నే చెప్పేదంతా నిజం

Sruthi hariharan Statement on Arjun Sarja Molestation - Sakshi

మహిళా కమిషన్‌ ముందు శృతి హరిహరన్‌ వాంగ్మూలం  

చిత్రరంగంలో లైంగిక   వేధింపులు నిజమని విమర్శలు   

ప్రాణభయం ఉన్నా లెక్కచేయను

కర్ణాటక, యశవంతపుర: ‘నాకు భయం లేదు. నా ప్రాణానికి హాని ఉందని తెలిసినా లెక్కచేయటం లేదు’ అని ప్రముఖ నటుడు అర్జున్‌ సర్జాపై మీటూ లైంగిక వేధింపుల ఆరోపణలతో సంచలనం సృష్టించిన నటీ శ్రుతి హరిహరన్‌ అన్నారు. మీ టూ అని ఆరోపించి, మళ్లీ క్షమాపణ చెప్పిన నటి సంజన మాదిరిగా తనలో పిరికితనం లేదన్నారు. నటుడు అర్జున్‌సర్జాపై మీటూ లైంగిక ఆరోపణలపై శ్రుతి హరిహరన్‌ బుధవారం బెంగళూరులో మహిళా కమిషన్‌ ఎదుట హాజరయ్యారు. అర్జున్‌పై తను చేసిన ఆరోపణల గురించి వివరించారు. మీ టూపై సుమోటోగా కేసు దాఖలు చేసి రెండుసార్లు నోటీసులు జారీచేసినా స్పందిండం లేదని కమిషన్‌ అధ్యక్షురాలు నాగలక్ష్మీబాయి ఇదివరకే అసహనం వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో శ్రుతి న్యాయవాది అనంత్‌నాయ్‌తో కలిసి హాజరై తన ఆరోపణలపై వివరణ ఇచ్చారు. నాగలక్ష్మీబాయిశ్రుతిని ప్రత్యేక గదిలోకి తీసుకెళ్లి విచారించారు. ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసి సంతకం తీసుకున్నారు. విస్మయ సినిమా షూటింగ్‌లో తనకు అర్జున్‌ నుంచి చేదు అనుభవాలు ఎదురైనట్లు శ్రుతి ఏకరువుపెట్టారు. వరుస సెలవుల కారణంగా గత వారంలో విచారణకు రాలేకపోయిన్నట్లు చెప్పారు.

సోషల్‌ మీడియాకు ఎక్కడం సరికాదు  
ఆమెకు ఎదురైన లైంగిక వేధింపులకు సంబంధించి మహిళ కమీషన్‌కుగాని, లేదా పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలేగాని ఇలా సోషల్‌ మీడియాకు ఎక్కడం సరికాదని నాగలక్ష్మీబాయి శ్రుతికి సూచించారు. ఈ కేసు ఇప్పటికే కోర్టులో ఉన్నందున ఎవరి తరఫున మాట్లాడబోనని నాగలక్ష్మీబాయి తెలిపారు. శ్రుతి తెలిపిన వివరాలను మాత్రమే తీసుకొంటామన్నారు.

సంజన క్షమాపణలపై శ్రుతి అసంతృప్తి  
‘నాకు భయం లేదు. నా ప్రాణానికి హాని ఉందని తెలిసినా లెక్కచేయటం లేదు’ అని నటీ శ్రుతి హరిహరన్‌ అన్నారు. సంజన క్షమాపణలను చెప్పడం చూస్తే తనకు అసంతృప్తిగా ఉందన్నారు. సినిమా రంగంలో ఉన్న మహిళలు ఏదో ఒక విధంగా లైంగిక వేధింపులకు గురవుతున్నట్లు అమె ఆరోపించారు. మహిళా కమిషన్‌ అధ్యక్షురాలు నాగలక్ష్మీబాయి తనతో చర్చించిన తీరు సంతోషకరంగా ఉందన్నారు. మహిళ కమిషన్‌ ద్వారా మహిళలకు న్యాయం దొరుకుతుందనే భావన తనలో ఉందన్నారు. తన వద్దనున్న సాక్ష్యాలను ఆమెకు వివరించినట్లు తెలిపారు. తను అనవసరంగా ఆరోపణలు చేయలేదని ఆమెకు తెలిపానన్నారు. 

ఎఫ్‌ఐఆర్‌ రద్దు పిటిషన్‌ వాయిదా
బెంగళూరు సైబర్‌ క్రైం పోలీసుస్టేషన్‌లో నటి శ్రుతి హరిహరన్‌కు వ్యతిరేకంగా దాఖలైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని హైకోర్టులో వేసిన పిటిషన్‌ వచ్చే వారానికి వాయిదా పడింది. నటుడు అర్జున్‌ సర్జాపై అవహేళనగా మాట్లాడి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంపై అర్జున్‌ మేనేజర్‌ బెంగళూరు నగర పోలీసు కమిషనర్‌ సునీల్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి శ్రుతిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ను దాఖలు చేశారు. అయితే తనపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని శ్రుతి హైకోర్టుకెళ్లారు. 

నేను చక్కెర, మీరు చీమలు  
ఈ సందర్భంగా అక్కడ గుమిగూడిన విలేకరులపై శ్రుతి వ్యంగ్యోక్తులు విసిరారు. ‘నేను చక్కె రలా ఉన్నాను, మీరు చీమల మాదిరిగా నా వెంట పడుతున్నారు’ అని వ్యాఖ్యానించారు. విచారణ ముగిసిన తరువాత నేను మీడియాను గౌరవిస్తా. మీ గురించి నేనేమీ అనలేదు’ అని నవ్వుకుంటూ కారు ఎక్కారు. మరోసారి మీడియా ముందే శ్రుతిహరిహరన్‌ అర్జున్‌సర్జాపై మీ టూ లైంగిక ఆరోపణలు గుప్పించడం గమనార్హం.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top