యూపీలో అత్యాచారాలు జరుగుతూ ఉంటాయి | '21 crore people in UP, yet lowest number of rapes': Mulayam Singh Yadav's shocker | Sakshi
Sakshi News home page

యూపీలో అత్యాచారాలు జరుగుతూ ఉంటాయి

Jul 20 2014 1:34 AM | Updated on Jul 28 2018 8:51 PM

యూపీలో అత్యాచారాలు జరుగుతూ ఉంటాయి - Sakshi

యూపీలో అత్యాచారాలు జరుగుతూ ఉంటాయి

ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై జరుగుతున్న వరుస అత్యాచారాలపై సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ ములాయంసింగ్ యాదవ్ శనివారం మరోసారి తనదైన శైలిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

వాటిని మీడియా సంచలనం చేయొద్దు: ములాయం
జనాభాపరంగా చూస్తే యూపీలోనే తక్కువ కేసులు
అలాంటి వాటిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది
 ఎస్‌పీ చీఫ్ వ్యాఖ్యలపై ధ్వజమెత్తిన ప్రతిపక్షాలు

 
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై జరుగుతున్న వరుస అత్యాచారాలపై సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ శనివారం మరోసారి తనదైన శైలిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యూపీ లాంటి పెద్ద రాష్ట్రాల్లో రేప్‌లాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయని, అలాంటి వాటికి మీడియా ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి సంచలనాత్మకం చేయకూడదని చెప్పారు. అసలు జనాభా పరంగా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే, 21 కోట్ల మంది ఉన్నా తమ రాష్ట్రంలోనే రేప్ కేసులు తక్కువగా నమోదవుతున్నాయన్నారు. అలాంటి కేసులపై రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందంటూ తన కుమారుడి నేతృత్వంలోని ప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశారు. దుండగులు ఘోరంగా నరికి చంపిన ఒక యువతి మృతదేహం లక్నో పట్టణ సరిహద్దుల్లో గురువారం లభ్యమైన విషయం తెలిసిందే. ఆమెపై అత్యాచారం చేసి ఆపై కిరాతకంగా హత్య చేసుంటారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రభుత్వం చర్యలపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు ములాయం పైవిధంగా స్పందించారు. ఇంతకుముందు కూడా ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. ఒకసారి.. ‘‘మీపని మీరు చేసుకోండి, మా పని మేము చేస్తాం’’ అని మీడియాను ఉద్దేశించి అన్నారు. మరోసారి యువకులు ‘‘తప్పులు చేస్తారు, అలాగని వారికి ఉరిశిక్ష వేస్తామా?’’ అని ప్రశ్నించారు.

మండిపడ్డ ప్రతిపక్షాలు..ములాయం తాజా వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ మాట్లాడుతూ.. ములాయం లాంటి ప్రముఖ వ్యక్తి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టమన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి బాగా లేదని, మహిళలు, బాలలపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించాలని అఖిలేశ్ సర్కార్‌కు సూచించారు. మరో బీజేపీ నేత విజయ్ పాఠక్ మాట్లాడుతూ.. జాతీయ గణాంకాలు చూస్తే యూపీలోనే రేప్, వరకట్న మృతి కేసులు ఎక్కువన్నారు. ములాయం వ్యాఖ్యలు బాధ్యతారహితమని బీఎస్‌పీ విమర్శించింది. కాంగ్రెస్ నేత రషీద్ అల్వీ స్పందిస్తూ.. రాష్ట్రంలో ఇలాంటి కేసు ఒక్కటి నమోదైనా అది ఆ రాష్ట్రానికి అవమానమేనన్నారు. మహిళల జాతీయ కమిషన్ సభ్యురాలు రషీద్ షమీమ్ మాట్లాడుతూ.. పేపర్లు చూస్తే ఆ రాష్ట్రంలో రోజుకు ఎన్ని రేప్‌లు జరుగుతున్నాయో తెలుస్తుందన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement