క్రీడారత్నాలు..

Nalgonda athletes - Sakshi

పలు పోటీల్లో రాణిస్తున్న

పేద విద్యార్థులు

ప్రతిభను చాటి జాతీయస్థాయి క్రీడలకు ఎంపిక 

జిల్లా, రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో పతకాల సాధనలో కీలక పాత్ర

పేదింటి విద్యార్థులు పలు క్రీడల్లో రాణిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ.. సంక్షేమ హాస్టళ్లలో వసతి పొందుతూ.. జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటున్నారు. ఉన్న కొద్దిపాటి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ.. జిల్లా, రాష్ట్ర స్థాయిలో పలు పతకాలు సాధించారు. నిరంతరం సాధన చేస్తూ.. దేశజట్టుకు పాతినిధ్యం వహించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.

సాక్షి, నల్లగొండ : పెద్దవూర మండలం తుంగతుర్తి గ్రామానికి చెందిన దగ్యాల సాయికిరణ్‌ నల్లగొండలోని బీసీ వసతిగృహంలో ఉంటూ స్థానిక బొట్టుగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. చిన్ననాటి నుంచి క్రీడల్లో ఉన్న ఆసక్తితో కబడ్డీలో రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని ప్రతిభ కనభర్చి పలు పతకాలు కైవసం చేసుకున్నాడు. ఎప్పటికైనా దేశం తరపున కబడ్డీ పోటీల్లో పాల్గొనడమే తన లక్ష్యమని చెబుతున్నాడు. 

సాయికిరణ్‌ పాల్గొన్నపోటీలు..

  •      2016 డిసెంబర్‌లో నల్లగొండలో జరిగిన ఎస్‌జీఎఫ్‌ 62వ జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు తెలంగాణ రాష్ట్ర జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు.
  •      2015–16లో గుజరాత్‌లో జరిగిన 61వ ఎస్‌జీఎఫ్‌ జాతీయస్థాయి కబడ్డీ పోటీల్లో తెలంగాణ రాష్ట్ర జట్టు తరుపున ఆడాడు.
  •      2015లో ఖమ్మంలోని సత్తుపల్లిలో ఒకటో రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని జిల్లా జట్టును ద్వితీయ స్థానంలో నిలిపాడు.
  •      2015లో ఆదిలాబాద్‌ డిస్టిక్ట్‌ సబ్‌ జూనియర్‌ అండర్‌–16 కబడ్డీ పోటీల్లో పాల్గొని జిల్లా జట్టును మొదటి స్థానంలో నిలిపాడు.
  •      2016లో వరంగల్‌ జిల్లా నర్సంపేటలో నిర్వహించిన ఎస్‌జీఎఫ్‌ రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా జట్టును మొదటిస్థానంలో నిలిపాడు.
  •      2017 జనవరిలో మంచిర్యాల జిల్లాలో జరిగిన సబ్‌ జూనియర్‌ అండర్‌–16 విభాగంలో పాల్గొని జిల్లా జట్టును మొదటి స్థానంలో నిలిపాడు.
  •      సబ్‌ జూనియర్‌ అండర్‌–16 కబడ్డీ పోటీలకు ఆలిండియా స్పోర్డ్స్‌ అథారిటీ జట్టుకు ఎంపికయ్యాడు.

కబడ్డీలో రాణిస్తున్న మధు 
నల్లగొండ టూటౌన్‌ : పెద్దవూర మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన తరి మధు నల్లగొండలోని బొట్టుగూడ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతూ స్థానిక ఎస్సీ వసతి గృహంలో ఉంటున్నాడు. కబడ్డీ మీద మక్కువతో పలు పోటీల్లో రాణించి.. రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొన్నాడు. కబడ్డీతో పాటు వెయిట్‌ లిఫ్టింగ్‌లో కూడా రాణిస్తున్నాడు. అంతర్జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో దేశం తరపున ఆడాలనే ఆకాంక్షతో ముందుకు సాగుతున్నాడు.
మధు పాల్గొన్న పోటీలు..

