నిత్యావసర వస్తువుల ధరల పరిస్థితిపై కేంద్ర కేబినెట్ కార్యదర్శి అజిత్ సేథ్ శనివారం వివిధ శాఖల కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు.
న్యూఢిల్లీ: నిత్యావసర వస్తువుల ధరల పరిస్థితిపై కేంద్ర కేబినెట్ కార్యదర్శి అజిత్ సేథ్ శనివారం వివిధ శాఖల కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా ప్రవేశించనున్నందున ఆ ప్రభావం ద్రవ్యోల్బణంపై ఏ విధంగా ఉంటుందనే అంశంపై ఆయన సమీక్షించారు. కాయగూరలు, పళ్లు, పాలు తదితర నిత్యావసరాల ధరలు భారీగా పెరగడంతో ఏప్రిల్ మాసాంతానికి రిటైల్ ద్రవ్యోల్బణం 8.59 శాతంగా నమోదైన సంగతి తెలిసిందే.
ద్రవ్యోల్బణం మూడు నెలల గరిష్ట స్థాయికి చేరిన నేపథ్యంలో కేబినెట్ కార్యదర్శి ఈ భేటీ నిర్వహించారు. ఈ సమీక్షకు వాణిజ్య, పారిశ్రామిక, వ్యవసాయ, ఆర్థిక మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ధరల నియంత్రణకు కొత్త ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని ఈ సందర్భంగా సేథ్ అధికారులకు వివరించినట్టు తెలిసింది. బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోలోనూ ధరల పెరుగుదలను నియంత్రిస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.