మళ్లీ గొంతెత్తిన అన్నా | Sakshi
Sakshi News home page

మళ్లీ గొంతెత్తిన అన్నా

Published Wed, Aug 30 2017 4:54 PM

మళ్లీ గొంతెత్తిన అన్నా - Sakshi

న్యూఢిల్లీః అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటినా లోక్‌పాల్‌ నియామకంలో జాప్యం పట్ల మోడీ సర్కార్‌పై సామాజిక కార్యకర్త అన్నా హజారే మండిపడ్డారు. లోక్‌పాల్‌ నియామకంతో పాటు ప్రతి రాష్ట్రంలో లోకాయుక్త, అవినీతిని అంతమొందించేందుకు సిటిజన్స్‌ చార్టర్‌ను తక్షణమే ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. తన డిమాండ్లపై సత్వరం స్పందించకుంటే మరో ఆందోళన తప్పదని ప్రధానికి రాసిన లేఖలో హెచ్చరించారు. ఆరేళ్ల కిందట 2011లో తాను చేపట్టిన అవినీతి వ్యతిరేక​ భారత్‌ ఉద్యమ స్ఫూర్తిని ఈ సందర్భంగా హజారే ప్రస్తావించారు. అవినీతికి వ్యతిరేకిస్తూ చారిత్రక ఉద్యమం జరిగి ఆరేళ్లయినా అవినీతిని తుడిచివేసేందుకు నిర్థిష్ట చట్టాన్నిప్రభుత్వం రూపొందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
 
గత మూడేళ్లుగా లోక్‌పాల్‌, లోకాయుక్తల నియామకం, రైతుల సంక్షేమానికి సంబంధించి స్వామినాథన్‌ సిఫార్సుల అమలుపై తాను పలుమార్లు ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నా తన లేఖలను విస్మరిస్తూ ఎలాంటి చర్యలూ చేపట్టడం లేదని ప్రధానికి రాసిన లేఖలో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement