మా అల్లుడు వెరీ కూల్‌!

Venkatesh, Naga Chaitanya discuss Venky Mama - Sakshi

వెంకటేశ్, నాగచైతన్య వరుసకి మేనమామ, మేనల్లుడు. ఇప్పుడు ఆన్‌స్క్రీన్‌ మీద కూడా మామా అల్లుళుగా ‘వెంకీ మామ’ చేశారు. ‘మా మామ కూల్‌’ అంటున్నారు చైతన్య. ‘మా అల్లుడు వెరీ కూల్‌’ అంటున్నారు వెంకటేశ్‌. ఈ ఇద్దరూ ఆఫ్‌ స్క్రీన్‌ ఎలా ఉంటారు? ఫిట్‌నెస్‌ సీక్రెట్స్‌ ఏంటి? ప్లస్‌లు మైనస్‌లు ‘సాక్షి’తో పంచుకున్నారు. వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా కేయస్‌ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వెంకీమామ’. సురేశ్‌బాబు, టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించారు. పాయల్‌ రాజ్‌పుత్, రాశీఖన్నా కథానాయికలు. గత శుక్రవారం ఈ చిత్రం విడుదలైంది. ఈ సందర్భంగా చెప్పిన విశేషాలు.
 

► రామానాయుడుగారు ఉంటే చాలా హ్యాపీగా ఫీల్‌ అయ్యేవారు. మీ ఇద్దర్నీ స్క్రీన్‌ మీద చూసి బాగా సంబరపడేవారేమో.
వెంకటేశ్‌: తప్పకుండా. అందరికంటే నాన్నగారు చాలా సంతోషపడేవారు. చైతూ  సినిమాల్లోకి రాగానే ఆయన చాలా ఎగ్జయిట్‌ అయ్యారు. నాన్నకు చైతూ అంటే బాగా ఇష్టం. ‘మీ ఇద్దరూ కలిసి ఓ సినిమా చేయండి’ అంటుండేవారు.  అప్పట్లో చాలా కథలు విన్నాం కానీ కుదర్లేదు. ఇంతకాలానికి ఇలాంటి కథ రావడం దాన్ని మేం చేయడం, ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించడం హ్యాపీగా ఉంది. ఫ్యామిలీలు థియేటర్స్‌కి వస్తున్నారు.

► తాతయ్య (రామానాయుడు) మిమ్మల్ని బాగా ముద్దు చేసేవారా?
నాగచైతన్య: అవును. చిన్నప్పుడు చాలా బొద్దుగా ఉండేవాణ్ణి. బాగా ముద్దు చేసేవారు.  ‘ఏం చేస్తావు రా’ అని అడిగేవారు. ‘ఇంజనీరింగో ఏదో ఒకటి చేస్తా తాతా’ అనేవాణ్ణి. విని నవ్వేవారు. ‘ఇప్పుడు ఇలానే అంటావు లే తర్వాత చూద్దాం’ అనేవారు. నేను హీరో అయ్యాక మనం సినిమా చేద్దాం, నువ్వే కథ తీసుకొని రా అంటుండేవారు. నన్ను, వెంకి మామను పెట్టి సినిమా తీయాలన్నది ఆయన కోరిక. ఒకవేళ తాతగారు ఉండి ఉంటే ఈ సక్సెస్‌ను ఆయనే ఎక్కువ ఎంజాయ్‌ చేసేవారు.

► ఇద్దరూ కలిసి సినిమా చేస్తున్నాం అని తెలిసినప్పుడు ఏమైనా ఒత్తిడిగా అనిపించిందా?
వెంకీ: ఇద్దరి పాత్రలు మంచిగా ఉన్నాయి. అన్ని ఎమోషన్స్‌ తగినన్ని ఉన్నాయి. ఫస్ట్‌ హాఫ్‌లో వినోదం సెకండ్‌ హాఫ్‌లో ఎమోషనల్‌ సీన్స్, ఫైట్స్‌ అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయి. ఈ సినిమా చేయడాన్ని కూడా బాగా ఎంజాయ్‌ చేశాం.

