వివాదంలో సూర్య సినిమా

Suriya Sodakku song in Controversy - Sakshi

కోలీవుడ్‌లో ఆ మధ్య విజయ్‌ మెర్సల్‌ చిత్రం ఎంత వివాదాస్పదం అయ్యిందో తెలిసిందే. జీఎస్టీ డైలాగులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయని.. వాటిని తొలగించాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ చిత్ర విడుదలకు అడ్డుతగిలింది. కానీ, అది నెరవేరలేదు. ఇక ఇప్పుడు సూర్య కొత్త చిత్రం వంతు వచ్చేసింది. 

విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వంలో సూర్య నటించిన తానా సెరెందా కూటమ్‌(తెలుగులో గ్యాంగ్‌) చిత్రంలో సొడక్కు... సాంగ్‌ పిచ్చ పిచ్చగా పాపులర్‌ అయ్యింది. లిరిక్స్‌కి తగ్గట్లే అనిరుధ్‌ రవిచందర్‌ అందించిన స్వరం కుదరటంతో మాస్‌ పాటగా పెద్ద హిట్టయ్యింది. అయితే ఈ పాటలో సాహిత్యం పట్ల అన్నాడీఎంకే నేత ఒకరు పోలీస్‌ ఫిర్యాదు చేశారు. అధిగార తిమిర, పనకర పవరా, వెరట్టి వెరట్టి వెలుక తొంతు అనే పదాలు అధికార పార్టీని కించపరిచేలా ఉన్నాయంటూ సతీష్‌ కుమార్‌ అనే చెన్నై కమిషనరేట్‌లో ఫిర్యాదు చేశారు. తక్షణమే ఆ పాటను బ్యాన్‌ చేయాలని ఆయన డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు చిత్ర నిర్మాతలకు నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. 

అయితే ఈ ఆరోపణలను నిర్మాత జ్ఞానవేల్‌ రాజా ఖండించారు. అవినీతికి పాల్పడేవారికే అవి వర్తిస్తాయి. ఆయన అంతగా స్పందించారంటే బహుశా ఆయనకు ఆ పాట బాగా తగిలిందేమో. అసలు ఆయన పార్టీలో ఏ పదవిలో ఉన్నారో? నాకైతే తెలీదు. ఇప్పటిదాకా అయితే మాకు ఎలాంటి నోటీసులు అందలేదు. మీడియాలో ద్వారానే ఈ వార్తను తెలుసుకున్నాం. మెర్సల్‌ సినిమాకు వచ్చినట్లే ఈ వివాదంతో మాకు మంచి పాపులారిటీ రావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే బీజేపీ కంటే అన్నాడీఎంకే ప్రభావం తమిళనాడులో ఎక్కువ కదా అంటూ జ్ఞానవేల్‌ నవ్వుకున్నారు.  
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top