నాకంటే అదృష్టవంతుడు ఎవరుంటారు? | Sye Raa Narasimha Reddy Becomes Second Highest Grossing Telugu Film | Sakshi
Sakshi News home page

నాకంటే అదృష్టవంతుడు ఎవరుంటారు?

Published Tue, Oct 8 2019 12:15 AM | Last Updated on Tue, Oct 8 2019 12:15 AM

Sye Raa Narasimha Reddy Becomes Second Highest Grossing Telugu Film - Sakshi

‘‘ఇప్పటి వరకూ 150 సినిమాలు చేశాను. అవన్నీ ఒక ఎత్తయితే ‘సైరా నరసింహారెడ్డి’ ఒక ఎత్తని గతంలోనూ చెప్పా.. ఇప్పుడూ చెబుతున్నా. నా గత చిత్రాలన్నింటిలో ‘సైరా’ మొదటిస్థానంలో ఉంటుంది. దీన్ని మించిన సినిమా నా నుంచి వస్తే అంతకంటే ఆనందం ఇంకే కావాలి? నాకంటే అదృష్టవంతుడు ఎవరుంటారు?’’అని చిరంజీవి అన్నారు. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి, నయనతార జంటగా    నటించిన చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’.

కొణిదెల సురేఖ సమర్పణలో రామ్‌చరణ్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 2న విడుదలైంది. ఈ సందర్భంగా ‘సైరా’ చిత్రబృందం హైదరాబాద్‌లో విలేకరులతో సమావేశమయ్యారు. విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు చిరంజీవి సమాధానమిస్తూ–‘‘సైరా’ చిత్రం కథ, కథనాలపై నమ్మకం ఉండటంతో బడ్జెట్‌కి కానీ, ఎక్కువ రోజులు షూటింగ్‌ చేయాల్సి వస్తుందని కానీ భయపడలేదు. ఈ సినిమాకి దాదాపు 285 కోట్లు బడ్జెట్‌ అయింది. అంత బడ్జెట్‌ రామ్‌చరణ్‌ పెట్టడానికి కారణం వాడి వెనుక నేను ఉన్నాననే భరోసా (నవ్వుతూ).

ఎంతో మంది నటీనటులు, సాంకేతిక నిపుణులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ‘సైరా’ ని ఇంత గ్రాండ్‌గా నిర్మించిన చరణ్‌ ఇండస్ట్రీలో నంబర్‌ 1 నిర్మాత అయ్యాడు. ‘రంగస్థలం’ చిత్రంలో చరణ్‌ నటనకు జాతీయ అవార్డు రావాలి. నిర్మాతగా, నటుడిగా, కొడుకుగా వాడికి 100కి 100మార్కులు వేస్తా. ‘సైరా’ డబ్బింగ్‌ టైంలో ‘ఇది మామూలు సినిమా కాదు. భారతీయులకు గౌరవాన్ని తీసుకొచ్చే చిత్రం. ముందుగానే అభినందనలు’ అంటూ అమితాబ్‌ బచ్చన్‌గారి నుంచి వచ్చిన ప్రశంసని మరచిపోలేను. నేను, నాగార్జున కలిసి స్వయంగా సినిమా చూశాం.

సినిమా పూర్తవగానే నన్ను గట్టిగా హత్తుకుని ‘సినిమా సూపర్‌.. చాలా బాగుంది’ అంటూ తన స్టయిల్‌లో అభినందించాడు. ఎంతోమంది నా తోటి నటీనటులు అభినందిస్తూ మెసేజ్‌లు, ట్వీట్స్‌ చేశారు. పలువురు దర్శకులు స్వయంగా నన్ను కలిసి అభినందనలు చెప్పారు. అప్పుడు నాకు అనిపించింది.. తోటి నటులు నా నటన బాగుందంటూ అభినందిస్తుంటే ‘ఇంతకంటే ఇంకేం కావాలి? అనిపించింది. ‘సైరా’ తొలిరోజు 7గంటల వరకూ కూడా సినిమా గురించి ఎటువంటి ఫీడ్‌ బ్యాక్‌ రాలేదు. సినిమా విజయంపై నమ్మకం ఉంది.

