జీరో.. మేడ్‌ ఇన్‌ ఇండియా

Shah Rukh Khan birthday and Zero trailer launch - Sakshi

‘‘ఎటువంటి పరిస్థితుల్లో అయినా పాజిటివిటీ వెతుక్కొని ముందుకు వెళ్లాలి అని చెప్పే కథ ‘జీరో’. మనలోని బలహీనతలను కూడా అంగీకరించగలిగి జీవితాన్ని పూర్తిగా జీవించాలని చెప్పే ప్రయత్నం ‘జీరో’’ అని షారుక్‌ అన్నారు. ఆనంద్‌ ఎల్‌.రాయ్‌ దర్శకత్వంలో షారుక్‌ ఖాన్, అనుష్కా శర్మ, కత్రినా కైఫ్‌ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘జీరో’. గౌరీ ఖాన్‌ నిర్మించారు. డిసెంబర్‌ 21న విడుదల కానున్న ఈ చిత్రం ట్రైలర్‌ను షారుక్‌ బర్త్‌డే సందర్భంగా  ఈనెల 2న ముంబైలో రిలీజ్‌ చేశారు.

ఈ సినిమా చిత్రీకరణ ఎక్కువ శాతం ఉత్తరప్రదేశ్‌లో మీరట్‌లో జరిగింది. అందుకే ఈ వేడుక మీరట్‌ను తలపించేలా సెట్‌ రూపొందించారు. ఈ ఫంక్షన్‌లో షారుక్‌ ఖాన్‌ మాట్లాడుతూ– ‘‘మరుగుజ్జు పాత్ర అనగానే కమల్‌ హాసన్‌ నటించిన ‘అప్పూ రాజా’తో పోల్చారు. కానీ అలాంటి కథాంశం కాదు ఈ చిత్రం. అనుష్క, కత్రినాతో ‘జబ్‌ తక్‌ హై జాన్‌’ తర్వాత మళ్లీ కలసి నటిస్తున్నాను. ఈ ప్రయాణంలో అనుష్క దగ్గర ‘నిజాయతీగా’ ఉండగలగడం, కత్రినా కైఫ్‌ దగ్గర నుంచి అనుకున్నదాని కోసం కష్టపడటం’ నేర్చుకున్నాను.

ఇప్పుడు వాళ్ల కంటే నేనే బెటర్‌ పర్సన్‌ అయ్యాననుకుంటా(నవ్వుతూ). ‘జీరో’కి  సాధారణంగా మనం విలువ ఇవ్వం. కానీ, అది ఏ అంకెకి తోడైనా దాని విలువ పెరుగుతుంది. అసలు దాన్ని లెక్కలోకి తీసుకోం. కానీ లెక్కలన్నీ దాని చుట్టూనే తిరుగుతుంటాయి. మన ఆర్యభట్టగారు ప్రపంచానికి అందించిన బహుమానం ‘జీరో’. మేడ్‌ ఇన్‌ ఇండియా చిత్రమిది. నాతో నటించిన దీపికా, అనుష్కా అందరికీ పెళ్లిళ్లు అయిపోతున్నాయి. చాలా ఆనందంగా ఉంది.

సౌత్‌ ఇండియా సినిమాల్లో నటించడానికి ఆసక్తిగా ఉన్నాను ’’ అన్నారు షారుక్‌ ఖాన్‌. ‘‘షారుక్‌ లాంటి పెద్ద స్టార్‌తో సినిమా చేస్తున్నట్టు షూటింగ్‌లో ఒక్కసారి కూడా అనిపించలేదు. ఆయనలోని సూపర్‌స్టార్‌ని నేనింకా కలవలేదు’’ అన్నారు దర్శకుడు ఆనంద్‌ ఎల్‌.రాయ్‌.  ‘‘మా పాత్రలను ఇంత కొత్తగా తీర్చిదిద్ది, సరికొత్తగా ఆవిష్కరించినందుకు దర్శకుడికి కృతజ్ఞతలు. నమ్మకమే ఈ సినిమాను నడిపింది’’ అని అనుష్కా శర్మ, కత్రినా కైఫ్‌ అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top