ఆమె నుంచి చాలా నేర్చుకున్నా!

She learned a lot from her! - Sakshi

తమిళసినిమా: నటి నయనతార నుంచి చాలా నేర్చుకున్నానన్నారు శివకార్తికేయన్‌. రజనీమురుగన్, రెమో వంటి ఘన విజయాల తరువాత ఆయన నటిస్తున్న తాజా చిత్రం వేలైక్కారన్‌. అగ్రతార నయనతార నాయకిగా నటిస్తున్న ఇందులో మలయాళ నటుడు ఫాహద్‌ ఫాజిల్‌ ప్రధాన పాత్ర ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అవుతున్న చిత్రం ఇది. ఇంకా ప్రకాశ్‌రాజ్, స్నేహ, ఆర్‌జే.బాలాజి, సతీష్‌  ప్రముఖ తారాగణం నటించిన ఈ చిత్రాన్ని 24 ఏఎం స్టూడియోస్‌ పతాకంపై ఆర్‌డీ.రాజా భారీ ఎత్తున నిర్మించారు. మోహన్‌రాజా కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలు నిర్వహించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ నెల 22వ తేదీన విడుదలకు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు శివకార్తికేయన్‌ వేలైక్కారన్‌ గురించి తన భావాలను పంచుకున్నారు. నేను నటించిన చిత్రాలన్నిటికంటే భారీ వ్యయంతో రూపొందిన చిత్రం ఇది. తనీఒరువన్‌ వంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రం తరువాత మోహన్‌రాజా దర్శకత్వం వహిస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొనడం సహజం. ఈ కారణంగా కూడా చిత్ర యూనిట్‌ మొత్తం ఎంతో శ్రమించారు. నేను ఇందులో అరివు అనే కార్మికుడిగా నటించాను.

కార్మికుల జీవితాలను ఆవిష్కరించే కథా చిత్రం వేలైక్కారన్‌. మంచి సామాజిక సందేశం ఉన్న కథా చిత్రంగా ఇది ఉంటుంది. ఇందులో నటి నయనతారతో తొలిసారిగా కలిసి నటించాను. తను మంచి కథా చిత్రాలను ఎంచుకుని అగ్రనటిగా రాణిస్తున్నారు. అందుకు నటనలో నయనతార చూపే అంకితభావమే కారణం. ఆమెను చూసి నేను చాలా నేర్చుకున్నాను. ఇక మలయాళ నటుడు ఫాహద్‌ ఫాజిల్‌ను ఈ చిత్రానికి ఎంపిక చేసుకోవడానికి కేరళ మార్కెట్‌ను పెంచుకోవడానికా అని అడుగుతున్నారు. ఆ పాత్రకు ఆయనైతే బాగుంటారని ఎంచుకున్నాం. చిత్రంలో రాజకీయాలు ఉంటాయా? అని అడుగుతున్నారు. అలాంటి అంచనాలను ఈ చిత్రంలో టచ్‌ చేయలేదు. ఇది ఒక మంచి సోషల్‌ మేసేజ్‌ ఉన్న చిత్రం. నేను నటించిన చాలా సీరియస్‌ చిత్రం వేలైక్కారన్‌. నిర్మాత ఆర్‌డీ.రాజా ఏ విషయంలోనూ రాజీ పడకుండా చిత్రాన్ని నిర్మించారు. చిత్ర కథకు న్యాయం చేయడానికి నిర్మాణం ఎక్కువ రోజులు పట్టింది. ఇకపై ఏడాదికి రెండు చిత్రాలు చేసేలా ప్రయత్నిస్తాను అని శివకార్తికేయన్‌ పేర్కొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top