కన్నులలో దాచుకొంటి నిన్నే నా స్వామి | Sakshi
Sakshi News home page

కన్నులలో దాచుకొంటి నిన్నే నా స్వామి

Published Sun, Jul 29 2018 1:16 AM

Special story to ghantasala wife savitri - Sakshi

‘ఆ మబ్బు తెరలలోన దాగుంది చందమామా’ అని పాడుకున్నారు వారిద్దరూ.‘ఇల్లాలే ఈ జగతికి జీవనజ్యోతి’ అని ఆవిడను చూసి అనురాగం పెంచుకున్నారాయన.‘మరుమల్లెలలో మావయ్యా... మంచి మాట సెలవీవయ్యా’ అని ఆయన మాటనే శిరోధార్యం చేసుకున్నారు ఆవిడ.‘హాయిగా ఆలుమగలై కాలం గడపాలి’ అని జీవించారు ఇరువురూ.‘ఎక్కడ ఉన్నా ఏమైనా నీ సుఖమే నే కోరుకున్నా’ అని వీడ్కోలు తీసుకున్నారు ఆయన.‘కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామీ’  అని ఆయన జ్ఞాపకాలలో జీవిస్తున్నారు ఆవిడ.

పల్లవి చరణాల వలే ఘంటసాల, ఆయన శ్రీమతి సావిత్రి ముప్పై ఏళ్ల పాటు వైవాహిక జీవితం గడిపారు. పల్లవిని విడిచి చరణం వెళ్లిపోయి నలభై ఏళ్లు దాటిపోయింది.అయినప్పటికీ ఆ పాట ఆమె మనసులో అనుక్షణం ప్రతిధ్వనిస్తూనే ఉంది. ఆ జ్ఞాపకం పదేపదే సాక్షాత్కారం అవుతూనే ఉంది. సావిత్రి ఇప్పుడు హైదరాబాద్‌లో ఉన్నారు. తెలుగువారికి ఎంతో ఆత్మీయుడైన గాయకుడి గురించి సాక్షితో తన జ్ఞాపకాలు పంచుకున్నారు.
     
ఘంటసాలను మావయ్య అని పిలిచేవారట!
సావిత్రి: మాది కృష్ణాజిల్లా రేపల్లె తాలూకా పెదపులిపర్రు గ్రామం.  ఘంటసాల మాస్టారు నాకు వేలువిడిచిన మేనత్త కొడుకు. మా ఇంట్లో నేను మూడో పిల్లను. ఘంటసాల మాస్టారు కూడా వాళ్లింట్లో మూడో సంతానమే. మావి ఉమ్మడి కుటుంబాలు. ఇరుగుపొరుగు అంతా చుట్టాలే. మా అమ్మ, మా అత్తగారిని అమ్మ అని పిలిచేది. నేను అమ్మమ్మ అనేదాన్ని. అందువల్ల ఘంటసాల మాస్టారు వరసకు బావ అయినా, ‘మావయ్య’ అని పిలిచేదాన్ని. 
     
