కొత్త ముఖం కోసం కాంగ్రెస్‌ కసరత్తు!

కొత్త ముఖం కోసం కాంగ్రెస్‌ కసరత్తు!


మహాకూటమిలో నితీశ్‌ స్థానంలో మమత

మమతా బెనర్జీతో అహ్మద్‌ పటేల్‌ కీలక చర్చలు

తమ పార్టీని చీల్చే కుట్ర అన్న జేడీ(యూ)




న్యూఢిల్లీ: బిహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ బీజేపీతో చేతులు కలపడం, తమిళనాలోని అధికార పార్టీ అన్నాడీఎంకే.. మోదీ ప్రభుత్వానికి చేరువవుతున్న నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు ఈ రోజు సాయంత్రం 4 గంటలకు పార్లమెంట్‌లో సమావేశం కానున్నాయి. జాతీయ స్థాయిలో విపక్షాలను ఒకతాటిపైకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ భేటీ జరగనుంది. ఉత్కంఠభరితంగా జరిగిన గుజరాత్‌ రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీని దీటుగా ఎదుర్కొని విజయం సాధించిన సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్‌ పటేల్‌ ఈ సమావేశానికి తెర వెనుక మంత్రాంగం నడిపిస్తున్నారు. విపక్ష నేతలందరినీ ఈ భేటీకి తీసుకొచ్చే బాధ్యతను నెత్తినవేసుకున్నారు.



ఇందులో భాగంగా పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీతో గురువారం రాత్రి అహ్మద్‌ పటేల్‌ భేటీ అయ్యారు. ఆమెతో 20 నిమిషాల పాటు చర్చలు జరిపారు. ఈ రోజు జరగనున్న సమావేశం అజెండా గురించి చెప్పడంతో పాటు, మమత ప్రధాన పాత్ర పోషించాలన్న విషయాన్ని పటేల్‌ గట్టిగా చెప్పినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. మహాకూటమి నుంచి నితీశ్ కుమార్‌ తప్పుకోవడంతో జాతీయ స్థాయిలో మమతా బెనర్జీ క్రియాశీలక పాత్ర పోషించాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. రాహుల్‌ గాంధీ కూడా ఆమెను మహాకూటమి తరపున ప్రధాన ప్రచారాస్త్రంగా ఉపయోగించుకోవాలన్న ఆలోచనలో ఉన్నారు. సొంత పార్టీలోనే సమస్యలతో సతమతమవుతుండటంతో మాయావతి పేరు పరిశీలనకు రాలేదన్న ప్రచారం జరుగుతోంది.



ఈ నేపథ్యంలో మమత బెనర్జీని మహాకూటమిలో క్రియశీలకపాత్ర పోషించాలని అహ్మద్‌ పటేల్‌ కోరినట్టు తెలుస్తోంది. అయితే మర్యాదపూర్వకంగానే మమత బెనర్జీని కలిసినట్టు పటేల్‌ తెలిపారు. 'ఫైర్‌ బ్రాండ్‌'గా ముద్రపడిన మమత మహాకూటమికి ముఖ్యనేతగా మారాతారా, లేదా అనేదానిపై ఈ రోజు సమావేశంలో స్పష్టత రానుంది. కాగా, ఈ రోజు జరగనున్న సమావేశానికి తమ పార్టీని ఆహ్వానించి చీల్చేందుకు సోనియా గాంధీ ప్రయత్నిస్తున్నారని జేడీ(యూ) నేత కేసీ త్యాగి వ్యాఖ్యానించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top