‘మరి’ "బుల్లెట్‌ దిగిందా" | Sakshi
Sakshi News home page

‘మరి’ "బుల్లెట్‌ దిగిందా"

Published Sat, Dec 1 2018 12:09 AM

Special story on  first Telugu web series - Sakshi

గ్యాంగ్‌ ఉంది... గన్నులున్నాయి..చూడ్డానికి ఆడియెన్స్‌ ఉన్నారు.రివాల్వర్‌ తిరిగినట్టు ఒక అరడజన్‌ ట్విస్టులున్నాయి.పండుగాడు లేకపోయినా దిమ్మతిరుగుద్ది.సగం టైం ఏం జరుగుతుందో తెలీక ఓ డజన్‌ ఎపిసోడ్స్‌ డజన్‌ అరటిపండ్లు జీర్ణమైనంత ఈజీగా అయితే కాదు..బాగా మైండ్‌ పెట్టాలంతే!బుల్లెట్‌ దిగిందా లేదా అన్న డౌట్‌ మాత్రం  ఆడియెన్స్‌ని ట్రిగ్గర్‌ చేస్తూనే ఉంటుంది.

లొకేషన్‌
ఒక హోటల్‌ సూట్‌ (స్వీట్‌ అనాలి) లాంటి గది. అది విశ్వకు ఇచ్చిన బస. లోపలికి వచ్చి చూస్తే పడక గదిలో మంచం మీద ‘రెడ్‌’ పడుకొని ఉంటాడు. తన గదిలోకి ఎలా వచ్చావని రెడ్‌తో గొడవపడ్తాడు. రెడ్‌ కూడా తీవ్రంగానే గొడవకు సిద్ధమవుతాడు. విశ్వ తన మేనేజర్‌ కీర్తిని పిలిచి.. రెడ్‌ తన గదిలోకి ఎలావచ్చాడు అని ప్రశ్నిస్తాడు. కీర్తి కూడా అవాక్కవుతుంది రెడ్‌ను అక్కడ చూసి. వెళ్లిపొమ్మని చెప్తుంది. కాని రెడ్‌ వినడు. దాంతో ఘర్షణ పెద్దదవుతుంది. ఎటూ పాలుపోక కీర్తి.. అజయ్‌కు ఫోన్‌ చేస్తుంది. వస్తాడు. అతను విశ్వకు తోడవడంతో రెడ్‌ తన దగ్గరున్న గన్‌ తీస్తాడు.‘‘పేలుస్తావా.. పేల్చు’ అంటూ విశ్వ అతనిని రెచ్చగొడ్తాడు. అజయ్‌ అటు విశ్వకు, ఇటు రెడ్‌కు నచ్చజెçప్తూ వారిస్తుండగానే విశ్వ, రెడ్‌ ఒకరిపై ఒకరు తలపడ్తారు. వాళ్లను ఆపే ప్రయత్నంలో ఆ ఇద్దరి మధ్యలోకి అజయ్‌ వెళ్లి రెడ్‌ చేతిలో ఉన్న గన్‌ తీసుకోబోతుండగా పేలుతుంది. రెడ్‌కు బులెట్‌ తగిలి చనిపోతాడు. కీర్తి సహా ఆ ఇద్దరూ షాక్‌ అవుతారు. దాన్నుంచి బయటపడటం ఎలా? ఆ క్షణంలోనే అజయ్‌ స్నేహితురాలు జర్నలిస్ట్‌ జాహ్నవి అక్కడకు వస్తుంది. డెడ్‌ బాడీని చూసి ఆమె కూడా అవాక్కవుతుంది. సహాయం కోసం జాహ్నవికి అసలు విషయం చెప్పేస్తాడు అజయ్‌. హెల్ప్‌ చేస్తానని మాటిచ్చి బయటకు వచ్చి ఆ ఏరియా సీఐ ఆంజనేయులుకు ఫోన్‌ చేస్తుంది. సీన్‌లోకి ఆంజనేయులు ఎంటర్‌ అవుతాడు. చనిపోయిన రెడ్‌.. కేడీ బావమరిది. కేడీ.. సీఐకి బెస్ట్‌ ఫ్రెండ్‌. ఆ విషయం బయటకు తెలియకుండా ఉండాలంటే పదికోట్లు కావాలని డిమాండ్‌ చేస్తాడు. వీళ్లు ఒప్పుకుంటారు. ఇక్కడే కథ ఓ మలుపు తిరుగుతుంది. 