ఘంటసాల జీవితం మలుపు తిరిగింది విజయనగరం లోనే కదా!
ఘంటసాల గారిని విజయనగరం పంపించి సంగీతం నేర్పించాలని మా మామగారి కోరిక. కాని దురదృష్టవశాత్తు ఘంటసాలకు పది సంవత్సరాల వయసున్నప్పుడు తండ్రిగారు గతించారు. వాళ్లు కాని, మేము కాని ధనవంతులం కాదు. డబ్బులు ఇచ్చి బయటకు పంపి సంగీతం చెప్పించే స్థోమత లేదు. తండ్రి మరణం తరవాత ఆయన కోర్కె ¯ð రవేర్చాలనే సంకల్పంతో, మాస్టారు తన పన్నెండో ఏట ఇంటి నుంచి పారిపోయి విజయనగరం చేరుకుని, ఐదేళ్లపాటు సంగీతం కోర్సు పూర్తి చేసి, తిరిగి వచ్చారు.  మోపిదేవి, కళ్లేపల్లి వంటి చుట్టుపక్కల గ్రామాలలో నాటకాలు వేసేవారు. స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొని 18 నెలలు జైలులో గడపడంతో, వీడికి పెళ్లి చేస్తేనే గాని నిలకడగా ఉండడు అనుకున్నారు మాస్టారి తల్లి. బంధువులందరినీ పిల్లను ఇవ్వమని అడిగారు. అందరూ తిరస్కరించారు. చివరికి మా ఇంటికి వచ్చి, మా నాన్నతో.. ‘రత్తయ్యా, మీ సావిత్రిని మావాడికి ఇవ్వచ్చు కదా’ అని అడిగారు. ‘మా పిల్ల ఇంకా చిన్నది. అప్పుడే పెళ్లేంటి’ అన్నారు  నాన్న. ‘ఇప్పుడు మాట ఇస్తే, వచ్చే సంవత్సరం వివాహం చేద్దాం’ అన్నారు ఆవిడ. మా నాన్న ‘దేవుడిని ప్రశ్న అడిగి చెప్తాను’ అన్నారట. ఆయన దేవుడిని ఏం అడిగారో, భగవంతుడు ఏం సమాధానం చెప్పాడో తెలియదు కాని, మా వివాహం నిశ్చయం అయింది.  నా పదకొండో ఏట1944 మార్చి  స్వభాను నామ సంవత్సరం ఫాల్గుణ బహుళ విదియనాడు మా వివాహం జరిగిపోయింది. పెళ్లినాటికి ఆయన వయస్సు 21 సంవత్సరాలు.

ఘంటసాలను ప్రోత్సహించింది సముద్రాల గారే కదా...
సముద్రాల రాఘవాచారిగారిది మా ఊరే. ఆయన మా ఇంటి పక్కనే ఉన్న లైబ్రరీకి వస్తుండేవారు. ఆయన ఘంటసాల మాస్టారితో పాడించుకుని, ‘నీ కంఠం ఇంత బావుంది, మద్రాసు వస్తే అవకాశాల కోసం ప్రయత్నిద్దాం’ అన్నారు. అలా ఘంటసాల గారిని మద్రాసు తీసుకువెళ్లి కొందరు పెద్దల దగ్గరకు వెళ్లమని ఉత్తరాలిచ్చి పంపారు సముద్రాల.  అప్పట్లో బిఎన్‌ రెడ్డి గారు ‘స్వర్గసీమ’ సినిమా చేస్తున్నారు. అందులో మాస్టారితో పాట పాడించారు. ఆ తరవాత గూడవల్లి వారి ‘పల్నాటి యుద్ధం’, నాగయ్య గారి ‘త్యాగయ్య’, ఘంటసాల గారి బలరామయ్యగారి ‘బాలరాజు’... ఇలా మెల్లమెల్లగా అవకాశాలు వచ్చాయి.

కాపురానికి ఎప్పుడు వచ్చారు?
మాస్టారికి మద్రాసులో ఇల్లు దొరకడం కష్టమైంది. బ్రహ్మచారులకు, అందునా సినిమా వారికి ఇల్లు అద్దెకు ఇచ్చేవారు కాదు. అందువల్ల మాకు కబురు చేసి ‘నీ పెళ్లాన్ని తీసుకువెళ్లు’ అని ఉత్తరం రాయించు, ఆ ఉత్తరం చూపిస్తే ఇల్లు దొరుకుతుందని చెప్పడంతో, మా అమ్మమ్మ మా బాబాయి చేత ఉత్తరం రాయించారు. 1947 సెప్టెంబరులో మా బంధువులు నన్ను కాపురానికి మద్రాసు పంపారు. ఆ ఇంటి మామ్మగారికి నేనంటే పంచ ప్రాణాలు. ఎప్పుడైనా మాస్టారు రికార్డింగ్‌ నుంచి రావడం ఆలస్యమైతే∙నన్ను ఆవిడ దగ్గర పడుకోబెట్టుకునేవారు. మాస్టారు వచ్చాక, ‘ఇవాళ ఇక్కడ నిద్రపోతుందిలే’ అని చెప్పేవారు. మాస్టారికి పాటల అవకాశాలు పెరిగాయి. ఇంట్లో పాటలు స్వరపరచుకోవడం కోసం తబలాలు, హార్మోనియం వాయిస్తుండేవారు. మామ్మగారు ఆ శబ్దాలకు చికాకు పడ్డారు. ‘ఈ గోల ఏంటి, ఇల్లు ఖాళీ చేసేయండి’ అన్నారు. వాళ్లకు నేను వెళ్లడం ఇష్టం లేదు. కాని మాస్టారు శబ్దం చేయడం నచ్చలేదు. అలా ఆ ఇంటి నుంచి మరో ఇంటికి మకాం మార్చాం.

