అవన్నీ తప్పుడు రిపోర్ట్స్‌; వారికి కరోనా‌ సోకలేదు

5 Air India Pilots Test Negative For Coronavirus After Retests - Sakshi

ఢిల్లీ : ఎయిర్‌ ఇండియాకు చెందిన ఐదుగురు పైలట్లకు కరోనా సోకిందన్న వార్తల్లో నిజం లేదని ఎయిర్‌ ఇండియా అధికారులు  పేర్కొన్నారు. మొదట చేసిన పరీక్షల్లో పాజిటివ్‌ వచ్చిందని,అయితే మరోసారి పరీక్షలు నిర్వహించగా నెగిటివ్‌గా నిర్థారణ అయిందని పేర్కొన్నారు. మొదట వచ్చినవి తప్పుడు రిపోర్టులని అధికారులు తేల్చి చెప్పడంతో సదరు పైలట్లు ఊపిరి పీల్చుకున్నారు. వివరాలు.. ఎయిర్‌ఇండియాకు చెందిన ఐదుగురు పైలట్లకు ఆదివారం నిర్వహించిన కరోనా పరీక్షల్లో పాజిటివ్‌ అని తేలడంతో అధికారుల్లో ఆందోళన నెలకొంది. దీంతో వారందరిని క్వారంటైన్‌లో ఉంచారు. అయితే సోమవారం వారికి  మరోసారి పరీక్షలు నిర్వహించగా నెగిటివ్‌ అని తేలింది. ఒక్కరోజులోనే ఇంత తేడా ఎలా చూపింస్తుందని అధికారుల్లో అనుమానం వ్యక్తమయింది.
(కరోనా : వైద్యుడి సాహసంపై ప్రశంసల జల్లు)

దీంతో మొదట పరీక్షలు నిర్వహించిన కిట్‌ను పరిశీలించగా ఆ కిట్‌ పాడైపోయిందని తెలిసింది. ఇదే విషయమై అధికారులు స్పందిస్తూ..  ఆ ఐదుగురి​కి కరోనా పాజిటివ్‌  వచ్చిందన్న వార్తల్లో నిజం లేదని. మొదట చేసిన పరీక్షల్లో పాజిటివ్‌ రావడం వెనుక తప్పుడు రిపోర్టులతో పాటు కిట్‌ సరిగా లేకపోవడం ఒక కారణమని వివరించారు. ఈ విషయం తెలుసుకున్న పైలట్లు తమకు కరోనా లేదని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. 'ఇది నిజంగా అదృష్టమనే చెప్పాలి. మాకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని మొదట తెలియగానే చాలా భయపడ్డాము. మా ద్వారా ఇంకా ఎంతమందికి సో​కుతుందేమోనని చాలానే భయపడ్డాం. కానీ మాకు పరీక్షలు నిర్వహించింది పాల్టీ కిట్‌తో అని తెలుసుకున్నాం' అంటూ ఒక పైలట్‌ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. అయితే వీరితో పాటు ఉన్న ఇంజనీర్‌, టెక్నిషియన్‌కు కూడా ఆదివారం కరోనా పాజిటివ్‌ అని తేలింది.సోమవారం  వీరికి కూడా పరీక్షలు నిర్వహించగా, వారి రిపోర్ట్స్‌ ఇంకా రావాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top