తమ్మారెడ్డి రిక్వెస్ట్‌

Tammareddy Bharadwaj Request to Media Over Chicago Racket - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హాట్‌ టాపిక్‌గా మారిన చికాగో వ్యభిచార రాకెట్‌ వ్యవహారం.. అందులో టాలీవుడ్‌ నటీమణులు ఇన్‌వాల్వ్‌ అయి ఉన్నారన్న కథనాలు తెలుగు చలన చిత్రపరిశ్రమను కుదిపేస్తున్నాయి. ఈవెంట్ల పేరుతో నటీమణులను కిషన్‌-చంద్రకళ దంపతులు విదేశాలకు పిలిపించుకోవటం.. వారితో గుట్టుగా వ్యభిచారం నిర్వహించటం వెలుగుచూసింది. దీంతో కేసు నమోదు చేసిన అక్కడి పోలీసులు పక్కాగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీనియర్‌ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మీడియాకు విజ్ఞప్తి చేస్తూ ఫేస్‌బుక్‌లో ఓ వీడియోను ఉంచారు. 

‘కిషన్ గతంలో ఏవో సినిమాలు చేసి ఉండొచ్చు. కానీ, ఇపుడు అతడో విటుడిగా మారి ఈ రాకెట్ నడుపుతున్నాడు. అలాంటప్పుడు అతన్ని ఇంకా నిర్మాతగా చూపిస్తూ... తెలుగు చిత్ర పరిశ్రమతో సంబంధాలంటగట్టడం సరికాదు. కిషన్ - చంద్రకళలను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. దాంతోపాటే కొంత మంది బాధితులను కూడా కాపాడారు. ఇందులో కొంతమంది టాలీవుడ్ నటీమణులు పాల్గొని ఉండొచ్చు. అలాగనీ మొత్తం తెలుగు ఇండస్ట్రీకి ఆ రాకెట్‌తో లింకు పెట్టడం బాధాకరం. కిషన్ ఓ వ్యభిచార రాకెట్ ను నడిపిస్తున్నాడు. అతడి చేతిలో కొందరు చిక్కుకుంటే అతన్ని పింప్ అనకుండా... ఓ ప్రొడ్యూసర్ అని, సినిమావాడని సంబోధించడం సరికాదు. టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి మంచి చెడులు, రివ్యూలు రాస్తున్నారు. కానీ, ఇండస్ట్రీని డ్యామేజ్‌ చేసే కథనాలు మాత్రం రాయకండి’ అని తమ్మారెడ్డి విజ్ఞప్తి చేశారు.

ఇక నటీమణులు కూడా భవిష్యత్తులో జరిగే ఈవెంట్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ - ఫిల్మ్ చాంబర్‌లకు ఓ మాట చెప్పి విదేశీ ఈవెంట్లకు వెళితే మంచిదని సూచించారు. ‘ఈవెంట్ల పేరిట జరుగుతున్న ఈ చీకటి వ్యవహారాల్లో తెలిసో.. తెలీకో తెలుగు సంఘాలు కూడా ఇన్ వాల్వ్ అయ్యాయి. ఆ సంఘాల పేరుమీదే వీసాలు జారీ అవుతున్నాయి. ఇన్విటేషన్స్ పంపుతున్నారు. అలాంటప్పుడు వాటిని అడ్డుకోవాల్సిన బాధ్యత తెలుగు సంఘాలపై కూడా ఉంటుంది’ అని తమ్మారెడ్డి తెలిపారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top