
శ్రియ
‘నటిగా మీకెవరు ఇన్‌స్పిరేషన్?’ అని శ్రియను ఓ ఇంటర్వ్యూలో ‘సాక్షి’ అడిగితే... ‘శ్రీదేవి’ అన్నారు. తనకు ఆదర్శంగా నిలిచిన శ్రీదేవి భౌతికంగా దూరం కావడం జీర్ణించుకోలేకపోతున్నా అన్నారు. శ్రియ మనోభావాలు ఈ విధంగా...
► నేనీ రోజు యాక్టర్ అయ్యానంటే శ్రీదేవి గారు కూడా ఒక కారణం. నాకు చిన్నప్పుడు చికెన్ పాక్స్ వస్తే ఇంటిపట్టున ఉండాల్సి వచ్చింది. దాంతో కొద్దిసేపు శ్రీదేవిగారి డ్యాన్స్ చూసి, ఆ తర్వాత కొంచెంసేపు చదువుకునేదాన్ని. నేను చదువుకోవటానికి మా పేరెంట్స్ నాకు ఇచ్చిన లంచం ‘శ్రీదేవిగారి డ్యాన్స్ వీడియోలు’. జస్ట్ ఒక్క నిమిషం వీడియోలో కూడా శ్రీదేవిగారు చేసే మ్యాజిక్ ఎవ్వరూ చేయలేరు. ప్రస్తుతం మీడియా (అందరూ కాదు) తనకు ఏం చేస్తోందో చూస్తుంటే చాలా విచారంగా ఉంది. తన ఇమేజ్‌ను ముక్కలు ముక్కలుగా చింపేస్తున్నారు. తన పర్శనల్ లైఫ్ ఏదో సేల్‌కు ఉన్నట్లుగా... ఇప్పుడైనా తన ఆత్మను శాంతంగా ఉండనీయండి ప్లీజ్.
► హీరోయిన్ రోల్‌లో కూడా హీరో అంత డైనమిక్‌గా ఉండగల ఓకే ఒక ఉమన్ శ్రీదేవి. మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీలో థియేటర్లకు జనాల్ని రప్పించగల క్రౌడ్‌పుల్లర్ శ్రీదేవి. చాలా త్వరగా విడిచి వెళ్లిపోయారు. ఇది చాలా అన్యాయం. శ్రీదేవిగారు చనిపోయారనే విషయం తెలియగానే నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆ కన్నీళ్లు నేను ఆమెకు అందించిన నివాళి. నాకొక్క అవకాశం వస్తే తనను నేనెంతగా ఆరాధించానో, అభిమానించానో శ్రీదేవిగారికి చెప్పాలనుంది. ఆమె మనందరి మదిలో ఒక బ్యూటిఫుల్ మెమొరీ. ఎవరో మన చైల్డ్‌హుడ్ బ్యూటిఫుల్ మెమొరీని లాక్కెళ్లిపోయినట్టుగా ఉంది.