ఫ్లాష్‌బ్యాక్‌
విశ్వ.. సినిమా హీరో. కీర్తి.. అతని మేనేజర్‌. అజయ్‌.. విశ్వ నటిస్తున్న సినిమా హీరోయిన్‌ ఐశ్వర్య మేనేజర్‌. కీర్తి, అజయ్‌.. క్లాస్‌మేట్స్‌. కాలేజ్‌ డేస్‌లో ప్రేమికులు కూడా. కీర్తికి వచ్చిన మోడలింగ్‌ అవకాశాన్ని తన మేల్‌ ఈగోతో అడ్డుకుంటాడు అజయ్‌. దాంతో వాళ్లిద్దరి ప్రేమ బ్రేక్‌ అవుతుంది. ఇద్దరి ధ్యేయం ఒకటే, సినిమా ఫీల్డ్‌లోకి రావాలని. ప్రొడ్యూసర్‌ కావాలని కీర్తి, డైరెక్టర్‌ కావాలని అజయ్‌ సినీరంగంలో స్ట్రగుల్‌కి సిద్ధపడ్తారు . అంతకుముందు విశ్వకు  మేనేజర్‌గా ఉన్న వ్యక్తికి  ఛాతీనొప్పి వచ్చి  విశ్రాంతి తీసుకుంటుంటాడు. అతని స్థానంలో  కీర్తి  మేనేజర్‌గా బాధ్యత తీసుకుంటుంది.  అజయ్‌ తండ్రి  ఒకప్పుడు హీరో కావాలనే తాపత్రయంతో సినీ రంగంలోకి వస్తాడు.  బ్యాక్‌గ్రౌండ్‌ లేక.. జూనియర్‌ ఆర్టిస్ట్‌గానూ సెటిల్‌ కాలేక న్యూస్‌రీడర్‌గా స్థిరపడ్తాడు. తన కొడుక్కీ తనలాంటి అనుభవమే ఎదురవుతుందేమోననే భయంతో అజయ్‌ను సినిమాలోకి వెళ్లనివ్వకుండా అడ్డుకుంటుంటాడు.  కొడుకు పట్టుదల చూశాక ఆఖరు చాన్స్‌గా ఓకే అంటాడు. డైరెక్టర్‌ కావాలని అడుగుపెట్టిన అజయ్‌కు మేనేజర్‌గా అవకాశం వస్తుంది. ఈ లైన్‌ ద్వారా లక్‌ను పరీక్షించుకుందామని చేరుతాడు. అలా కీర్తి, అజయ్‌ ఇద్దరూ హీరోహీరోయిన్‌ మేనేజర్లుగా ఒక సెట్‌ మీద తారసపడతారు. 