అయినా లోలోపల కొంచెం టెన్షన్‌ పడ్డాను. సినిమా సూపర్‌ అంటూ ‘బన్ని’ వాస్‌ చెప్పాడని బన్నీ (అల్లు అర్జున్‌) చెప్పాడు. మా ఇంట్లోవాడు కాబట్టి ఆ మాటలు అంత కిక్‌ ఇవ్వలేదు. ‘సినిమాకి ప్రేక్షకుల నుంచి చాలా మంచి స్పందన వస్తోంది’ అంటూ యూవీ క్రియేషన్స్‌ విక్రమ్‌ వాయిస్‌ మెసేజ్‌ పెట్టడంతో చాలా సంతోషంగా అనిపించి, నా టెన్షన్‌ పోయింది. నేను, చరణ్‌ కలిసి నటించే సినిమాపై కొన్ని గంటల్లో ప్రకటన వెలువడనుంది. చరణ్‌తో కలిసి నటించడం ఎంత సంతోషంగా ఉంటుందో నా తమ్ముడు పవన్‌ కల్యాణ్‌తో నటించడం కూడా అంతే సంతోషంగా మంచి కిక్‌ ఇస్తుంది.

నాకు, కల్యాణ్‌కి సరిపడ మంచి కథలతో వస్తే కచ్చితంగా సినిమా చేస్తాం’’ అన్నారు. పాటల రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి మాట్లాడుతూ – ‘‘సైరా’ సినిమా చూస్తుంటే యూనిట్‌ ఎంత కష్టపడ్డారో తెలుస్తోంది. చిరంజీవి ప్రాణం పెట్టి చేశాడు. ఆ పాత్రలో ఆయన్ని తప్ప ఎవర్నీ ఊహించలేం. ఆయన నటనకు హద్దుల్లేవ్‌. భారతదేశం అంతా చూడాల్సిన సినిమా ‘సైరా’. ప్రపంచంలో తెలుగు సినిమా తలెత్తుకునేలా చేసిన చిత్రమిది. ఇందులో నేను రాసిన పాటకి కచ్చితంగా జాతీయ అవార్డు వస్తుందనుకుంటున్నా’’ అన్నారు. ‘‘సైరా’ చిత్రంతో ఓ గొప్ప వీరుడి కథ చెప్పానని సంతోషంగా ఉంది. చిరంజీవిగారు ఏ రోజూ రెండో టేక్‌ తీసుకోలేదు.

ఒక్క టేక్‌లోనే అద్భుతంగా నటించేవారాయన. అందుకే ఆయన అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ మెగాస్టార్‌’’ అని సురేందర్‌ రెడ్డి అన్నారు. ‘‘సైరా’ విడుదల తర్వాత అందరూ నన్ను సాయిచంద్‌ అనడం మానేసి సుబ్బయ్య అంటూ ఫోన్లు చేస్తూ, మెసేజ్‌లు చేస్తుండటం చాలా సంతోషంగా ఉంది. నా జీవితంలో మంచి కిక్‌ ఇచ్చిన పాత్ర ఇది. తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి ఎవరెస్ట్‌ శిఖరం. అలాంటిది నా నటన బాగుందని ఆయన అభినందించడం నాకు ఆస్కార్‌ అవార్డు వచ్చినంత సంతో షం వేసింది’’ అన్నారు నటుడు సాయిచంద్‌. ‘‘రేసుగుర్రం’ టైమ్‌లో మెగాస్టార్‌గారి గురించి విన్నా. ‘సైరా’లో ఆయనతో పనిచేయడం నా అదృష్టం. అంతపెద్ద స్టార్‌ అయినా సింపుల్‌గా ఉంటారాయన’’ అన్నారు నటుడు రవికిషన్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement