అమెజాన్‌ ‘ఎకో ఫ్రేమ్స్‌’పై ఆందోళన

Amazon Echo Frames - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: అమెజాన్‌ కంపెనీ రెండు రోజుల క్రితం ‘ఎకో ఫ్రేమ్స్‌’ పేరిట మార్కెట్‌లోకి విడుదల చేసిన అలెక్సా స్మార్ట్‌ గ్లాసెస్‌ పట్ల వినియోగదారుల నుంచి ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ గ్లాసెస్‌ ధరించిన వారు ఇతరులతో మాట్లాడే ప్రతిమాటను కళ్లజోడుకున్న రెండు మైక్రో ఫోన్లు రిసీఫ్‌ చేసుకొని అమెజాన్‌ కంపెనీ కార్యాయలంలోని టేపుల్లో రికార్డు చేసే అవకాశం ఉండడమే వారి ఆందోళన కారణం. తద్వారా తమ ప్రైవసీ దెబ్బతింటుందన్నది వారి వాదన. ఇంతకు ముందు అమెజాన్‌ కంపెనీ మార్కెట్‌లోకి విడుదల చేసి ‘అలెక్సా ఎకో స్పీకర్‌’ విషయంలోనూ ఇలాంటి ఫిర్యాదులే వచ్చాయి. అమెరికాలో ఓ జంట తమ పడక గది ముచ్చట్లను కూడా అలెక్సా స్పీకర్‌ రికార్డు చేసిందని ఆరోపిస్తూ కోర్టుకు కూడా ఎక్కారు. 

మాటలను గుర్తించే సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అలెక్సా ఎకో స్పీకర్‌ను తయారు చేశారు. ఈ స్పీకర్‌కు ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఇస్తే మన మాటల ద్వారా అది స్పందిస్తుంది. అంటే, మనకు కావాల్సిన పాటలు, వార్తలు లేదా జోకులు వినిపించమని నోటి ద్వారా కోరితే అలెక్సా యాప్‌ స్పందించి ఇంటర్నెట్‌ నుంచి వాటిని సేకరించి దానికి అనుసంధానించిన స్పీకర్‌ ద్వారా వినిపిస్తుంది. మన కమాండ్‌ను రిసీవ్‌ చేసుకుంటోంది కనుక అది మాటలను, ముచ్చట్లను కూడా వినే అవకాశం ఉంటుంది. మనం కమాండ్‌ ఇచ్చినప్పుడు మాత్రమే స్పందించి మిగతా సమయాల్లో అదంతట అదే ఆఫ్‌ అయ్యే పద్ధతి ఉండాలి. అది లేదు. అలాంటప్పుడు మన మాటలను, ముచ్చట్లను కంపెనీ టేపుల్లో రికార్డు చేసే అవకాశం ఉండకూడదు.

అలెక్సా అంటే, మన మాటలను స్వీకరించి అందుకు అనుగుణంగా స్పందించే సాంకేతిక పరిజ్ఞానం ఇంకా సంపూర్ణంగా అభివద్ధి జరగలేదన్న కారణంగా, భవిష్యత్తు అభివద్ధి కోసం మనం మాట్లాడే మాటలను రికార్డు చేసే పద్ధతిని కంపెనీ యాజమాన్యాలు ప్రవేశ పెట్టాయి. ఒక్కొక్కరి మాట ఒక తీరు ఉంటుంది. కొన్ని ప్రాంతాల భాష, యాస తేడాగా ఉంటుంది. అన్ని తేడాలను గుర్తించి స్పందించే విధంగా ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివద్ధి చేయాలన్న సంకల్పంతోనే తాము ఈ రికార్డులను ఉద్దేశపూర్వకంగా అనుమతిస్తున్నామని, తాము ఎవరు ఏం మాట్లాడారో బయట పెట్టం కనుక, వినియోగదారుల ప్రైవసీకి వచ్చిన నష్టం ఏమీ లేదని ఈ సాంకేతిక పరిజ్ఞానం కలిగిన కంపెనీలు వాదిస్తున్నాయి. ఈ కంపెనీలు టెక్నాలజీ అభివద్ధి కోసం ఈ మాటల టేపులను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగిస్తున్నందున ఆ ఏజెన్సీలు అమ్ముకునే అవకాశం ఉందని, తద్వారా తమ ప్రైవసి దెబ్బతింటుందని వినియోగదారులు వాపోతున్నారు. 

ఏదీ ఏమైన అలెక్సా ఎకో స్పీకర్‌ తరహాలో పనిచేసే అమెజాన్‌ ‘ఎకో ఫ్రేమ్స్‌’ను విడుదల చేసింది. ఆ ఫ్రేముల్లో మన కళ్లకు సరిపడే అద్దాలను బిగించుకోవచ్చు. కళ్లజోడుకు ఇరువైపుల ఉండే రెండు మైక్రోఫోన్లతో ఇంటర్నెట్‌ ద్వారా మనం కోరుకున్న పాటలను, వార్తలను, జోకులను వినవచ్చు. అంతే కాకుండా జేబులో నుంచి ఫోన్‌ తీయాల్సిన అవసరం లేకుండా నోటి ద్వారా మిత్రులకు, బంధువులకు కనెక్షన్‌ కలుపుమని అలెక్సాను అడిగి నేరుగా మాట్లాడవచ్చు. ఇంటర్నెట్‌ సౌకర్యం కోసం ఓ స్మార్ట్‌ ఫోన్‌ మాత్రం ఉండాల్సిందే. (చదవండి: అమెజాన్‌ నుంచి ‘అలెక్సా’ ఇయర్‌ బడ్స్‌)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top