చీకటి వెలుగుల రంగేళి!


 పీయూసీ కంప్లీటెడ్... రెండేళ్లు ఖాళీ. ఇంట్లోవాళ్లు పై చదువులు చదివించలేని పరిస్థితి. క్లోజ్ ఫ్రెండ్సంతా జాబుల్లో జాయినైపోయారు.అన్నేళ్లూ తోడూనీడగా ఉన్న బెస్ట్ ఫ్రెండ్ నందా కూడా ఎయిర్‌ఫోర్స్‌కెళ్లిపోయాడు. ఇక రంగనాథ్ తట్టుకోలేకపోయారు. అనాథ అయిన ఫీలింగ్. విపరీతమైన ఒంటరితనం... అంతా శూన్యం. ఇంకే ం చేయాలి? ఒకటే దారి.. ఆత్మహత్య. రైలు పట్టాల దగ్గరకెళ్లి కూర్చున్నారు రంగనాథ్. రైలు కోసం వెయిటింగ్. అది త్వరగా వచ్చేస్తే ఎంచక్కా పెకైళ్లి పోవచ్చు. ఇదీ రంగనాథ్ ప్లాన్. గుడ్‌లక్... ఆ రోజు ట్రె యిన్ బాగా లేట్. ఒక్క క్షణం చాలదూ... మనిషి నిర్ణయంలో ఛేంజ్ రావడానికి. రంగనాథ్‌ను ఆలోచనలు చుట్టుము ట్టాయి. ‘ఎందుకిలా పిచ్చి పని చేస్తున్నా!  చచ్చి సాధించేదేముంది? అమ్మ కల నెరవేర్చడం కోసమైనా బతకాలి’ అని డిసైడైపోయారు రంగనాథ్. ఒక రైలు ఆలస్యం కాకపోతే రంగనాథ్ అనే మంచి నటుడు మనకుండేవారు కాదు.

 

 రంగనాథ్ ఫ్యామిలీలో అందరూ ప్రభుత్వ ఉద్యోగులే. ఎక్కడకు ట్రాన్స్‌ఫరైతే, అక్కడకు వెళ్లిపోవడమే. దాంతో రంగనాథ్ వాళ్లకు ప్రత్యేకంగా స్వస్థలమంటూ లేదు. రంగనాథ్ చెన్నైలో పుట్టారు. రేణిగుంటలో పెరిగారు. రాజమండ్రిలో రైల్వే టీసీగా కొన్నాళ్లు చేశారు. వాళ్ళ ఫ్యామిలీలో చాలామంది సంగీత విద్వాంసులున్నారు. రంగ నాథ్ తల్లి జానకి వీణ వాయించడంలో దిట్ట. సినిమాల్లో సింగర్ కావాలని కోరిక. ఆమె చాలా ట్రై చే శారు. నలుగురు పిల్లలుండడంతో సంసా రంలో మునిగిపోయారామె. దాంతో రంగనాథ్‌ను నటుణ్టి చేయాలని ఆమె కలలు కన్నారు. చివరకు ఆమె కలను రంగనాథ్ నెరవేర్చారు.  బాపు ‘బుద్ధిమంతుడు’లో చిన్నవేషం దొరి కింది. జస్ట్ ఫ్లూట్ పట్టుకుని కనబడటమే. తర్వాత ‘అందాల రాముడు’లో శ్రీరాముడి వేషం ఉంటే రంగనాథ్‌ని పిలిచారు. అప్పుడే ‘చందన’లో హీరో ఛాన్స్. రంగనాథ్‌కు డైలమా. చివరకు ‘చందన’ చే శారు. ‘అందాల రాముడు’ చేసుంటే ‘సీతాకల్యాణం’లో శ్రీరాముడి వేషమిద్దామనుకున్నారు బాపు. అలా గోల్డెన్ ఛాన్స్ మిస్.

