మంత్రి కంట్లో నల్లసిరా | Agitators throw ink at Maharashtra cooperation minister Harshavardhan Patil | Sakshi
Sakshi News home page

మంత్రి కంట్లో నల్లసిరా

Aug 8 2014 10:33 PM | Updated on Oct 8 2018 5:45 PM

రాష్ట్రంలో ధన్‌గర్‌ల ఆందోళన రోజురోజుకు తీవ్రమవుతోంది. ధన్‌గర్‌లు శుక్రవారం చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది.

సాక్షి, ముంబై: రాష్ట్రంలో ధన్‌గర్‌ల ఆందోళన రోజురోజుకు తీవ్రమవుతోంది. ధన్‌గర్‌లు శుక్రవారం చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. రాష్ట్ర సహకారశాఖ మంత్రి హర్షవర్ధన్ పాటిల్ కంట్లో ఓ ఆందోళనకారుడు నల్లసిరా పోయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పుణే జిల్లా, ఇంద్రాపూర్‌లోని భిగవణ్‌లో జరిగిన ఈ ఘటన వివరాల్లోకెళ్తే... తమను షెడ్యూల్డ్ ట్రైబల్స్(ఎస్టీ) జాబితాలో చేర్చాలంటూ కొన్నిరోజులుగా ధన్‌గర్‌లు రకరకాల రూపాల్లో తమ డిమాండ్‌ను వ్యక్తం చేస్తున్నారు.

 ఇదిలాఉండగా పుణేలోని ఇంద్రాపూర్ తాలూకా, భిగవణ్ గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రి హర్షవర్ధన్ పాటిల్ వచ్చిన విషయాన్ని తెలుసుకున్న ధన్‌గర్ సామాజికవర్గానికి చెందిన కొందరు అక్కడకు చేరుకున్నారు. కార్యక్రమం ముగిసేంతవరకు వేచి చూసి, తిరిగి వస్తుండగా ఆయన కారును చుట్టుముట్టారు. తమను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు చొరవ చూపాలంటూ నినాదాలు చేశారు.

 వారితో మంత్రి మాట్లాడుతుండగానే ఓ వ్యక్తి మంత్రి ముఖంపై నల్లసిరా పోశాడు. ఒక్కసారిగా సిరా గుమ్మరించడంతో అది మంత్రి కంట్లో పడింది. దీంతో మంత్రి కంటికి గాయమైంది. సిరాలో యాసిడ్ ఉంటుందని, ఫలితంగానే ఇబ్బంది కలిగి ఉండవచ్చని స్థానిక వైద్యుడొకరు తెలిపారు. వెంటనే అప్రమత్తమైన కాంగ్రెస్ కార్యకర్తలు మంత్రిని అక్కడ నుంచి పంపేశారు.

 ఇరువర్గాల వాగ్వాదం..
 తమ పార్టీకి చెందిన మంత్రిపై సిరా పోయడంతో ఒక్కసారిగా ఆగ్రహోదగ్రులైన కాంగ్రెస్ కార్యకర్తలు, మంత్రి అనుచరులు ఆందోళనకారులపై విరుచుకుపడ్డారు. ఓ సందర్భంలో ఇరువర్గాలు కొట్టుకున్నారు కూడా. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను శాంతింపజేశారు. ఆ తర్వాత కూడా ఇరువర్గాల మధ్య వాగ్వాదాలు కొనసాగాయి.

 భిగవణ్ బంద్‌కు కాంగ్రెస్ పిలుపు...
 మంత్రి కంట్లో సిరా పోయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు ఇంద్రాపూర్, భిగ్‌వణ్ బంద్‌కు పిలుపునిచ్చారు. అనంతరం పుణే-ఇంద్రాపూర్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. రోడ్డుపైనే భైటాయించి నినాదాలు చేశారు. దీంతో ఈ ర హదారిపై దాదాపు కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. చివరకు పోలీసులు కలుగజేసుకోవడంతో కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement