త్రీ మంకీస్‌ సినిమా రివ్యూ

Three Monkeys Telugu Movie Review - Sakshi

సినిమా : త్రీ మంకీస్‌
నటీనటులు: సుడిగాలి సుధీర్‌, ఆటో రాంప్రసాద్‌, గెటప్‌ శ్రీను, కారుణ్య చౌదరి
దర్శకత్వం: జి.అనిల్‌ కుమార్
నిర్మాత: నగేష్‌. జి
సంగీతం: జి. అనిల్‌ కుమార్‌
బ్యానర్‌: ఓరుగల్లు సినీ క్రియేషన్స్‌
జానర్‌: హారర్‌ కామెడీ

‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’ చిత్రం అంతగా ఆడకపోయినా బుల్లితెర స్టార్‌ సుడిగాలి సుధీర్‌ మరోసారి హీరోగా ముందుకొచ్చాడు. పైగా ఈసారి తన జబర్దస్త్‌ టీం శ్రీను, రాంప్రసాద్‌తో కలిసి సినిమా చేయడం విశేషం. ఇక ట్రైలర్‌ బాగుందంటూ మెగాస్టార్‌ చిరంజీవి ‘త్రీ మంకీస్‌’ను అభినందించడంతో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. జబర్దస్త్‌ షో పాపులారిటీ సినిమాకు ఏమేరకు ప్లస్‌ అయ్యింది? బుల్లితెరపై కడుపు చెక్కలయ్యేలా నవ్వించే ఈ టీమ్‌ వెండితెరపై ఏమేరకు నవ్వులు పండించగలిగింది..? సుధీర్‌, గెటప్‌ శ్రీను, ఆటో రాంప్రసాద్‌ హీరోలుగా ప్రేక్షకులను మెప్పించారా లేదా అనేది చూద్దాం.!

కథ: సంతోష్‌ (సుధీర్‌) మార్కెటింగ్‌ శాఖలో పనిచేస్తుంటాడు. అతనికి ఫణి (గెటప్‌ శ్రీను), ఆనంద్‌ (ఆటో రాంప్రసాద్‌) ప్రాణ స్నేహితులు. ఈ ముగ్గురు కలిసి చేసే కోతిచేష్టలకు అంతే లేదు. సరదాగా సాగిపోతున్న వీరి జీవితంలోకి సన్నీలియోన్‌ ఎందుకు వచ్చింది? అసలు ఆమె ఎవరు.. ఎలా చనిపోయింది? ఆమె చావుకు ఈ ముగ్గురికి సంబంధమేంటి? ఇంతలో సుధీర్‌ ఎలాంటి ప్రమాదంలో చిక్కుకుంటాడు. అతన్ని కాపాడేందుకు ఫణి, ఆనంద్‌ ఏం చేశారు? అసలే చిక్కుల్లో ఉన్న వీరిపై ఓ పాపను కాపాడాల్సిన బాధ్యత ఎలా పడింది. ఆమెను వీరు ఎలా కాపాడారు..? అని సినిమా చూసి తెలుసుకోవాల్సిందే..!
(వీళ్లకి టీవీయే కరెక్ట్‌ అని మాత్రం అనుకోరు)

విశ్లేషణ: సాయం అనే మందు లేక చాలామంది చనిపోతున్నారనే అంశాన్ని దర్శకుడు కథలో అంతర్లీనంగా చూపించే ప్రయత్నం చేశాడు. సినిమా తొలి అర్ధభాగం త్రీ మంకీస్‌ పంచ్‌లు, సరదా సన్నివేశాలతో పరవాలేదనిస్తుంది. వాళ్ల పంచ్‌లు పేలడంతో పెద్దగా బోర్‌ కొట్టదు. అయితే, సెకండాఫ్‌కు వచ్చేసరికి కథ అనూహ్యంగా మలుపు తిరుగుతుంది. ముగ్గురు స్నేహితులను ఓ హత్య కేసులో ఇరికించి, ప్రేక్షకుడిని థ్రిల్‌ చేద్దామనుకున్న దర్శకుడు అందులో పూర్తిగా సక్సెస్‌ కాలేదనే చెప్పాలి. కథ క్రైమ్‌ జానర్‌లోకి వెళ్లిన తర్వాత దర్శకుడు తేలిపోయాడు. అమ్మాయి హత్య కేసులో ముగ్గురు ఇరుక్కు పోయినప్పుడు.. ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు అంతగా పండలేదు. ఏది ఆశించి.. కథ రాసుకున్నాడో అది నిజం చేసేందుకు దర్శకుడి పనితనం సరిపోలేదు. 

తొలి అర్థభాగం జబర్దస్త్‌ పంచ్‌లతో ఫరావాలేదనిపంచిన దర్శకుడు.. రెండో అర్థభాగం థ్రిల్లర్‌ నేపథ్యంలో కథ నడపలేకపోయాడు. ఇక పాటలు చెప్పుకోదగ్గ స్థాయిలో ఏం లేవు. రెండు పాటలు ఫరవాలేదనిపించాయి. బుల్లితెరపై అల్లరి చేసే త్రీ మంకీస్‌లో.. ఎమోషన్స్‌ అనే కొత్త కోణం చూపించారు. షకలక శంకర్‌, కారుణ్య చౌదరి ఓకే అనిపిస్తారు. చిన్న సినిమా అయినా..  సాంకేతికంగా జస్ట్‌ ఓకే అనిపిస్తుంది. ఇక ముగ్గురు హాస్యనటుల్ని ఒకేసారి వెండితెరపై చూపడం.. సగటు అభిమానికి నచ్చుతుంది. అయితే, వాళ్లలోని ప్రతిభను పూర్తిస్థాయిలో ఆవిష్కరించే కథ మాత్రం కాదని చెప్పాలి. దర్శకుడు కేవలం కామెడీనే నమ్ముకుంటే బాగుండేంది.

ప్లస్‌ పాయింట్స్‌: 
సుధీర్‌, శ్రీను, రాంప్రసాద్‌ నటన
కామెడీ టైమింగ్‌

మైనస్‌ పాయింట్స్‌:
కొత్తదనం లేకపోవడం
భయపడేంత హారర్‌ సీన్లు లేకపోవడం

Rating:  
(2/5)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top