చిన నేత..

Mar 2 2017 3:21 PM | Updated on Jul 11 2019 7:36 PM

సీఎం చూస్తుండగానే వెక్కివెక్కి ఏడ్చిన నేత.. - Sakshi

సీఎం చూస్తుండగానే వెక్కివెక్కి ఏడ్చిన నేత..

ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో ప్రచారాలు విభిన్నంగా దర్శనం ఇస్తున్నాయి. మునుపెన్నడూ లేని తీరుతో ప్రచార హోరు కొనసాగుతుండగా విచిత్ర, అనూహ్య దృశ్యాలకు తావిస్తున్నాయి.

లక్నో: ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో ప్రచారాలు విభిన్నంగా దర్శనం ఇస్తున్నాయి. మునుపెన్నడూ లేని తీరుతో ప్రచార హోరు కొనసాగుతుండగా విచిత్ర, అనూహ్య దృశ్యాలకు తావిస్తున్నాయి. ఒక్కో ఎమ్మెల్యే ఒక్కో శైలిలో ప్రచారంతో దూసుకుపోతున్నారు. ఏకంగా ఓటర్ల ముందూ బోరుమని ఏడుస్తున్నారు. తాము గతంలో తప్పు చేశామని, ఈ ఒక్కసారి క్షమించి అధికారం ఇవ్వాలంటూ తమ చెప్పులతో తమనే కొట్టుకుంటూ ఔరా అనిపిస్తున్నారు. తాజాగా ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ ముందే ఓ ఎస్పీ నేత వెక్కివెక్కి ఏడ్చాడు.

కారణం చెప్పకుండా మైకులో ప్రజలకు ధన్యవాదాలు చెబుతూనే మాట్లాడటం ఆపేసి మధ్యలో ఏడ్వడం మొదలుపెట్టాడు. అయితే, సొంతపార్టీలో తనకు అసమ్మతి ఎదురైన కారణంగా ఆయనకు చేస్తున్న అవమానాలు గుర్తొచ్చి ఏడ్చారని ఆయనతో ఉన్న ఇతర నేతలు చెప్పారు. ఏం జరిగిందంటే పీడీ తివారీ అనే వ్యక్తి సమాజ్‌వాది పార్టీ తరుపున బార్హాజ్‌ నియోజవర్గం నుంచి బరిలోకి దిగాడు. ఆరో దశలో భాగంగా శనివారం ఇక్కడ ఎన్నికలు జరగున్నాయి. అయితే, ఇక్కడికి ప్రచారానికి వచ్చిన మోదీ పీడీ తివారీ పోటీ చేసే స్థానం బీజేపీకే దక్కుతుందని ధీమా వ్యక్తం చేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత అక్కడికే ప్రచారానికి వచ్చిన అఖిలేశ్‌ యాదవ్‌ పీడీ తివారీకి భరోసా ఇచ్చారు. ప్రజలు తమ విశ్వాసాన్ని ఓటు ద్వారా తివారీకి అప్పగించాలని అన్నారు.

‘ ఈ ఎన్నికల్లో బీజేపీ సీట్లన్ని కొల్లగొడుతుందని చెప్పారు. బార్హాజ్‌ సీటును ఎలా కొల్లగొడతారో మనమూ చూద్దాం’ అంటూ వ్యాఖ్యానించారు. ఈ మాటలు అనగానే ప్రజల నుంచి పెద్ద ఎత్తున తివారీకి మద్దతుగా చప్పట్లు శబ్దాలు, ఈలలు వినిపించాయి. ఆయన అలా అన్న తర్వాత భావోద్వేగం ఆపుకోలేక అతడు వెక్కివెక్కి ఏడ్చాడు. అంతకుముందు సుజాత్‌ అలాం అనే వ్యక్తి తన చెప్పులతో తానే పదేపదే తలపై కొట్టుకొని ఈ ఒక్కసారి క్షమించండి అని ప్రజలకు విజ్ఞప్తి చేసుకున్న విషయం తెలిసింది.

Advertisement
 
Advertisement
Advertisement