ఎన్‌కౌంటర్‌: 20 మంది మావోయిస్టులు మృతి! | 20 maoists killed in encounter | Sakshi
Sakshi News home page

ఎన్‌కౌంటర్‌: 20 మంది మావోయిస్టులు మృతి!

May 17 2017 3:07 AM | Updated on Oct 9 2018 2:53 PM

ఎన్‌కౌంటర్‌: 20 మంది మావోయిస్టులు మృతి! - Sakshi

ఎన్‌కౌంటర్‌: 20 మంది మావోయిస్టులు మృతి!

బీజాపూర్‌ జిల్లా రాయగడలో మంగళవారం సాయంత్రం భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది.

► బీజాపూర్‌ జిల్లా రాయిగూడెం అడవుల్లో కాల్పులు
► బుర్కన్‌పాల్‌ ఘటనకు ప్రతీకారం!
► కూంబింగ్‌ కొనసాగుతోంది: సీఆర్‌పీఎఫ్‌ ఐజీ


రాయ్‌పూర్‌/చర్ల/చింతూరు: ఛత్తీస్‌గఢ్‌లో ఇటీవల సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై పంజా విసిరిన మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బీజాపూర్‌ జిల్లాలో మంగళవారం మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన హోరాహోరీ ఎదురు కాల్పుల్లో 20 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే మంగళవారం రాత్రి వరకు ఒక్క మృతదేహం కూడా లభించలేదు. మృతదేహాలను మావోయిస్టులు తీసుకెళ్లారని పోలీసులు చెబుతున్నారు. గత నెల 24న సుక్మా జిల్లా బుర్కన్‌పాల్‌లో మావోయిస్టులు 25 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లను చంపేసిన నేపథ్యంలో సీఆర్‌పీఫ్‌ జవాన్లు, రాష్ట్ర పోలీసులు గాలింపును ముమ్మరం చేశారు. బీజాపూర్‌ జిల్లా బాసగూడ ఠాణా పరిధిలోని రాయిగూడెం అటవీ ప్రాంతంలో కూంబింగ్‌కు వెళ్లిన భద్రతా బలగాలకు మంగళవారం ఉదయం మావోయిస్టులు తారసపడటంతో ఇరుపక్షాల మధ్య కాల్పులు జరిగాయని పోలీసు అధికారులు చెప్పారు.

కాల్పుల్లో 20 మంది మావోయిస్టులు చనిపోయారని, కూంబింగ్‌ ఇంకా కొనసాగుతోందని సీఆర్‌పీఎఫ్‌ ఐజీ దేవేంద్ర చౌహాన్‌ విలేకరులకు తెలిపారు. మూడు రోజుల కిందట ఇదే ప్రాంతంలో మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు పోలీసులు గాయపడగా, వీరిలో ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. దీంతో అధికారులు ఆ ప్రాంతానికి ప్రత్యేక బలగాలను తరలించి గాలింపును ముమ్మరం చేశారు. బుర్కన్‌పాల్‌ ఘటనకు ప్రతీకారంగానే 20 మంది మావోయిస్టులను హతమార్చినట్లు ప్రచారం జరుగుతోంది. మావోయిస్టులపై పోరును ముమ్మరం చేస్తామని ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌ ఇటీవల చెప్పడం, పోరాట వ్యూహాన్ని సమీక్షిస్తామన్న కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఈ నెల 8న ఢిల్లీలో నక్సల్స్‌ ప్రభావిత రాష్ట్రాలతో సమావేశం నిర్వహించడం తెలిసిందే.

8 మంది మావోయిస్టుల అరెస్ట్‌
సుక్మా జిల్లా చింతగుహ, చింతల్‌నార్‌ ప్రాంతాల్లో 8 మంది మావోయిస్టులను అరెస్టు చేసినట్లు బస్తర్‌ రేంజ్‌ ఐజీ పి. సుందర్‌రాజ్‌ మంగళవారం తెలిపారు. బుర్కన్‌పాల్‌ వద్ద సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై దాడిచేసి 25 మందిని చంపిన ఘటనలో వీరంతా నిందితులని ఆయన వెల్లడించారు. తాజా అరెస్టులతో బుర్కన్‌పాల్‌ ఉదంతంలో అరెస్టయిన నిందితుల సంఖ్య 17కు చేరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement