15వ లోక్‌సభకు తెర | 15th Lok Sabha, election is completed | Sakshi
Sakshi News home page

15వ లోక్‌సభకు తెర

May 18 2014 2:00 AM | Updated on Jul 29 2019 5:59 PM

15వ లోక్‌సభకు తెర - Sakshi

15వ లోక్‌సభకు తెర

పెప్పర్ స్ప్రేలతో చెరగని మరకలు అంటించుకోవడమే గాక స్వతంత్ర భారత చరిత్రలో అత్యంత గందరగోళం, ప్రతిష్టంభనలమయంగా సాగిన 15వ లోక్‌సభ ప్రస్థానానికి తెరపడింది.

రద్దుకు కేంద్ర మంత్రివర్గం సిఫార్సు
రచ్చకు మారుపేరుగా నిలిచిన సభ
చరిత్రాత్మక బిల్లుల ఆమోదమే ఊరట
త్వరలో కొలువుదీరనున్న 16వ లోక్‌సభ

 
న్యూఢిల్లీ: పెప్పర్ స్ప్రేలతో చెరగని మరకలు అంటించుకోవడమే గాక స్వతంత్ర భారత చరిత్రలో అత్యంత గందరగోళం, ప్రతిష్టంభనలమయంగా సాగిన 15వ లోక్‌సభ ప్రస్థానానికి తెరపడింది. శనివారం ఉదయం  మన్మోహన్‌సింగ్ నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గం శనివారం చివరిసారిగా సమావేశమైంది. లోక్‌సభను రద్దు చేయాల్సిందిగా రాష్ట్రపతికి సిఫార్సు చేసింది. మన్మోహన్ పాత్రను శ్లాఘిస్తూ తీర్మానాన్ని కూడా ఆమోదించింది. శుక్రవారం 16వ లోక్‌సభ ఫలితాల వెల్లడితో సుదీర్ఘ ఎన్నికల క్రతువు ముగియడం బీజేపీ సొంతంగానే మెజారిటీ కంటే ఎక్కువ లోక్‌సభ స్థానాలతోవిజయం సాధించడం తెలిసిందే. కొత్త లోక్‌సభ సభ్యుల ఎన్నికకు సంబంధించి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయడంతో 16వ లోక్‌సభ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతుందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్ తెలిపారు. కొత్త సభ్యుల జాబితా రాష్ట్రపతికి అందాక ఆయన తగిన చర్యలు చేపడతారన్నారు. 15వ లోక్‌సభ నిత్యం మూడు గందరగోళాలు, ఆరు ప్రతిష్టంభనలు అన్నట్టుగా సాగింది.

కుంభకోణాలు, అవినీతి ఆరోపణలపై అంతులేని రచ్చకు వేదికైంది. ముఖ్యంగా చివరి సమావేశాల్లో విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తోటి సభ్యులపై నిండు సభలో పెప్పర్ స్ప్రేకు తెగబడిన ఉదంతం లోక్‌సభ ఔన్నత్యాన్ని అథఃపాతాళానికి దిగజార్చింది. తెలంగాణ బిల్లుపై చర్చ కనీవినీ ఎరగని రచ్చ. ఇరు ప్రాంతాల ఎంపీల బాహాబాహీకి,  16 మంది సీమాంధ్ర సభ్యుల సస్పెన్షన్‌కు దారితీసింది. గందరగోళం మధ్యే విభజన బిల్లు లోక్‌సభ ఆమోదం పొందింది. 2జీ స్కాంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ వేయాలన్న బీజేపీ డిమాండ్ దెబ్బకు రెండేళ్ల క్రితం లోక్‌సభ సమావేశాలు తుడిచిపెట్టుకుపోయాయి. బొగ్గు  స్కాంకు బాధ్యతగా మన్మోహన్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో పార్లమెంటు దద్దరిల్లింది. దాణా స్కాంలో దోషులుగా తేలిన లాలూప్రసాద్  జేడీయూ ఎంపీ జగదీశ్ శర్మలు లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయారు. ఇన్ని గందరగోళాల మధ్యా ఆహార భద్రత, లోక్‌పాల్ వంటి చరిత్రాత్మక చట్టాలు చేసిన ఘనతా 15వ సభకు దక్కింది. అయితే మహిళా కోటా బిల్లు లోక్‌సభలో గట్టెక్కలేకపోయింది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement