అంతరంగ ‘యాత్ర’

Ys Rajasekhara Reddy Biopic Yatra Movie Special - Sakshi

డైరెక్టర్ మహి ఇది బయోపిక్ కాదన్నాడు. నిజమే... జననంతో మొదలై మరణంతో అంతమయ్యే డాక్యుమెంటరీలా లేదు. ఈవెంట్ బేస్డ్ స్టోరీ అన్నాడు. అది మాత్రం నిజం కాదనుకుంటా... ఎందుకంటే.. వైఎస్ పాదయాత్ర కేవలం ఓ క్రతువు కాదు. వసివాడిన పేదల జీవితాల్లో వికసించిన వసంత రుతువు. అది ముగిసిన యాత్ర కాదు.. ‘‘నడుస్తున్న’’ చరిత్ర. అందుకే తడుస్తున్న కళ్లతో ప్రేక్షకులు ఆ చిత్రాన్ని చూస్తున్నారు. బరువెక్కిన హృదయాలతో బయటికి వస్తున్నారు.

ఈ దర్శకుడు నిజంగానే ‘మహి’మాన్వితుడు. లేకపోతే.. ఎక్కడో విదేశాల్లో ఉండి ఆంధ్రదేశంలో సాగిన పాదపాత్రని.. ఎలా చూడగలిగాడు..! కంట తడిపెట్టించే సంభాషణల సాగు ఎలా చేశాడు..! హృదయాన్ని కదిలించే కడగళ్ల కథని ఎలా రాశాడు..! పాదయాత్ర సాక్షిగా రాజన్న జనం గుండె చప్పుడు వింటుంటే.. ఈ దర్శకుడు అదృశ్యంగా ఉండి.. పెద్దాయన అంతరంగాన్నే ఆలకించినట్టున్నాడు. యాత్ర చూస్తున్నంత సేపూ.. మహికి మహిమలేమన్నా వచ్చా.. అన్న సందేహం రావొచ్చు. అంతలా కనికట్టు చేశాడు. కట్టిపడేశాడు.

కష్టాలకి తలవంచని తత్వం, మాట తప్పని వ్యక్తిత్వం, అనుకున్నది సాధించే మొండితనం, శత్రువునైనా ప్రేమించే మంచితనం.. వైఎస్ సొంతం. సినిమా ఆసాంతం అదే కనిపించింది.  మమ్ముట్టి ఆ పాత్రని ఆకళింపు చేసుకొని నటించలేదు. వైఎస్ అంతరంగాన్ని ఆవాహనం చేసుకున్నాడు. రాజన్న నడకలోని రాజసం, మాటలోని గాంభీర్యం.. మనసులోని మర్మం.. సెల్యులాయిడ్‌పై నిలువెల్లా వ్యాపించింది. అక్కడున్న గాలిలో సైతం వైఎస్ ఆత్మ సంలీనమై సంచరించింది. ఇది కంచికి చేరే కథలా లేదు. ఇంటికి వచ్చాక కూడా కంటికి కనిపించే దృశ్యాలు. ఎంత దూరం వెళ్లినా వెంటాడే దుఃఖ మేఘాలు. నిజానికి మహి కథ రాయలేదు. నడిచీ నడిచీ బొబ్బలు కట్టిన రాజన్న పాదాలకు ఆత్మీయ లేపనం రాశాడు.

అసలు మహి సినిమా తియ్యలేదు. ఆ చెమట చుక్కల్ని, చెమ్మగిల్లిన కళ్లనీ.. తుడుచుకో రాజన్నా అంటూ.. ఓ తుండు గుడ్డని అందివ్వాలని చూశాడు. తన గుండెలోంచి పొంగే కన్నీళ్లను మాత్రం దాచుకోలేకపోయాడు. వెండితెరపై నిండిన ఆ ఆశ్రుధారే.. యాత్ర.
- రాశ్రీ

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top