మీ ఆటపాటల గురించి...
అది పెద్ద ఇల్లు. ఆ ఇంట్లో మొత్తం 30 మంది ఉండేవారు.  ఇంటి నిండా పిల్లలు. మాస్టారు రికార్డింగులకి వెళ్లగానే నేను ఇరుగుపొరుగు ఆడపిల్లలతో ఆడుకునేదాన్ని. పొరపాటున ఆయన కంటబడితే, ‘ఎవరైనా, ఘంటసాల గారి భార్య ఆడుకుంటోంది అంటుంటే ఎలా ఉంటుందో చెప్పు’ అనేవారు. ఒకరోజు ‘గుణసుందరి కథ’ చిత్రంలో  రికార్డింగుకి వెళ్లి చాలా ఆలస్యంగా వచ్చారు.  నేను ఒక్కదాన్నే ఇంట్లో ఉండవలసి రావడంతో బిగ్గరగా ఏడ్చేశాను. ఇలా అద్దె ఇళ్లలో నాలుగేళ్లు గడిచిపోయాయి. మాస్టారి ప్రాక్టీసు వల్ల ఇబ్బందులు తప్పవనే ఉద్దేశంతో, ‘మనం ఇల్లు కొనుక్కుందాం’ అని చెప్పేదాన్ని.
     
మరి కొన్నారా?
నన్ను కాపురానికి పంపుతూ మా నాన్న ‘వచ్చిన ఆదాయంలో రేపటి కోసం కొంత, ధర్మకార్యాలకు  కొంత, దైవకార్యానికి కొంత డబ్బు దాచాలి’ అని చెప్పారు. నేను మద్రాసు వచ్చిన దగ్గర్నుంచి ఆయన డబ్బులన్నీ నా చేతికే ఇచ్చేవారు. నేను జాగ్రత్తగా ఖర్చు చేస్తూ, మూడు సంవత్సరాలలో 12 వేల రూపాయలు దాచాను. ఆ డబ్బుతోనే ఇల్లు కొందామన్నాను. పదివేల రూపాయలలో ఒక ఇల్లు చూశాం. అది బాగా చిన్నది కావడంతో వద్దనుకున్నాం. అప్పుడు మాస్టారు, ‘ఇంటి విషయం నాకు వదిలై, నేను చూస్తాను’ అన్నారు. ఇలా అన్న కొద్దిరోజులకే ఉస్మాన్‌ రోడ్‌లో 40 వేలకు ఇల్లు కొన్నానని చెప్పారు. 30 వేల రూపాయలు అప్పు అంటే నాకు భయం వేసింది. కాని చాలా తొందరగానే అప్పు తీరిపోయింది. 
     
ఆ ఇల్లే మాస్టారికి కలిసొచ్చిందేమో కదా!
1950 జూన్‌ 20న గృహప్రవేశమయ్యాక అన్నీ కలిసొచ్చాయి. విజయా నాగిరెడ్డిగారు కాంపౌండ్‌ వాల్‌ కట్టించారు. అదే సంవత్సరం ఆగస్టు మాసంలో భానుమతి గారి భర్త రామకృష్ణ మా కోసం కారు బుక్‌ చేశారు. అదే సంవత్సరం డిసెంబరు 15వ తేదీ బాబు పుట్టాడు. 

