సినిమాల్లోకి వస్తానని కలలో కూడా ఊహించలేదు

Tupaki Ramudu Movie Heroine Priya Yadav Special Story About Her Life Style - Sakshi

బుల్లితెరపై పటాస్‌ ప్రియగా ఆదరగొట్టింది.. ఖయ్యూంబాయ్‌ సినిమాలో నందమూరి తారకరత్నకు జోడీగా వెండితెర ప్రేక్షకులను మెప్పించింది. తాజాగా విడుదలైన ‘తుపాకిరాముడు’తో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ సొంతం చేసుకుంది ప్రియాయాదవ్‌.. తన అందం, అభినయంతో తెలుగు సినీ ఇండస్ట్రీలో సెలబ్రెటీగా ఎదుగుతోంది. ఈ నేపథ్యంలో నవతరం కథానాయికగా అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి. పెద్దేముల్‌ మండలంలోని మారుమూల పల్లె జనగాం గ్రామానికి చెందిన ప్రియాయాదవ్‌ తనదైన నటనతో ఉమ్మడి రాష్ట్రాల ప్రేక్షకులను మెప్పిస్తోంది. 

తాండూరు డివిజన్‌ పెద్దేముల్‌ మండలం జనగాం గ్రామానికి చెందిన పుల్లమొల్ల అనిత, రాములు దంపతులకు ప్రియదర్శిని, ప్రియ, ప్రవళిక ముగ్గురు కుమార్తెలు. డిగ్రీ పూర్తయ్యాక పెద్ద కూతురు ప్రియదర్శిని, చిన్నకూతురు ప్రవళికకు వివాహం చేశారు. రెండో కూతురు ప్రియ మాత్రం తాను జీవితంలో స్థిరపడ్డాకే పెళ్లి చేసుకుంటానని, మిమ్మల్ని విడిచి ఎక్కడికి వెళ్లేది లేదని తల్లిదండ్రులను ఒప్పించింది. పెళ్లి చేసుకొని వెళితే చుట్టపు చూపుగా వచ్చి వెళ్లడం తనతో కాదని భావించి వివాహానికి దూరంగా ఉంది. ప్రియ పుట్టిన తర్వాత తండ్రి రాములుకు రాజకీయంగా కలిసొచ్చింది. ఆయన జనగాం గ్రామ సర్పంచ్‌గా, ఎంపీటీసీగా ఎన్నికయ్యారు. 2014లో జరిగిన ఎన్నికల్లో జెడ్పీటీసీగా పోటీచేసిన ప్రియ తల్లి అనిత స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు.   


విద్యాభ్యాసం... 
ప్రియను 3వ తరగతి వరకు హైదరాబాద్‌లోని గీతాంజలి పబ్లిక్‌ స్కూల్‌ హాస్టల్‌ చదివించారు. ఆతర్వాత కూతురును విడిచి ఉండలేక తాండూరులోని గంగోత్రి విద్యాలయంలో 4వ తరగతిలో చేర్పించారు. 9వ తరగతిలో నవోదయ ప్రవేశ పరీక్షకు ఎంపికైన ప్రియ జవహర్‌ నవోదయలో ఇంటర్‌ పూర్తిచేసింది. ఆ తర్వాత ఇంజినీరింగ్‌ కోసం హైదరాబాద్‌లోని మల్లారెడ్డి కళాశాలలో చేర్పించారు. బీటెక్‌ ముగిసిన తర్వాత హైటెక్‌ సిటీలోని టాటాకు చెందిన ఓ కార్పొరేట్‌ సంస్థలో ప్రియకు ఉద్యోగం వచ్చింది. డ్యూటీలో చేరిన తర్వాత డే, నైట్‌ షిఫ్టులు ఉండటంతో కొద్ది రోజులకే జాబ్‌కు గుడ్‌బై చెప్పింది. 

