విజయశాంతిగారిలా పాయల్‌ స్టార్‌ ఇమేజ్‌ తెచ్చుకోవాలి | Sakshi
Sakshi News home page

విజయశాంతిగారిలా పాయల్‌ స్టార్‌ ఇమేజ్‌ తెచ్చుకోవాలి

Published Wed, Sep 11 2019 4:10 AM

Vinayak Praise The Payal Rajput At Rdx Love Movie Trailer Launch - Sakshi

‘‘డబ్బులకోసం కాకుండా ప్యాషన్‌తో సినిమాలు తీస్తున్నారు కల్యాణ్‌గారు. ఈ కథని నమ్మి బడ్జెట్‌కి వెనకాడకుండా చాలా రిచ్‌గా ‘ఆర్డీఎక్స్‌ లవ్‌’ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాతో ఆయన పెద్ద హిట్‌ సాధింబోతున్నారు’’ అని డైరెక్టర్‌ వీవీ వినాయక్‌ అన్నారు. ‘హుషారు’ ఫేమ్‌ తేజస్‌ కంచర్ల, ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ పాయల్‌ రాజ్‌పుత్‌ జంటగా శంకర్‌ భాను దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఆర్డీఎక్స్‌ లవ్‌’. హ్యాపీ మూవీస్‌ పతాకంపై సి.కల్యాణ్‌ నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌ని వీవీ వినాయక్‌ విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘శంకర్‌ భాను నాతోపాటే అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశాడు. చాలా మంచి సినిమాలు చేశాడు, కానీ సరైన బ్రేక్‌ రాలేదు.

ఈ సినిమాతో కమర్షియల్‌ డైరెక్టర్‌గా తనకి పెద్ద బ్రేక్‌ రావాలి. తేజస్, పాయల్‌కి ఈ సినిమా మంచి పేరు తేవాలి. పాయల్‌ రాజ్‌పుత్‌ ఈ సినిమాతో విజయశాంతిగారిలా స్టార్‌ ఇమేజ్‌ తెచ్చుకోవాలి’’ అన్నారు. సి. కల్యాణ్‌ మాట్లాడుతూ– ‘‘యుక్త వయసులో జీవితాన్ని సరదాగా గడపాల్సిన టైమ్‌లో అవన్నీ వదులుకొని తన గ్రామం కోసం, చుట్టుపక్కల గ్రామాల ఆశయ సాధనకోసం తన శీలాన్ని సైతం పణంగా పెట్టి ఓ అమ్మాయి ఏ విధంగా పోరాడింది? అనేది మా చిత్ర కథాంశం.

ఈ సినిమా తర్వాత పాయల్‌ మరో  విజయశాంతి అవుతుంది. అంత గొప్పగా ఈ చిత్రంలో నటించింది. సెన్సార్‌ పూర్తయింది.. మంచి డేట్‌ చూసుకొని త్వరలో సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘హ్యాపీ మూవీస్, సీకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో ఈ సినిమా చేయడం చాలా గర్వంగా ఫీలవుతున్నా. ‘ఆర్డీఎక్స్‌ లవ్‌’ బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ అవుతుందని నమ్మకంగా ఉన్నా. ఈ బ్లాస్టింగ్‌ హిట్‌తో కల్యాణ్‌గారి సంస్థ గొప్ప ప్రొడక్షన్‌ కంపెనీ అవుతుంది’’ అని శంకర్‌ భాను అన్నారు. ‘‘ఈ అవకాశం ఇచ్చిన కల్యాణ్‌ గారికి, చక్కగా తెరకెక్కించిన శంకర్‌ భానుగారికి థ్యాంక్స్‌’’ అన్నారు తేజస్‌ కంచెర్ల. ‘‘ఆర్‌ఎక్స్‌ 100’ చిత్రంతో ఒక్కసారిగా నా లైఫ్‌ మారిపోయింది. ‘ఆర్డీఎక్స్‌ లవ్‌’ కొంచెం వైవిధ్యంగా ఉంటుంది. విద్య పరంగా ఆలోచింపచేస్తూ స్ఫూర్తిగా నిలుస్తుంది. మనసును హత్తుకునే సినిమా ఇది’’ అని పాయల్‌ రాజ్‌పుత్‌ అన్నారు. నిర్మాతలు మల్లిడి సత్యనారాయణ రెడ్డి, తుమ్మలపల్లి రామసత్యనారాయణ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సి.రాంప్రసాద్, సంగీతం: రథన్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: చిన్నా, సహ నిర్మాత: సి.వి. రావ్‌. 
 

Advertisement
Advertisement