ఈ పాము రూటే సపరేటు!

3 Foot Small Snake Catches Big Snake In Odisha - Sakshi

భువనేశ్వర్‌ : పెద్ద పాముకు ఆకలేసినపుడు చిన్న పాముల్ని వేటాడటం కామన్‌.. కానీ చిన్న పాము పెద్ద పామును వేటాడితే.. ఇదే డిఫరెంట్‌. ఒడిశాలో జరిగిన ఘటన ఎంత డిఫరెంటంటే చిన్న పాము ఓ పెద్ద పామును పట్టిన పట్టుకు పెద్ద పాము విలవిలలాడిపోయింది. చావు నుంచి తప్పించుకోవటానికి శతవిధాల ప్రయత్నించింది. వివరాలలోకి వెళితే.. ఒడిసా రాష్ట్రంలోని కోరపుత్‌ జిల్లా సునబేదా పట్టణంలోని ఓ ఇంటి ఆవరణంలో పాములు ఉన్నట్లు జంతు సంరక్షణా సిబ్బందికి సమాచారం అందింది. ఇంటి ఆవరణలోకి చేరుకున్న సిబ్బంది అక్కడి దృశ్యాలను చూసి ఆశ్చర్యానికి గురైయ్యారు. 3 అడుగుల పాము తన కంటే పరిమాణంలో రెండు రెట్లు పెద్దదైన రాట్‌ స్నేక్‌ను గట్టిగా పట్టుకుంది.

అంత పెద్ద పాము ఆ పట్టు నుంచి తప్పించుకోవటానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.. గిలగిలలాడింది. చివరకు జంతు సంరక్షణా సిబ్బంది రెండింటిని వేరుచేయటంతో చావు తప్పి బయటపడింది. జంతు సంరక్షణా సిబ్బంది మాట్లాడుతూ.. మామూలుగా అయితే పెద్ద పాములు చిన్న పామును చూడగానే తినటానికి ప్రయత్నిస్తాయని అన్నారు. కానీ ఇలా చిన్న పాము పెద్ద పామును పట్టి తినాలనుకోవటం చాలా అరుదని తెలిపారు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఎంటంటే ఆ రెండు పాములు విషపూరితమైనవి కాకపోవటం. ఈ సంఘటనకు సంబంధించిన కొన్ని వీడియోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top