
అదే నాకు ప్లస్ పాయింట్: నటి
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్లిన నటి తాప్సీ పన్ను తాను నటనలో శిక్షణ తీసుకున్న వ్యక్తిని కాదని అంటోంది.
కోల్ కతా: టాలీవుడ్ నుంచి బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్లిన నటి తాప్సీ పన్ను తాను నటనలో శిక్షణ తీసుకున్న వ్యక్తిని కాదని అంటోంది. అయితే ఇదే ఆమెకు ప్లస్ పాయింట్ గా మారిందట. ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. సినిమా గురించి పలు విషయాలను షేర్ చేసుకుంది. 'నేను నటనలో ఎలాంటి శిక్షణ తీసుకోలేదు. ఇదే నాకు ప్లస్ పాయింట్. ఎందుకంటే సన్నివేశానికి తగ్గట్లుగా సహజంగా నా నటన ఉంటుంది. ప్రేక్షకులు నా నుంచి ఇదే ఆశిస్తున్నారు. బేబీ, పింక్ మూవీలను ఆదరించినందిన అందరికీ కృతజ్ఞతలు. ఇంకా చెప్పాలంటే కామెడీ చేయడం కంటే తనకు సహజంగా నటించే పాత్రల్లో లీనమైపోవడమే చాలా తేలిక' అని నటి తాప్పీ తెలిపింది.
తాప్పీ ప్రధాన పాత్రలో అమిత్ రాయ్ దర్శకత్వంలో సూజిత్ సర్కార్ నిర్మించి.. తెరకెక్కిస్తోన్న మూవీ రన్నింగ్ షాదీ.కామ్. ఇందులో తన పాత్ర పేరు నిమ్మి అని, గతంలో తాను చేసిన పాత్రలకు ఇది కాస్త భిన్నంగా ఉంటుందని చెబుతోంది. తక్కువ మూవీలు చేస్తారేందుకని అడుగుతున్నారు.. కానీ తాను గత మూడేళ్లుగా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాను అంటోంది. ఇంకా చెప్పాలంటే ఈ ఏడాది ఐదు మూవీలతో మీ ముందుకు వస్తున్నాను అంటూ నవ్వేసింది ఈ ముద్దుగుమ్మ. తాప్సీ నటపై ఉన్న నమ్మకంతోనే ఆమెకు పింక్, 'రన్నింగ్ షాదీ.కామ్'లలో అవకాశాలు వచ్చాయని సూజిత్ సర్కార్ అన్నారు. తాప్సీ నటించిన మరో మూవీ 'నామ్ షబానా' మార్చి 31న విడుదలకు సిద్ధంగా ఉంది.