క్లాసికల్‌ డాన్స్‌లో శిక్షణ.. 
ప్రియకు చిన్ననాటి నుంచి డాన్స్‌ అంటే ఇష్టం. ఇది గుర్తించిన తల్లిదండ్రులు ఆమెను తాం డూరులోని క్లాసికల్‌ డాన్స్‌ అకాడమీలో చేర్చించారు. డాన్స్‌ మాస్టర్‌ అశోక్‌ బృందంతో కలిసి దేవాలయ ఉత్సవాలు, వినాయక మండపాల వద్ద ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన కార్యక్రమాల్లో నృత్య ప్రదర్శనలు ఇచ్చిన ప్రియ అందరి దృష్టిని ఆకర్షించింది. అనంతరం బుల్లితెర ఆర్టిస్ట్‌గా పటాస్‌ షోలో అలరించింది. 

‘పల్లెటూరి అమ్మాయిగా అలరిస్తా’
మాది వ్యవసాయ కుటుంబం.. చిన్న పల్లెటూరు.. తాతల కాలం నాటి ఇల్లు.. వర్షం పడితే పైనుంచి కురుస్తుంది. మా ఊరికి రోజుకు ఒక బస్సు మాత్రమే వస్తుంది. అమ్మా నాన్నకు ముగ్గురం ఆడపిల్లలమే.. అక్క, చెల్లికి పెళ్లి చేశాం. మా తల్లిదండ్రులకు పెద్దకొడుకుగా ఉండాలనే వివాహం చేసుకోలేదు. హైదరాబాద్‌లో నేను ఎక్కడకు వెళ్లినా నార్త్‌ ఇండియన్‌ అమ్మాయి అనుకునే వారు. నాతో హిందీలో మాట్లాడేవారు. నేను పక్కా తెలుగులో మాట్లాడితే అవాక్కయ్యేవారు. సినీ పరిశ్రమకు రావాలని ఏనాడూ అనుకోలేదు.

ఒక చిన్న సంఘటన నన్ను ఇటువైపు తీసుకువచ్చింది. బీటెక్‌ తర్వాత సివిల్స్‌ కోసం సిద్ధమవుతున్న సమయంలో ఫణీంద్రానాగిశెట్టి మూవీకి సంబంధించి ఆడిషన్స్‌ జరుగుతున్నాయని స్నేహితులు చెప్పారు. నన్ను ట్రై చేయమని ప్రోత్సహించారు. అందులో సెలెక్ట్‌ కాలేదు. ఆతర్వాత ‘నీ జన్మ నీకే’ సినిమాలో సెకండ్‌ హీరోయిన్‌గా చేశా.. అనంతరం ఖయ్యూంబాయ్‌లో నందమూరి తారకరత్న సరసన నటించే చాన్స్‌ వచ్చింది. ఇందులో రేడియో జాకీ పాత్ర నన్ను వెండితెరకు పరిచయం చేసింది. మా నాన్న నన్ను పెద్ద కొడుకులా చూసుకుంటారు.

ఆయన నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా. తుపాకిరాముడు సినిమాలో హీరోయిన్‌ పాత్ర పేరు అనిత. అమ్మ పేరుతో హీరోయిన్‌గా అవకాశం రావడం మరచిపోలేని అనుభూతి. ఇప్పటివరకు మూడు సినిమాల్లో నటించా. రెండు సినిమాల్లో సెకండ్‌ హీరోయిన్‌గా చేశా. తుపాకిరాముడుకు ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తోంది. మూవీ మొత్తం పల్లెటూరు వాతావరణంలో ఉంటుంది. అందుకోసం డీగ్లామర్‌ రోల్‌లోనే కనిపించా. హీరో విజయ్‌తో చేసిన ‘తమిళ్‌ తంబి.. తెలుగమ్మాయి’ సినిమా సైతం రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. తెలుగింటి పల్లెటూరు అమ్మాయిగా ప్రేక్షకులను అలరిస్తా’.  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top