ఆ సినిమా వెనక కథ
విశ్వ, ఐశ్వర్య నటిస్తున్న సినిమాకు అనధికార నిర్మాత కుమార్‌ దాస్‌ ఉరఫ్‌ కేడీ. అతనొక గ్యాంగ్‌స్టర్‌. వడ్డీ వ్యాపారి కూడా. ఆయన వయసులో సగం వయసున్న అమ్మాయి కేడీని ఇష్టపడి పెళ్లి చేసుకుంటుంది. వాళ్లకు ఒక పాప. బయటివాళ్లతో కరుకుగా ఉండే కేడీ పెళ్లాం, బిడ్డలంటే ప్రాణం పెడ్తాడు. ఒకసారి చిన్న అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లిన కేడీకి వైద్య పరీక్షలు చేసి.. క్యాన్సర్‌ అని తేలుస్తారు డాక్టర్లు. అదీ అడ్వాన్స్‌డ్‌ స్టేజ్‌లో ఉందని, ఇంకెంతో కాలం బతకడనీ చెప్పేస్తారు. కుంగిపోతాడు కేడీ. తన దగ్గరున్న బ్లాక్‌ మనీని వైట్‌ చేసి.. తన తదనంతరం తన కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లేక బతికేలా చూడాలని ఆరాటపడ్తుంటాడు. అలాంటి ఏర్పాటు చేయమని మిత్రుడు సీఐ ఆంజనేయులు దగ్గరకు వెళ్తాడు. తన జబ్బు విషయమూ బయటపెట్టేస్తాడు. బాగా ఆలోచించిన ఆంజనేయులు ఆ మనీని సినిమాలో పెట్టుబడిగా పెట్టి వైట్‌ చేసుకోవచ్చని, అందుకు పాల సుబ్రహ్మణ్యమనే నిర్మాతను పట్టుకుందామని సలహా ఇస్తాడు.  సుబ్రహ్మణ్యం పాల వ్యాపారంతో పైకెదిగి సినిమా నిర్మాతగా మారి పాల సుబ్రహ్మణ్యంగా పాపులర్‌ అవుతాడు. వీళ్ల ప్రపోజల్‌ను ఒప్పుకుంటాడు. అలా విశ్వ, ఐశ్వర్య నటిస్తున్న సినిమా స్టార్ట్‌ అవుతుంది. 

మరి రెడ్‌ ఎలా ఎంటర్‌ అయ్యాడు?
సినిమా సెట్స్‌ మీదున్నప్పుడు ఐశ్వర్య, విశ్వ అందరూ కలిసి పబ్‌లో పార్టీ చేసుకుంటారు. హఠాత్తుగా ఆ పార్టీలో ఐశ్వర్య మాజీ బాయ్‌ఫ్రెండ్‌    ప్రత్యక్షమవుతాడు. అసహనంగా ఉంటాడు విశ్వ.     చిన్న రగడ అవుతుంది. ఆ గొడవతో చిరాకు పడ్డ ఐశ్వర్య.. విశ్వను, తన మాజీ బాయ్‌ ఫ్రెండ్‌ను తిట్టి వెళ్లిపోతుంది. విశ్వ హర్ట్‌ అవుతాడు. ఆ పార్టీకి అజయ్‌ ఫ్రెండ్‌ జర్నలిస్ట్‌ జాహ్నవి కూడా వస్తుంది.    ఆ వ్యవహారాన్నంతా సెల్‌ఫోన్‌లో రికార్డ్‌ చేసి తన న్యూస్‌చానల్‌కు ఫీడ్‌ ఇస్తుంది. రచ్చవుతుంది. సినిమా ఆగిపోయే పరిస్థితి వస్తుంది. పాల సుబ్రహ్మణ్యం చాకచక్యంతో ఇద్దరినీ  కన్విన్స్‌ చేసి   సినిమా ఆగిపోకుండా చూస్తాడు. కాని హీరో, హీరోయిన్‌  ఒకరినొకరు సాధించుకుంటూ  షూటింగ్‌కి ఆటంకం కలిగిస్తుంటారు. దీన్ని చక్కదిద్దడానికి తన బావమరిది రెడ్‌ను సెట్స్‌ మీదకు పంపిస్తాడు కేడీ. రెడ్‌ కూడా సినిమా హీరో కావాలనుకుంటుంటాడు. కాని బావ తనకు ఆ అవకాశం ఇవ్వకపోవడం పట్ల కొంచెం కోపంగా ఉంటాడు. రెడ్‌.. షారూఖ్‌ ఫ్యాన్‌. ట్విట్టర్‌ అంటే క్రేజీ. ఎప్పుడూ బొడ్లో గన్‌తో, నలుగురిని వెంటేసుకొని తిరుగుతుంటాడు. రెడ్‌కు తిక్కెక్కువ.  ఆ తిక్కతోనే అదిగో.. తన గన్‌ తూటాకు తనే బలవుతాడు. 