 

 పాపం రంగనాథ్ కెరీరంతా ఇంతే. ఎక్కడా సాఫీ కాదు. అంతా ఎగుడుదిగుళ్లే. హీరోగా ఎంత ఎత్తుకెదిగారో అంత సడన్‌గా మాయమయ్యారు. మంచి హైటు, పర్సనాలిటీ, బిహేవియర్, టాలెంట్ ఉండీ రేసులో వెనకబడిపోయారాయన. దర్శక-నిర్మాత విఠలాచార్య ‘మదనమంజరి’ సినిమా టైమ్‌లో రంగనాథ్ జాతకం చూశారు. విఠలాచార్య జ్యోతిషంలో దిట్ట. ఆయన చెప్పింది జరుగుతుందని పరిశ్రమలో ప్రతీతి. రంగనాథ్ జాతకం చూసి ఆయనొకటే  చెప్పారు. ‘‘ఇక మీరు హీరోగా కష్టం. 19 ఏళ్లు అష్టకష్టాలు పడతారు’’ అన్నారు. అచ్చం ఆయన చెప్పినట్టుగానే 1980ల నుంచి రంగనాథ్ కెరీర్‌లో డౌన్‌ఫాల్ మొదలైంది. హీరోగా చేసిన ఫిల్మ్‌లన్నీ అటూయిటయ్యాయి. పాతికడుగుల కటౌట్లలో ఉన్నవాడు పోస్టర్‌లో చిన్న ఫొటో కూడా కనబడని స్థాయికి చేరారు.

 

 హీరోగా అవకాశాల్లేవు. వెనుక చూస్తే పెద్ద ఫ్యామిలీ. అందరికీ తనే దిక్కు. ఏదో ఒకటి చేసి కుటుంబాన్ని పోషించాల్సిందే. దాంతో ‘గువ్వల జంట’తో విలన్‌గా మారాల్సిన పరిస్థితి. 40-50 సినిమాలు విలన్‌గా చేశాడాయన. తర్వాత క్యారె క్టర్ ఆర్టిస్టుగా టర్నయ్యాడు. టీవీల్లో చేయడానికి సినీ తారలు శంకిస్తున్న టైమ్‌లో రంగనాథ్ ధైర్యం చేసి, బాపు ‘శ్రీభాగవతం’లో కంసుడి వేషం వేశారు. కె. రాఘవేంద్రరావు తీసిన ‘శాంతి నివాసం’లో మెయిన్ రోల్ చేశారు.
 

 ఎన్ని మంచి పాత్రలు చేసినా రంగనాథ్‌కు రావాల్సినంత పేరు రాలేదు. హైదరాబాద్‌కు షిఫ్ట్ అయి, పరిశ్రమకు దగ్గరగా ఉన్నా, పరిశ్రమ ఆయనకు దూరం పాటించింది. 2005లో ‘మొగుడ్స్- పెళ్లామ్స్’ సినిమా ఆయన డెరైక్ట్ చేశారు.

 

 రంగనాథ్‌లో మంచి కవి ఉన్నాడు. పత్రికల్లో పొయిట్రీ రాశారు. ‘కవితా సుదర్శనం, అంతరంగ మథనం, ఈ చీకటి తొలగాలి, అక్షర వేదికలు, పదపరిమళం, నడత’ తదితర పుస్తకాలు ప్రచురించారు. ఎవరు మంచి వ్యాసం, ఇంట ర్వ్యూ రాసినా ఫోన్ చేసిమరీ అభినందించేవారు.

 

 రంగనాథ్ గురించి ప్రపంచం గొప్పగా చెప్పుకునే ఎపిసోడ్ ఒకటి. ఆయన భార్య ప్రమాదవశాత్తూ బాల్కనీ నుంచి కింద పడి, 14 ఏళ్ళ పాటు మంచానికే పరిమితమైపోతే కట్టుకున్నవాడే కన్నబిడ్డలా సపర్యలు చేశాడు. కానీ, గొప్ప చెప్పుకోలేదు. ‘నాలో సగభాగమైన భార్యకు చేయడం సేవ ఎందుకవుతుంద’నేవారు. 2009లో ఆమె కన్ను మూశారు. ఇద్దరమ్మాయిలు, ఒకబ్బాయి ఉన్నా, అప్పటి నుంచీ ఆయన మానసికంగా ఒంటరే!

 

 రైలు ఆలస్యంతో అప్పట్లో నిర్ణయం మార్చుకున్న ఆయనకు ఈసారి నిర్ణయం మార్చుకొనే ఊతమేదీ దొరకలేదు. సమస్యలు, కారణాలే మైనా, ఒక తరాన్ని నిండైన విగ్రహం, నటనలో నిగ్రహం, విశిష్ట వాచికంతో ఆకట్టుకున్న రంగ నాథ్ చివరి పేజీ విషాద భరితంగా ఉరేసుకుంది. ఒక గొప్ప నటుడు... సాహిత్యాన్నీ, సమాజాన్నీ ప్రేమించిన భావుకుడు... ఒక మంచి భర్త, మంచి మనిషి అందరికీ కన్నీళ్ళు మిగిల్చివెళ్ళిపోయాడు.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top