గుండెల్లో నిలిచిపోయే ‘యాత్ర’

Ysr Biopic Yatra Movie Responce In Karnataka - Sakshi

వైఎస్‌ఆర్‌ ఆశయాలకు ప్రతిరూపం

అభిమానులు, ప్రేక్షకుల మనోగతం

మహానేత సినిమాకు బళ్లారిలో బ్రహ్మరథం

ఎటుచూసినా కరువు కాటకాలు, దుర్భరంగా ప్రజల బతుకులు. చేయడానికి పని లేదు, తినడానికి తిండి లేదు. జేబులో చిల్లిగవ్వ కరువాయె. ఇటువంటి పరిస్థితుల్లో నేనున్నానంటూ ప్రజలకు భరోసానివ్వడానికి మహానేత వైఎస్‌ఆర్‌ చేపట్టినదే ప్రజా ప్రస్థాన పాదయాత్ర. ఆ మహాఘట్టం వెండితెరపై యాత్రగా పునరావిష్కృతమై ప్రేక్షకుల నుంచి జేజేలు అందుకుంటోంది. వైఎస్‌ఆర్‌గా మలయాళ సూపర్‌స్టార్‌ మమ్ముట్టి పాత్రకు ప్రాణం పోశారని మన్ననలు పొందారు. కన్నడనాట ఈ చిత్రం బహుళ ప్రజాదరణ పొందుతోంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం నయవంచక పరిపాలనతో విసిగిపోయిన ప్రజానీకంలో 2004 అసెంబ్లీ ఎన్నికల ముందు మహానేత దివంగత ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి  వైఎస్‌ రాజశేఖరరెడ్డి అప్పట్లో చేపట్టిన ప్రజాప్రస్థాన యాత్ర కొత్త ఆశలు చిగురింపజేసింది. ఏపీని కొత్త అడుగులు వేయించిన ప్రజాప్రస్థాన యాత్ర, మహానేత వైఎస్‌ఆర్‌ క్షేత్ర స్థాయి నుంచి సమస్యలు తెలుసుకున్న దృశ్యాలు కళ్లకు కట్టినట్లు మలయాళ ప్రముఖ సినీ హీరో మమ్ముట్టి నటించిన ‘యాత్ర’ కన్నడనాట ప్రభంజనం సృష్టిస్తోంది. యాత్ర సినిమా బళ్లారి నగరంలోని గంగ థియేటర్‌లో ప్రదర్శిస్తున్నారు. సినిమా విడుదలైన శుక్రవారం మొదటి ప్రదర్శన నుంచే ప్రేక్షకులు, అభిమానులతో కిక్కిరిసింది.

కదిలిన మనసులు, చెమర్చిన కళ్లు
వైఎస్‌ఆర్‌ జ్ఞాపకాలను నెమరవేసుకుని ప్రేక్షకుల కళ్లు చెమర్చాయి. ప్రజాప్రస్థాన యాత్రలో ఆస్పత్రిలో గుండెజబ్బు చిన్నారి కష్టాలను వైఎస్‌ఆర్‌ చూసి వారికి చేయూత ఇచ్చేందుకు ప్రయత్నించిన దృశ్యం, అనంతరం ఆ బాలిక కన్నుమూయడం సన్నివేశం ప్రేక్షకులను కలచివేసింది. ఎన్నికల్లో ఘన విజయంతో వైఎస్‌ఆర్‌ సీఎం అయిన తర్వాత ఆరోగ్యశ్రీ నాంది పలకడానికి ఆ ఘటనే కారణమని భావిస్తారు. ప్రజాప్రస్థాన యాత్రలో వైఎస్‌ఆర్‌ కళ్లారా చూసిన సమస్యలకు సీఎం అయిన తర్వాత పరిష్కార మార్గం చూపారని ప్రేక్షకులు పేర్కొన్నారు. రెండు రోజులుగా యాత్ర సినిమా హౌస్‌ ఫుల్‌ కలెక్షన్లతో సాగుతోందని థియేటర్‌ యజమాని సాక్షికి తెలిపారు. యాత్ర సినిమా చూసిన ప్రేక్షకులు ఏమన్నారంటే...  