తర్వాత
కేడీకి తెలియకుండా అతని బావమరిది శవాన్ని మాయం చేయడానికి సీఐ ఆంజనేయులు అడిగిన పదికోట్ల రూపాయలను సర్దలేకపోతారు అజయ్, విశ్వ. దాంతో మండిపడ్డ ఆంజనేయులు .. రెడ్‌ శవాన్ని తీసుకుని స్టేషన్‌కు రమ్మని ఆజ్ఞాపిస్తాడు. ఆ ప్రకారం శవాన్ని తీసుకుని ఆ గది బయటకు రాగానే కేడీ ఎదురుపడ్తాడు వీళ్లకు. రెడ్‌ శవాన్ని చూసి .. ‘‘ఎవడు నా బామ్మర్దిని చంపింది’’ అంటూ  ఆంజనేయులు వారిస్తున్నా వినకుండా ఆవేశంతో   విశ్వ, అజయ్‌ మీదకు కాల్పులు జరుపుతాడు కేడీ. అజయ్‌కు తూటా తగిలి నేలకొరుగుతాడు. కంగారు పడ్తాడు ఆంజనేయులు. అప్పుడు కేడీనే ఉపాయం చెప్తాడు. అజయ్‌ శవాన్ని నువ్వు తీసుకుపో.. నా బామ్మర్ది శవాన్ని నేను తీసుకుపోతాను అని. అలాగే జరుగుతుంది. అజయ్‌ శవాన్ని ఊరవతల కొండమీదకు తీసుకెళ్లి అక్కడినుంచి చెరువులో పడేస్తాడు. అది రికార్డ్‌ అయి ఆ వీడియో మళ్లీ చానళ్లలో ప్రసారం అవుతుంది. దీనికంతటికీ ముందు కేడీకి క్యాన్సర్‌ లేదని, వైద్య పరీక్షలకోసం తీసిన బ్లడ్‌ శాంపిల్స్‌ తారుమారవడం వల్ల ఆ పొరపాటు జరిగిందని డాక్టర్లు క్షమాపణ చెప్తారు కేడీకి. ఇక టీవీలో వచ్చిన ఆంజనేయులు నిర్వాకానికి  పోలీస్‌ బాస్‌ గుస్సా అవుతాడు. వివరణ కోరుతాడు. ఆ హత్య కేడీ చేశాడని చెప్పేస్తాడు ఆంజనేయులు. కేడీని పిలిపిస్తారు. నేనెవరినీ చంపలేదు అంటాడు. అబ్ధమని వాదిస్తూ అజయ్‌ వాళ్లే రెడ్‌ని చంపారనే విషయాన్నీ బయటపెడ్తాడు. నిర్ధారణ కోసం  విశ్వను పిలిపిస్తారు. అజయ్‌ కూడా వస్తాడు.  