► కెమిస్ట్రీ కూడా బాగా కుదిరింది. చైతూ కాకుండా వేరే హీరో ఉన్నా ఇలానే ఉండేదా?
వెంకీ: చైతూ లేకుండా ఎలా కుదురుతుంది?  ప్రేక్షకులు కూడా మా ఇద్దర్నీ స్క్రీన్‌ మీద చూడాలనుకున్నారు. పోస్టర్‌ రిలీజ్‌ చేసినప్పటి నుంచి ప్రేక్షకుల్లో ఆసక్తి బాగా పెరిగింది. పాజిటివ్‌ రెస్పాన్స్‌ ఉంది.

► పెద్ద మావయ్య బెస్టా? చిన్న మావయ్య బెస్టా?
చైతూ: ఎవరి క్వాలిటీస్‌లో వాళ్లే బెస్ట్‌. ఇద్దరి మావయ్యల దగ్గర విభిన్నమైన లక్షణాలు ఉన్నాయి. చిన్నవాళ్లంటే కొంచెం చనువు ఉంటుంది కదా. అలా నేను, రానా వెంకీమామతో సరదాగా ఉంటాం. సురేశ్‌ మామ దగ్గర ఆ సీనియారిటీ ఉంటుంది.

► ఇద్దరు తాతలు (రామానాయుడు, నాగేశ్వరరావు), నాన్న (నాగార్జున), మావయ్యలు (సురేశ్‌బాబు, వెంకటేశ్‌) వీళ్లందరి పేరు నిలబెట్టాలనే భయం ఉంటుందా?  
చైతూ: భయం కంటే బాధ్యతగా ఉంటుంది. 4–5 సినిమాలు చేశాక మన మీద అంచనాలు, బాధ్యతలు చాలా ఉన్నాయి అని అర్థం అయింది.

► వెంకీగారు చేసిన సినిమాల్లో మీకు నచ్చినవి?
చైతూ: చాలా సినిమాలున్నాయి. మామ ఒకరకమైన సినిమాలకే అతుక్కుపోలేదు. అన్ని జానర్లను టచ్‌ చేశారు. ఎలాంటి సినిమా చేసినా కన్విన్స్‌ చేస్తారు. 

► మామూలుగా వెంకటేశ్‌గారి కామెడీ టైమింగ్‌ బావుంటుంది కదా... మీకు ఆయనతో ఈ సినిమా చేయడం ఇబ్బంది ఏమైనా అనిపించిందా?
చైతూ: చాలా ఇబ్బంది అనిపించింది. యాక్ట్‌ చేసేప్పుడు ఇబ్బంది పడ్డాను. కానీ మామ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను. వెంకీ మామ ముందే కామెడీ చేసే అవకాశం రావడం వల్ల చాలా నేర్చుకున్నాను.

► ఈ సినిమా చేస్తున్నప్పుడు నిజజీవితంలో మీ మధ్య జరిగిన ఇన్సిడెంట్స్‌ ఏమైనా గుర్తొచ్చాయా?
వెంకీ: అలా ఏం లేదు. మేమిద్దరం ఎలాంటి వాళ్లం అంటే.. దేనికీ ఎగ్జయిట్‌ అయిపోం. కూల్‌ గా ఉంటాం. ఈ సినిమా ప్రయాణం అద్భుతంగా ఉంది. మా ఫ్యామిలీ చాలా ఆనందంగా ఉన్నారు.  

► అన్నయ్య, అబ్బాయి కలిసి సినిమా చేయడం మీ అమ్మగారికి ఎలా ఉంది.
చైతూ: చాలా సంతోషంగా ఉన్నారు. మా ఇద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ, మా కామెడీ బాగా నచ్చింది. బాగా కనెక్ట్‌ అయ్యారు. నన్ను మిలటరీ పాత్రలో చూడటం సంతోషంగా ఉంది అన్నారు.

► ఎవరైనా ప్లస్సుల గురించే మాట్లాడతారు. మీ మావయ్య గురించి ఓ మైనస్‌ చెప్పండి.
చైతూ: అస్సలు ఏం లేదు.

► కోప్పడతారా?
చైతూ: ఈ సినిమా షూటింగ్‌ చేసే ముందు వరకూ ఎక్కువ నవ్వుతూనే చూశాను. కానీ షూటింగ్‌ అప్పుడే కోప్పడటం చూశాను. అది పని కోసమే.
వెంకటేశ్‌: ఎక్కడో వస్తుంది. కానీ ముందుకన్నా బాగా తగ్గించాను. అప్పుడు టెంపర్‌ ఫుల్‌గా ఉండేది. ఇద్దరం చాలా కామ్‌గా ఉంటాం.