అప్పటి జ్ఞాపకాలు చెప్పండి
పెద్ద అబ్బాయి పుట్టిన పదోరోజుకి 100 రూపాయలు పెట్టి రోజ్‌వుడ్‌తో తయారు చేసిన ఉయ్యాల తెచ్చారు మాస్టారు. అబ్బాయి బారసాల నాడు తన ఆర్కెస్ట్రాలో పనిచేస్తున్నవారినందరినీ పిలిచి వేడుక చేశారు. అప్పటికి విజయా కంపెనీలో పని చేస్తున్నాం కనుక ఆ పేరు వచ్చేలా బాబుకి ‘విజయకుమార్‌’ అని పేరుపెట్టుకున్నాం. ఆ రోజు ఆయన  కొన్న ఉయ్యాలను ఈ రోజు మా మునిమనవరాలికి కూడా వాడుతున్నాం. పెద్దబాబు పుట్టిన ఏడేళ్లకు మా చిన్నబాబు రత్నకుమార్‌ పుట్టాడు. పెద్ద అమ్మాయి పుట్టిన నాలుగు రోజులకి మాస్టారు ‘కాళిదాసు’ చిత్రంలో శ్యామలా దండకం పాడారు. అందువల్ల ఆమెకు ‘శ్యామల అని పేరు పెట్టాం. రెండో అమ్మాయికి – రకరకాల పేర్లు రాసి చీటీలు తీశాం. ఎక్కువ మంది తీసిన చీటీలో ‘సుగుణ’ పేరు ఉండటంతో సుగుణ అని పేరుపెట్టాం. మూడో అమ్మాయి పుట్టే నాటికి ఆంధ్రప్రభ వారపత్రికలో ‘శాంతినికేతన్‌’ అనే సీరియల్‌ వచ్చేది. అందుకని శాంతి అని పేరు పెట్టాం.
 
మాస్టారు ఇంటి విషయాలు పట్టించుకునేవారా?
ఆయనకు ఇంటి విషయాలు పట్టించుకోనవసరం లేకుండా అన్నీ నేనే చూసేదాన్ని. ఆయన బయటకు వెళ్లేటప్పుడు అన్నీ నాకు వివరాలన్నీ చెప్పేవారు. ఆయన కోసం ఎవరైనా ఫోన్‌ చేస్తే, వాళ్లకి తప్పుడు వివరాలు చెప్పకూడదనేది ఆయన ఉద్దేశం. మాస్టారు మంచి పాట పాడిన రోజున ఇంటికి వస్తూనే పాట వినిపించేవారు. బట్టలు మార్చుకోమని చెబుతున్నా వినిపించుకునేవారు కాదు. నన్ను ఆప్యాయంగా ‘రాజీ’ అని పిలిచేవారు. ఎందుకు అలా పిలుస్తారు అని ఎన్నడూ నేను అడగలేదు.

ఆయన పాటల్లో మీకు ఏవి ఇష్టం?
ఆయన పాడిన పాటలన్నీ నాకు ఇష్టమే. ఒక గంపెడు మల్లెపూలు తీసుకువచ్చి, ఇందులో ఏ పువ్వు ఇష్టం అంటే ఏం చెప్తాను. అన్నీ మల్లెలే, అన్నీ ఇష్టమే. మాస్టారు ‘బుద్ధిమంతుడు’ చిత్రంలోని ‘నను పాలింపగ నడచీ వచ్చితివా’ పాట పాడి వచ్చాక అందులోని ‘ఖైదీ’ పదాన్ని ఎన్నిరకాలుగా ప్రయోగించారో వివరించారు. ‘జయభేరి’ చిత్రంలో ‘మది శారదాదేవి మందిరమే’ పాట పాడుతుంటే ఆ పాటలో గురుస్థానంలో ఉన్న నాగయ్యగారిని చూస్తుంటే, తన గురువులు పట్రాయని సీతారామశాస్త్రిగారిని చూస్తున్నట్లు భావించేవారినని చెప్పేవారు.
   