  •  2016 డిసెంబర్‌లో నల్లగొండలో నిర్వహించిన 62వ ఎస్‌జీఎఫ్‌ జాతీయస్థాయి కబడ్డీ పోటీల్లో తెలంగాణ జట్టు తరుపున పాల్గొన్నాడు.
  •  2013–14 విజయనగరం జిల్లాలో జరిగిన ఎస్‌జీఎఫ్‌ అండర్‌–14 విభాగంలో జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.
  •  2014–15లో నిజామాబాద్‌ జిల్లాలో నిర్వహించిన ఎస్‌జీఎఫ్‌ అండర్‌–14లో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొన్నాడు..
  •  2014–15లో ఆదిలాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి పైకా పోటీల్లో జిల్లా జట్టు నుంచి పాల్గొని మొదటి బహుమతి కైవసం చేసుకున్నాడు.
  •  2015–16లో ఎస్‌జీఎఫ్‌ అండర్‌–17 విభాగంలో రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా జట్టు ద్వితీయ బహుమతి గెలుచుకోవడంలో కీలకపాత్ర వహించాడు.
  •  2016 డిసెంబర్‌లో వరంగల్‌లో జరిగిన ఎస్‌జీఎఫ్‌ అండర్‌–17 కబడ్డీ పోటీల్లో జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహించి రాష్ట్రస్థాయిలో మొదటి స్థానంలో నిలిచాడు.
  •  2015–16లో ఖమ్మంలో జరిగిన 55 కేజీల వెయిటింగ్‌ లిఫ్టింగ్‌ రాష్ట్రస్థాయి పోటీల్లో మెడల్‌  సాధించాడు.

ఫుట్‌బాల్‌లో గోల్డ్‌మెడల్‌ సాధించిన సాయిచంద్రసిద్దార్థ

నల్లగొండకు చెందిన బొమ్మపాల సాయిచంద్రసిద్దార్థ ఫుట్‌బాల్‌ పోటీల్లో అత్యంత ప్రతిభ చాటుతున్నాడు. 2016లో స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా జట్టుకు ఎంపికయ్యాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఫుట్‌బాల్‌ అకాడమీకి ఎంపికైన తొలి క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు. పలు జాతీయ క్రీడాపోటీల్లో పాల్గొని గోల్డ్‌మెడల్‌ సాధించాడు. 
సిద్దార్థ పాల్గొన్న పోటీలు..

  •  2015లో ఛత్తీస్‌గడ్‌లో జరిగిన జాతీయ స్థాయి ఫుట్‌బాల్‌ పోటీల్లో తెలంగాణ జట్టు తరపున పాల్గొన్నాడు. 
  •  2016 జమ్ముకాశ్మీర్‌లో నిర్వహించిన అండర్‌–19 జాతీయస్థాయి ఫుట్‌బాట్‌ పోటీల్లో రాష్ట్ర జట్టు నుంచి పాల్గొన్నాడు. 
  • ఇటీవల కేరళలో జరిగిన సౌత్‌జోన్‌ ఇంటర్‌ యూనివర్సిటీ ఫుట్‌బాల్‌ పోటీల్లో పలు రాష్ట్రస్థాయి క్రీడాపోటీల్లో తన ప్రతిభ కనబర్చి గోల్డ్‌మెడల్, సిల్వర్‌మెడల్‌ గెలుపొందాడు.  

జాతీయ స్థాయికి ఎదగడం గర్వకారణం 
ప్రభుత్వ వసతి గృహాల్లో ఉంటూ పేదింటి పిల్లలు జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు ఎదగడం ఎంతో గర్వకారణం. రోజూ వీరి కోసం ఛత్రపతి శివాజీ కబడ్డీ అండ్‌ స్పోర్ట్స్‌ అకాడమీ ఏర్పాటు చేసి క్రీడల్లో ప్రోత్సహిస్తున్నాను. వేసవికాలంలో కూడా 30 మంది విద్యార్థులకు ఉచిత భోజన వసతి కల్పిస్తూ క్రీడా శిబిరాలు నిర్వహిస్తున్నాం. తమ పాఠశాల నుంచే జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు నలుగురు విద్యార్థులు ఎంపికవడం చాలా సంతోషంగా ఉంది. విద్యార్థులు పట్టుదలతో సాధన చేస్తున్నారు. – బొమ్మపాల గిరిబాబు, కబడ్డీ కోచ్, పీఈటీ, బొట్టుగూడ 

Read latest Nalgonda News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top