► మీరు చైతన్య వయసులో ఉన్నప్పటితో పోలిస్తే చైతన్య మీ కంటే కూల్‌ అనుకుంటా?
వెంకీ: అందులో డౌటే లేదు. నా కెరీర్‌ ప్రారంభంలో నాకు కొంచెం టెంపర్‌ ఎక్కువ ఉందేది. ఇరిటేషన్‌ ఎక్కువగా ఉండేది. అంత కంఫర్ట్‌బుల్‌గా ఉండేది కాదు. ఈ సీన్‌ ఇంకా బెటర్‌గా చేసుండొచ్చు అనుకుండేవాణ్ణి. మెల్లిగా కూల్‌ అయ్యాను. చాలా హ్యాపీ. తన మైనస్‌ అంటే నాకంటే సెలెంట్‌. అది బయటవాళ్లకు మైనస్‌లా కనిపించవచ్చు. కానీ మాకు అలా ఉండటం చాలా సౌకర్యంగా ఉంటుంది.

► చైతూ చిన్నప్పుడు చేసిన చిలిపి పనులేమైనా..?
వెంకీ: అస్సలు లేవు. చాలా బుద్ధిగా ఉండేవాడు. బొద్దుగా కూడా (నవ్వుతూ). ఇప్పుడు ఫుల్‌ ఫిట్‌గా ఉంటున్నాడు. హెల్దీఫుడ్‌ తీసుకుంటాడు. తన లైఫ్‌ స్టయిల్‌ కూడా డీసెంట్‌.

► ఫిట్‌నెస్‌ గురించి టిప్స్‌ పంచుకుంటారా?
వెంకీ: నేను అడిగేవాణ్ణి. తను యంగ్‌. అద్భుతంగా పర్ఫెక్ట్‌ బాడీ మెయింటెయిన్‌ చేస్తున్నాడు. మనం వాళ్ల నుంచి నేర్చుకోవాలి. చైతన్యే అని కాదు యంగ్‌స్టర్స్‌ నుంచి నేర్చుకోవాలి. రానా దగ్గర నుంచి కూడా. వాడి ఫిట్‌నెస్‌ కంటే కూడా బిజినెస్‌ సైడ్‌. వాడు మా నాన్నలానే. సినిమాలంటే వాడికి చాలా ప్యాషన్‌.

► చైతూని పెళ్లికొడుకు గా చూసినప్పుడు ఎలా అనిపించింది?
వెంకీ: కొత్త లైఫ్‌ ప్రారంభించబోతున్నాడు. మంచి పార్ట్‌నర్‌ని ఎంచుకున్నాడు. వాళ్లు ఒకరినొకరు గౌరవించుకునే విధానం బాగుంటుంది.

► నేను కావాలా? మీ మామయ్యా? అని సినిమాలో మీ హీరోయిన్‌ అంటుంది. నిజ జీవితంలో అలాంటి సందర్భం ఎదురైతే?
వెంకీ: అవన్నీ సినిమాలో. బయట వాడు చాలా క్లియర్‌గా ఉంటాడు. (నవ్వుతూ).

► వెంకీ ఆసనం నేర్పిస్తున్నారా?
వెంకీ: వాడికి అవసరమే లేదు. నో ఫ్రస్ట్రేషన్‌. ఓన్లీ కూల్‌. ఫ్రస్ట్రేషన్‌ ఉన్నా కూల్‌గా డీల్‌ చేస్తాడు.

► మామ నుంచి నేర్చుకున్న విషయం.
చైతూ: కామ్‌గా ఉండటం. పాజిటివ్‌గా ఉండటం. ఏ ప్రాబ్లమ్‌ వచ్చినా అరిచి గోల చేయకుండా స్మూత్‌గా డీల్‌ చేయడం.

► వెంకిమామ ఆధ్యాత్మిక పాఠాలేమైనా చెబుతారా?
చైతూ: అప్పుడప్పుడు సంభాషణల మధ్యలో వస్తుంటాయి. అర్థం అయినవి తీసుకుంటుంటాను. అన్నీ అర్థం చేసుకునే అవగాహన నాకు లేదు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top