మీ ఇంటికి ఎవరెవరు వచ్చేవారు?
మా ఇంటికి సంగీత విద్వాంసులందరూ వస్తూండేవారు. ఎవరు వచ్చినా కనీసం వారం రోజులు మా ఇంట్లోనే ఉండేవారు. ప్రముఖ వయొలిన్‌ విద్వాంసులు ద్వారం వెంకట స్వామి నాయుడుగారు ఎనిమిది మందితో కలిసి మా ఇంట్లో పదిహేను రోజులు ఉన్నారు. అన్ని రోజులూ వారికి కావలసినవన్నీ అభిమానంగా వండేదాన్ని.  బడే గులామ్‌ అలీ ఖాన్‌ కూడా తోటి విద్వాంసులతో మా ఇంటికి వచ్చినప్పుడు వారందరికీ చపాతీలు చేసి పెట్టాను. మాస్టారుతో గడిపిన మధురక్షణాలు ఎన్నని చెప్పగలను. ఇప్పుడు కూడా ఆయనతోనే గడపాలని ఉంది. ఆయన పనులన్నీ చూసిపెట్టాలని ఉంది. 
– సంభాషణ: వైజయంతి పురాణపండ

పద్మశ్రీ సమ్మతమేనా!
ఒకరోజున ఢిల్లీ నుంచి ఫోన్‌ వచ్చింది... ‘మేం కేంద్ర ప్రభుత్వం తరఫున ఫోన్‌ చేస్తున్నాం, ఘంటసాల మాస్టారికి పద్మశ్రీ ఇవ్వాలనుకుంటున్నాం, సమ్మతమేనా!’ అని అడిగారు. అరగంటలో చేయండి, మాస్టారుని అడిగి చెబుతాను అన్నాను. మాస్టారు విజయా స్టూడియోకి రికార్డింగుకి వెళ్లారు. సాధారణంగా నేను స్టూడియోలకి ఫోన్‌ చేయను. కాని మళ్లీ అరగంటలో ఫోన్‌ చేసేటప్పటికి సమాధానం చెప్పాలనే ఉద్దేశంతో మాస్టారికి ఫోన్‌ చేసి, ‘మీకు ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం అందచేయాలనుకుంటోంది, సమ్మతమేనా! అని అడుగుతున్నారు’ అన్నాను. ఆయన మౌనంగా నవ్వారు. ఆ మౌనాన్ని నేను అంగీకారంగా అర్థం చేసుకున్నాను. ఆ రోజు ఆయన ఇంటికి వచ్చేసరికి ఇంటినిండా పూల బొకేలు వచ్చి చేరాయి. ఆయన మెడ నిండా దండలతో పెళ్లికొడుకులా వచ్చారు. 

భగవద్గీత రికార్డింగు
భగవద్గీత రికార్డింగుకి మాస్టారితో స్టూడియోకి నేను కూడా వెళ్లాను. ఆ స్టూడియో చూసినవారంతా, ఇలాంటి స్టూడియోలోనా మాస్టారు ఇంత అద్భుతంగా పాడారు అనుకునేవారు. ఆయనతో ఎన్నడూ నేను రికార్డింగులకి వెళ్లలేదు. కాని ఆయన ఆరోగ్యం బాగుండకపోవడంతో ఆయన వెంట వెళ్లవలసి వచ్చింది. నన్ను చూస్తూనే, అక్కడి వారంతా, ‘అమ్మగారు వచ్చారు’ అంటూ సంబరపడ్డారు...’’ అంటూ కంట నీరు పెట్టుకున్నారు. భగవద్గీత పేరు చెబితే నాకు మాటలు రావు, ఇప్పుడు ఈ 87 ఏళ్ల వయసులో ఈ బాధను తట్టుకోలేను’ అంటూ కళ్లు తుడుచుకున్నారు సావిత్రి.  

మాస్టారు మచ్చలేని మనిషి. ఆయన కన్నుమూసినప్పుడు మిన్ను విరిగి నెత్తిమీద పడ్డట్లయింది. కుటుంబం మొత్తం కుంగిపోయింది. ఏం చేయాలో తెలియని పరిస్థితి. నా జీవితంలో ఒక అదృష్టం ఏంటంటే, మాస్టారు నాకు తెలియకుండా ఒక్క పని కూడా చేయలేదు. నాకు ఇన్‌కమ్‌ టాక్స్, వెల్త్‌ టాక్స్‌ వంటి బయటి వ్యవహారాలు తెలియవు. ఆయన లేకపోవడంతో ఆ పనులన్నీ ఆ భగవంతుడే నాకు నేర్పాడు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement