చివర్లోనే జస్టిస్‌ జోసెఫ్‌ పేరు

3 judges including Justice KM Joseph sworn in as judges of SC - Sakshi

సుప్రీంకోర్టు కొత్త జడ్జీలుగా ముగ్గురి ప్రమాణం

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు జడ్జీలుగా జస్టిస్‌ కేఎం జోసెఫ్, జస్టిస్‌ ఇందిరా బెనర్జీ, జస్టిస్‌ వినీత్‌ సరన్‌లు మంగళవారం ప్రమాణం చేశారు. వీరి చేత సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్‌ మిశ్రా ఉదయం కోర్టురూమ్‌లో ప్రమాణంచేయించారు. జస్టిస్‌ జోసెఫ్‌ సీనియారిటీని కేంద్రం తగ్గించడాన్ని సుప్రీంకోర్టు జడ్జీలు నిరసించినప్పటికీ కేంద్రం ఇచ్చిన వరుస క్రమంలోనే ముగ్గురు జడ్జీల ప్రమాణస్వీకార వేడుక పూర్తయింది. తొలుత జస్టిస్‌ ఇందిర, తర్వాత జస్టిస్‌ వినీత్, చివర్లో జస్టిస్‌ జోసెఫ్‌ ప్రమాణం చేశారు.

ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు ఇతర జడ్జీలు, లాయర్లు, తదితరులు హాజరయ్యారు. సుప్రీంకోర్టు జడ్జి పదవికి జస్టిస్‌ జోసెఫ్‌ పేరును.. జస్టిస్‌ ఇందిర, జస్టిస్‌ వినీత్‌ల పేర్లకంటే కొన్ని నెలల ముందుగానే కొలీజియం సిఫారసు చేసింది. అయినా జస్టిస్‌ జోసెఫ్‌ పేరును ఈ ముగ్గురి పేర్ల వరసలో కేంద్రం చివరన చేర్చడం వివాదమైంది. దీనిపై పలువురు సుప్రీంకోర్టు జడ్జీలు సోమవారమే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రాను కలిసి తమ ఆందోళనను తెలియజేశారు. కాగా, సుప్రీంకోర్టులో ఉండాల్సిన మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 31 అయినప్పటికీ, మంగళవారం కొత్తగా ముగ్గురు జడ్జీలు నియమితులయ్యాక కోర్టులోని జడ్జీల సంఖ్య 25 మాత్రమే.  

చరిత్రలో తొలిసారి..
మద్రాస్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ ఇందిరా బెనర్జీ మంగళవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణం చేయడంతో ఓ రికార్డు నమోదైంది. సుప్రీంకోర్టుకు ఇందిర రాకతో ప్రస్తుతం సుప్రీంకోర్టులోమహిళా జడ్జీల సంఖ్య మూడుకు పెరిగింది. చరిత్రలో ఎన్నడూ సుప్రీంకోర్టులో ఒకేసారి ముగ్గురు మహిళాజడ్జీలు లేరు.

అలాగే స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు జడ్జిగా నియమితురాలైన ఎనిమిదో మహిళ జస్టిస్‌ ఇందిర. 2002లో కలకత్తా హైకోర్టు జడ్జిగా నియమితురాలైన జస్టిస్‌ ఇందిరా బెనర్జీ.. 2017 ఏప్రిల్‌లో మద్రాస్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉన్న ముగ్గురు మహిళా న్యాయమూర్తుల్లో జస్టిస్‌ ఆర్‌ భానుమతి అత్యంత సీనియర్‌. ఆమె 2014 ఆగస్టు నుంచి సుప్రీంకోర్టులో జడ్జిగా ఉన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top