చెన్నై కోర్టుకు హాజరైన నటి

Sushmita Sen appear in Chennai court

సాక్షి, చెన్నై: నటి, మాజీ ప్రపంచసుందరి సుస్మితాసేన్‌ సోమవారం ఎగ్మూర్‌ కోర్టులో హాజరయ్యారు. కారు కొనుగోలు వ్యవహారంలో  నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేయడంతో ఆమె న్యాయస్థానం ముందుకు వచ్చారు. 2005లో విదేశాల నుంచి దిగుమతి అయిన ల్యాండ్‌ క్రూజ్‌ బ్రాండ్‌ కారును రూ. 55 లక్షలకు ఆమె కొనుగోలు చేశారు. అయితే ఈ కారు 2004లో తయారైనట్లు చెన్నై హార్బర్‌లో నమోదు చేయబడింది. అదీకాకుండా ఆ కారు టాక్స్‌కు సంబంధించి తప్పుడు లెక్కలు చూపినట్లు హార్బర్‌ కస్టమ్స్‌ అధికారులు గుర్తించారు. దీంతో ఆ కారును దిగుమతి చేసిన ముంబాయికి చెందిన హరన్, బండారి తమలాలపై కేసు నమోదు చేశారు. ఈ కేసుపై ఎగ్మూర్‌ న్యాయస్థానంలో విచారణ జరుగుతోంది.

అయితే ఆ కారుకు సంబంధించి సుస్మితాసేన్‌ రూ.20.31 లక్షలను పన్నును చెల్లించారు. ఈ విషయంలో ఆమెను కస్టమ్స్‌ అధికారులు సాక్షిగా పేర్కొనడంతో గతంలో ఒకసారి ఎగ్మూర్‌ కోర్టుకు హాజరై తాను చెల్లించిన పన్ను ఆధారాలను సమర్పించి వివరణ ఇచ్చారు. ఆ తరువాత ఈ కేసులో నిందితులను క్రాస్‌ ఎగ్జామ్‌ చేయడానికి మరోసారి కోర్టుకు హాజరవ్వాల్సిందిగా సుస్మితాసేన్‌కు పలుసార్లు ఉత్తర్వులు జారీ చేసినా ఆమె హాజరు కాకపోవడంతో అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేశారు. దీంతో సుస్మిత తాను కారుకు సంబంధించి పన్నును చెల్లించానని అందువల్ల తనపై అరెస్ట్‌ వారెంట్‌ను రద్దు చేయాలని కోరారు. అదేవిధంగా ఈ కేసు నుంచి తన పేరును తొలగించాలని చెన్నై హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఆ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు నటి సుస్మితాసేన్‌ నేరుగా కోర్టుకు హాజరు కావాల్సిందేనని ఆదేశించింది. దీంతో సోమవారం ఉదయం సుస్మితాసేన్‌ ఎగ్మూర్‌ కోర్టుకు హాజరయ్యారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top