ఇప్పటివరకూ మనం కి‘లేడీ’లు చేసే చిన్నచిన్న దొంగతనాలను చూసే ఉంటాం. ఇందుకు పూర్తి భిన్నంగా దేశంలోనే దాదాపు తొలిసారిగా 13 మంది మహిళలతో కూడిన దొంగల ముఠా హస్తినలో హల్‌చల్ చేసింది.
ప్రింటింగ్ ప్రెస్‌లోకి చొరబడి 5 లక్షల సొత్తు చోరీ
ఘజియాబాద్: ఇప్పటివరకూ మనం కి‘లేడీ’లు చేసే చిన్నచిన్న దొంగతనాలను చూసే ఉంటాం. ఇందుకు పూర్తి భిన్నంగా దేశంలోనే దాదాపు తొలిసారిగా 13 మంది మహిళలతో కూడిన దొంగల ముఠా హస్తినలో హల్‌చల్ చేసింది. మగ దొంగలకు ఏమాత్రం తీసిపోని రీతిలో పక్కా ‘వృత్తి నైపుణ్యం’ ప్రదర్శిస్తూ రూ. ఐదు లక్షల విలువైన సొత్తును ఎత్తుకెళ్లింది. ఢిల్లీ శివార్లలోని ఘజియాబాద్‌లో ఉన్న ఓ ప్రింటింగ్ ప్రెస్‌లో 15 రోజుల కిందట తెల్లవారుజామున జరిగిన ఈ ఘరానా చోరీ ఆలస్యంగా వెలుగు చూసింది. ముఖానికి చున్నీలు చుట్టుకొని...12 అడుగుల ఎత్తున్న గోడ దూకి ప్రింటింగ్ ప్రెస్ ఆవరణలోకి ప్రవేశించిన ఆడ దొంగల ముఠా... ప్రధాన ద్వారం తాళాలు పగలగొట్టి లోనికి ప్రవేశించింది.
టార్చిలైట్లు వేసుకొని కాసేపు ప్రెస్‌లో కలియతిరిగి చివరగా తమకు కనిపించిన రూ. ఐదు లక్షల విలువైన 500 అల్యూమినియం ప్లేట్లను వెంట తెచ్చుకున్న ప్లాస్టిక్ బుట్టల్లో పెట్టుకొని ఉడాయించింది. పరారయ్యే ముందు సీసీటీవీలు ఉన్నట్లు గుర్తించి వాటిని ముఠా పగలగొట్టింది. మొత్తం ‘ఆపరేషన్’ను 14 నిమిషాల్లో కానిచ్చేసింది. ప్రెస్ ద్వారం తాళాలు పగలగొట్టి ఉండటంతో మర్నాడు లోనికి వెళ్లి చూసిన యజమాని వినీత్ త్యాగి దొంగలు ఎవరో చూసేందుకు సీసీటీవీ రికార్డులను పరిశీలించారు. ముఠాలో అందరూ ఆడ దొంగలు ఉండటం చూసి అవాక్కయ్యారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.