ఆ ట్విస్ట్‌ వెనక
సీఐ ఆంజనేయులు అడిగిన డబ్బును అరేంజ్‌ చేస్తానని ఆ స్వీట్‌ నుంచి బయటపడ్డ అజయ్‌ డైరెక్ట్‌గా కేడీ దగ్గరకు వెళ్లి నిజం చెప్తేస్తాడు పెనుగులాటలో రెడ్‌ చనిపోయినట్టు. కాగల కార్యం గంధర్వులే తీర్చినట్టు ఫీలవుతాడు కేడీ. దానికి కారణం.. కేడీకి క్యాన్సర్‌ ఉందని తేలగానే అతనికి దగ్గరున్న డబ్బును కొట్టేయాలనుకుంటాడు సీఐ ఆంజనేయులు. హీరో చాన్స్‌ ఇవ్వలేదని బావ మీద అసంతృప్తిగా ఉన్న రెడ్‌నూ రెచ్చగెట్టి అతనితో కేడీకి స్పాట్‌ పెట్టించాలని ప్లాన్‌ వేస్తాడు. రెడ్‌ ఒప్పుకుంటాడు.  దీన్ని చూసిన కేడీ అనుచరుడు  వీడియో తీసి కేడీకి చూపిస్తాడు.  నా అనుకున్న, నమ్మిన వాళ్లే మోసం చేస్తున్నారని కలత చెందుతాడు కేడీ. వాళ్లపని పట్టేందుకు సమయం కోసం వేచి చూస్తుంటాడు. అజయ్‌ వాళ్ల వల్ల రెడ్‌ లైఫ్‌కి ఎండ్‌పడడంతో హ్యాపీగా ఫీలవుతాడు కేడీ. ఇక సీఐ అంతుతేల్చడానికి అజయ్‌తో ఓ పథకం వేస్తాడు కేడీ. అదే.. అజయ్‌కు డమ్మీ బుల్లెట్‌ తగిలినట్టు నాటకం ఆడటం. శవాన్ని పడేస్తుంటే వీడియో తీయడం ఎట్‌సెట్రా. ఇంతకీ చెరువులో పడేసింది రెడ్‌ శవమన్నమాట. కేడీ అజయ్‌ను కాల్చాక.. సీఐని మాటల్లో పెడ్తాడు. ఆ టైమ్‌లో తన ప్లేస్‌లో రెడ్‌ను సీఐ జీప్‌లో పడేస్తారు అజయ్‌ అండ్‌ విశ్వ. 

లాస్ట్‌ సీన్‌
విశ్వ, ఐశ్వర్య,  కీర్తి, అజయ్‌ల మధ పొరపొచ్చాలు తొలగి ఒక్కటవుతారు.  జరిగిన ఆ కథనంతా స్క్రిప్ట్‌గా రాసి డైరెక్ట్‌ చేసే చాన్స్‌ అజయ్‌కి ఇస్తాడు కేడీ. అలా ది ఎండ్‌కి అజయ్‌ డైరెక్టర్‌ అయిపోతాడు. కథ సుఖాంతం అవుతుంది. 

తొలి తెలుగు వెబ్‌ సిరీస్‌
అమెజాన్‌ ప్లాట్‌ ఫామ్‌ మీద  స్క్రీన్‌ అయిన తొలి తెలుగు వెబ్‌సిరీస్‌ గ్యాంగ్‌స్టార్స్‌. స్క్రిప్ట్, స్క్రీన్‌ప్లే  తెలుగు సినిమా ఫక్కీలో ఉండడం వల్ల వెబ్‌ సిరీస్‌గా ఇది ఆకట్టుకోలేకపోయింది. పెద్ద తారలను తీసుకున్నారు కథ, కథనం మీద కూడా అంతే శ్రద్ధ పెడితే ఇంకా బాగుండేది.  కేడీగా జగపతిబాబు, విశ్వగా నవదీప్, ఐశ్వర్యగా శ్వేతాబసు ప్రసాద్, అజయ్‌గా సిద్ధు జొన్నలగడ్డ, కీర్తిగా అపూర్వ అరోరా, రెడ్‌గా రాహుల్‌ రామకృష్ణ, సీఐ ఆంజనేయులగా శివాజీ, పాల సుబ్రహ్మణ్యంగా పోసాని కృష్ణమురళి, విశ్వ తండ్రిగా కృష్ణ భగవాన్‌ నటించారు.  
– సరస్వతి రమ

Advertisement
 
Advertisement
 
Advertisement