రాక్‌స్టారిణి

Special story to Nargis Fakhri - Sakshi

‘రాక్‌స్టార్‌’ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమైన నర్గీస్‌ ఫక్రీ మద్రాస్‌కేఫ్, డిష్యుం, హౌజ్‌ఫుల్‌–3...మొదలైన సినిమాలతో అలరించింది. హాలీవుడ్‌  సినిమా  ‘స్పై’లోనూ నటించింది. ‘అమావాస్య’ సినిమాతో ఈమధ్య తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమైంది. ‘రాక్‌స్టార్‌ యాక్ట్రెస్‌’గా పిలుచుకునే నర్గీస్‌ ఫక్రీ అంతరంగ తరంగాలు ఇవి...

అమ్మ స్ఫూర్తితో...
చాలా విషయాల్లో అమ్మే నాకు స్ఫూర్తి. ఆమె చెకోస్లోవేకియాలో పుట్టింది. వృత్తిరీత్యా  మెకానికల్‌ ఇంజనీర్‌ అయినా ప్రపంచాన్ని చూడాలనే కోరిక ఆమెలో బలంగా ఉండేది. దీంతో దేశం విడిచి వెళ్లింది.‘రెఫ్యూజీ క్యాంప్‌’లో నివసించింది. న్యూయార్క్‌కు వెళ్లిన తరువాత...ఇంగ్లిష్‌ రాక ఇబ్బందులు పడింది. ఆమెకు తెలిసిన వృత్తి కూడా అక్కడ ఉపయోగపడలేదు. దీంతో ఒక రెస్టారెంట్‌లో క్లీనర్‌గా పనిచేసింది.రాత్రి రెస్టారెంట్‌ పని, పగలు ఇంగ్లిష్‌ క్లాసులకు వెళ్లేది. ‘ఇంత కష్టం అవసరమా!’ అని ఎప్పుడూ అనుకోలేదు.

బాబోయ్‌ ఎలుగు!
నా పన్నెండవ ఏట అమ్మ నన్ను సమ్మర్‌క్యాంప్‌కు పంపింది. ఇది లో–ఇన్‌కమ్‌ ఫ్యామిలీల కోసం ఏర్పాటైన క్యాంపు. టెంటులలో ఉండేవాళ్లం. ఈ క్యాంపు పుణ్యమా అని  పనులు సొంతంగా చేసుకోవడం నేర్చుకున్నాను. నీళ్లు తెచ్చుకోవడం, వంట చేయడం, ఊడ్చడం వరకు...ఎన్నో పనులు చేశాను. ఒకరోజు మా క్యాంప్‌లోకి ఒక ఎలుగు వచ్చి నానాబీభత్సం సృష్టించింది. వెంటనే తట్టాబుట్టా సర్దుకొని వేరే చోట క్యాంప్‌ చేశాం!

సొంతకాళ్లపై...
సమ్మర్‌క్యాంప్‌ అనుభవాలు వృథా పోలేదు. నా కాళ్ల  మీద నేను  నిలబడడానికి ఉపయోగపడ్డాయి. ఇల్లు శుభ్రపరచడం, బాటిల్స్‌ కలెక్ట్‌ చేసి అమ్మడం...ఇలా చిన్నాచితకా పనులు చేసి నా చదువుకు అవసరమైన డబ్బు నేనే సంపాదించుకునేదాన్ని. చదువుకునే రోజుల్లో టీచర్‌ కావాలనుకున్నాను. ఆర్ట్‌ థెరపీ నేర్చుకోవాలనుకున్నాను. కానీ అలా జరగలేదు. నటిని అయ్యాను. నటించాలని కానీ, నటిస్తానని కానీ ఎప్పుడూ అనుకోలేదు. అమ్మలాగే ప్రయాణాలు చేయడం అంటే నాకు చాలా ఇష్టం. మోడలింగ్‌లోకి రావడం ద్వారా కొత్తప్రదేశాలు చూడటంతో  పాటు డబ్బు సంపాదించే అవకాశం దొరికింది.

మేలు చేసింది!
కోపెన్‌హాగెన్‌లో నివసించే రోజుల్లో(2010)లో ‘రాక్‌స్టార్‌’ అడిషన్‌ కోసం  బాలీవుడ్‌ డైరెక్టర్‌ ఇంతియాజ్‌ అలీ అసిస్టెంట్‌ సునయన నుంచి మెయిల్‌ వచ్చింది. ‘‘నాకు హిందీ రాదు’’ అని చేతులెత్తేశాను. కానీ ఇంతియాజ్‌ సుమారు ఆరుగంటల పాటు మాట్లాడి నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపాడు. అలా ముంబై దారి పట్టాను. ఇక్కడే హిందీ, నటన నేర్చుకున్నాను. కొత్త జీవితాన్ని ప్రారంభించాను. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top