అందరి సమస్యలను తీర్చారు
యాత్ర సినిమా కొత్త అనుభూతిని ఇచ్చింది. వైఎస్‌ఆర్‌ సుదీర్ఘ పాదయాత్రను యాత్ర సినిమాలో చూసేందుకు అవకాశం ఏర్పడింది. పాదయాత్రలో పేదల కష్టాలు తెలుసుకున్న మహానేత దివంగత ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ఆర్‌ ప్రతి ఒక్కరి సమస్యలను పరిష్కరించారు. ఏ ప్రభుత్వం చేయని అభివృద్ధిని ఆయన చేసి చూపించారు.  
– రమేష్, బళ్లారి

అద్భుతంగా ఉంది
యాత్ర సినిమా అద్భుతంగా ఉంది. మహానేత దివంగత ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సుదీర్ఘ ప్రజాప్రస్థాన పాదయాత్రను ఈ సినిమా ద్వారా చూసే భాగ్యం కలిగింది. అనేక సన్నివేశాలను మనసును కదిలించాయి. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని సీఎం అయిన తర్వాత అమలు చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ జనంలో చిరస్థాయిగా నిలిపోయారు.  
– బేసేజ్‌రెడ్డి, కొర్లగొంది

ఆనందం, బాధ కలిగాయి
వైఎస్‌ఆర్‌ ప్రజా ప్రస్థాన యాత్రను చిత్రంలో చూసిన తరువాత ఆనందంతో పాటు ఎంతో బాధ కలిగింది. కాళ్లకు బొబ్బలు వచ్చినా, సుస్తీ కలిగినా ఆపకుండా పాదయాత్ర చేయడం వల్ల ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే కాకుండా యావత్‌ దేశానికి మంచి జరిగింది. వైఎస్‌ఆర్‌ సీఎం అయిన తర్వాత అమలు చేసిన పథకాలు నేడు దేశవ్యాప్తంగా అమలు అవుతున్నాయంటే అది మహానేత చలువే.
– శ్రీకాంత్‌రెడ్డి, కొళగల్లు

దేశానికే ఆదర్శం వైఎస్‌ఆర్‌ పథకాలు
ప్రజాప్రస్థాన యాత్ర సినిమా ఎంతో మంచి అనుభూతిని కలిగించింది. ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్, విద్యార్థులకు ఫీజ్‌ రిఇంబర్స్‌ మెంట్, జలయజ్ఞం ఇలా చెప్పుకుంటే పోతే వైఎస్‌ఆర్‌ పథకాలు దేశానికి వరంగా మారిపోయాయి. అలాంటి మహానేత చేసిన ప్రజాప్రస్థాన యాత్రను మేం మళ్లీ చూసేందుకు యాత్ర సినిమా దోహదపడింది. మమ్ముట్టి ఎంతో బాగా నటించారు. యాత్ర సినిమా మళ్లీ మళ్లీ చూడాలని  ఉంది. రాజకీయ నాయకుడు ఎలా ఉండాలన్నది చేసి చూపించింది ఒక్క వైఎస్సార్‌ మాత్రమే.
– హేమారెడ్డి, కొళగల్లు

వైఎస్‌ఆర్‌ అంటేనే సమ్మోహకశక్తి
వైఎస్‌ఆర్‌ నిర్వహించిన ప్రజాప్రస్థాన పాదయాత్ర మేం కుటుంబం మొత్తం చూసి తరించాం. వైఎస్‌ఆర్‌ అనే మూడు అక్షరాలు సమ్మోహనశక్తి లాంటివి. వృద్ధులు పడుతున్న బాధలను తెలుసుకుని, వృద్ధాప్య పెన్షన్‌ను భారీగా పెంచారు. విద్యుత్‌ కొరతతో అల్లాడిపోతున్న రైతాంగాన్ని ఆదుకునేందుకు ఉచిత విద్యుత్, విద్యుత్‌ బకాయిల రద్దు చరిత్రాత్మకం. ఇదంతా ప్రజాప్రస్థాన యాత్ర ద్వారానే సాధ్యమైంది. మహానేత పాదయాత్ర యావత్‌ దేశానికే మార్గదర్శకంగా మారింది.
– లలితమ్మ, బళ్లారి

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top