నాటకీయ పరిణామాల మధ్య ఇంట్లోకి అనుమతి

Aishwarya Allowed to Enter Rabri Devi House - Sakshi

పట్నా: నాటకీయ పరిణామాల మధ్య బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కోడలు ఐశ్వర్య రాయ్‌ను ఇంటిలోనికి అనుమతించారు. కోడలి నిరసనతో రబ్రీ దేవి దిగివచ్చారు. వివాహమైన కొద్ది నెలలకే తేజ్‌ ప్రతాప్‌ విడాకులు కోరుతూ.. కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అంతేకాక భార్యతో విడాకులు ఇప్పిస్తేనే ఇంటికి వస్తానంటూ.. వేరుగా ఉంటున్నాడు. ఈ క్రమంలో తన భర్త డ్రగ్స్‌కు బానిసయ్యాడని ఆరోపించిన ఐశ్యర్య మొదటి సారి అత్తింటివారు తనను వేధిస్తున్నారని ఆరోపించారు. అత్త రబ్రీ దేవి, ఆడపడుచు మీసా భారతి తనకు ఆహారం కూడా పెట్టకుండా వేధించడమే కాక ఇంట్లో నుంచి గెంటేశారని తెలిపారు.

ఈ క్రమంలో తనకు న్యాయం చేయాల్సిందిగా అత్తింటి బయట కూర్చుని నిరసన తెలిపారు ఐశ్వర్య. ఆమె తండ్రి చంద్రికా రాయ్‌ కూడా ఐశ్వర్యతో పాటు కూర్చుని.. తమ కుమార్తెకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. వీరికి మద్దతుగా మరికొందరు కలిసి రబ్రీ దేవి ఇంటి ముందు ధర్నాకు దిగారు. లాలూ, రబ్రీ దేవిలకు వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశారు. దాంతో రంగంలోకి దిగిన డీజీపీ గుప్తేశ్వర్‌ పాండే వివాదాన్ని పరిష్కరించడంతో సోమవారం మధ్యాహ్నం ఐశ్వర్యను ఇంట్లోకి అనుమతించారు.

రబ్రీ దేవి, మీసా భారతి తనను వేధిస్తున్నారని.. తిండి కూడా పెట్టడం లేదని ఐశ్వర్య ఆరోపించిన సంగతి తెలిసిందే. మీసా భారతి మూలంగానే తనకు, తన భర్తకు మధ్య గొడవలు ప్రారంభమయ్యాయని ఐశ్వర్య ఆరోపించారు. రబ్రీదేవి సమక్షంలోనే మీసా భారతి తనను ఇంటి నుంచి గెంటేశారని వాపోయిన సంగతి తెలిసిందే.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top